Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఊహించని షాక్..అటు సీనియర్లు..ఇటు జూనియర్లు అంతా క్లీన్ స్వీప్
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. అటు సీనియర్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి తప్పుకోవాల్సి రావడం, ఇటు అండర్-19 జట్టు ప్రపంచకప్ రేసు నుంచి నిష్క్రమించడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. అటు సీనియర్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి తప్పుకోవాల్సి రావడం, ఇటు అండర్-19 జట్టు ప్రపంచకప్ రేసు నుంచి నిష్క్రమించడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కేవలం మైదానంలో ఆట తీరు మాత్రమే కాదు, పాలనాపరమైన లోపాలు, దౌత్యపరమైన వైఫల్యాలు బంగ్లాదేశ్ క్రికెట్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ అధికారికంగా తప్పుకుంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను బీసీసీఐ ఆదేశాల మేరకు జట్టు నుంచి తొలగించడంతో వివాదం మొదలైంది. దీనికి నిరసనగా, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడబోమని బంగ్లాదేశ్ మొండికేసింది. తటస్థ వేదికలకు మ్యాచ్‌లను మార్చాలని చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తోసిపుచ్చింది. ఫలితంగా బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును వరల్డ్ కప్‌కు ఎంపిక చేశారు. దీనివల్ల బంగ్లాదేశ్ సుమారు రూ.225 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది.
మరోవైపు జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో కూడా బంగ్లాదేశ్ యువ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. సూపర్ సిక్స్ దశలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక పోరులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 136 పరుగులకే కుప్పకూలింది. రిఫాత్ బేగ్ (31), అబ్దుల్లా (25) మాత్రమే కాస్త పోరాడారు. అనంతరం 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ జట్టు కేవలం 24.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లాండ్ కెప్టెన్ థామస్ రూ (59*) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును సెమీస్ దిశగా తీసుకెళ్లాడు.
బంగ్లాదేశ్ క్రికెట్‌లో ప్రస్తుతం నెలకొన్న ఈ సంక్షోభం కేవలం ఒక్క రోజులో వచ్చింది కాదు. ఆటగాళ్లలో నిలకడ లేకపోవడం, ముఖ్యమైన మ్యాచుల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వంటి సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండర్-19 స్థాయిలో కూడా బ్యాటింగ్ ఆర్డర్ పదేపదే కుప్పకూలడం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది. అటు ఐసీసీతో గొడవలు, ఇటు మైదానంలో ఓటములు బంగ్లాదేశ్ క్రికెట్‌ను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. రాబోయే రోజుల్లో బోర్డు ప్రక్షాళన జరిగితే తప్ప బంగ్లాదేశ్ మళ్లీ పుంజుకోవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.
