T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్‌లో కొత్త డ్రామాకు తెరలేపిన పాక్..నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతారట ?
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే వివాదాల హోరు మొదలైంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొంటుందా లేదా అన్నది ఒక ప్రశ్న అయితే.. ఒకవేళ ఆడితే మైదానంలో నిరసన తెలుపుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే వివాదాల హోరు మొదలైంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ పాల్గొంటుందా లేదా అన్నది ఒక ప్రశ్న అయితే.. ఒకవేళ ఆడితే మైదానంలో నిరసన తెలుపుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించడంపై గుర్రుగా ఉన్న పాక్, దానికి మద్దతుగా నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్లాన్ అమలైతే ఐసీసీ నుంచి పాక్ జట్టుకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో, ఐసీసీ ఆ జట్టును టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి తొలగించి, ఆ స్థానంలో స్కాట్లాండ్‌కు చోటు కల్పించింది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్‌కు సంఘీభావం తెలపడానికి పాక్ ఆటగాళ్లు మ్యాచ్ సందర్భంగా నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలోకి దిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సాధారణంగా నల్ల రిబ్బన్లను సంతాప సూచకంగా ధరిస్తారు, కానీ ఇక్కడ పాక్ దీనిని నిరసన ప్రదర్శనగా వాడుకోవాలని చూస్తోంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం.. క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు తమ దుస్తులు లేదా ఇతర పరికరాల ద్వారా ఎటువంటి రాజకీయ, మతపరమైన లేదా వ్యక్తిగత సందేశాలను ప్రదర్శించకూడదు. ఒకవేళ నల్ల రిబ్బన్ ధరించాలనుకుంటే, దానికి తగిన కారణం చూపుతూ ఐసీసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. గతంలో ఆస్ట్రేలియా ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా గాజా యుద్ధ బాధితులకు మద్దతుగా నల్ల రిబ్బన్ ధరించినప్పుడు ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అనుమతి లేకుండా ఇలా చేస్తే, అది నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది.
చర్యలు ఎలా ఉండొచ్చు?
నిబంధనలను ధిక్కరించి పాక్ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరిస్తే, మొదట ఐసీసీ హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా అదే తీరు కొనసాగితే, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 25 శాతం నుంచి 50 శాతం వరకు జరిమానా విధించవచ్చు. అంతకంటే తీవ్రమైన పరిస్థితి తలెత్తితే, సదరు ఆటగాళ్లపై ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల నిషేధం పడే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు పాక్ క్రికెట్ బోర్డు ఇప్పటికే జట్టును ప్రకటించినప్పటికీ, వరల్డ్ కప్ ఆడాలా వద్దా అన్నది తమ దేశ ప్రభుత్వం నిర్ణయిస్తుందని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్ నిర్ణయం టోర్నీ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుందో అని క్రికెట్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు.
