“నీది పల్లెటూరి మొహం.. హీరోగా సెట్ అవ్వవు!”.. తనకు జరిగిన అవమానంపై స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!
ఆయన తెరపై కనిపిస్తే ఒక సామాన్యుడు కనిపిస్తాడు.. ఆయన మాట్లాడితే మన పక్కింటి వ్యక్తి మాట్లాడుతున్నట్లు ఉంటుంది. నటనలో ఏమాత్రం ఆడంబరం లేని ఆ నటుడు నేడు సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ స్టార్. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన చేయని ప్రయోగం లేదు.

కానీ ఒకప్పుడు ఇదే నటుడిని చూసి ఒక దర్శకుడు చాలా చులకనగా మాట్లాడారు. “నీ ముఖం సిటీ ఫేస్ కాదు.. నువ్వు పల్లెటూరి వ్యక్తిలా ఉన్నావు, నువ్వు హీరోగా పనికిరావు” అంటూ మొహం మీదే గేట్లు మూసేశారు. అప్పట్లో ఆ మాటలు విన్న ఆ నటుడు కుంగిపోలేదు, కోపంతో ఊగిపోలేదు. కేవలం తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. కట్ చేస్తే.. రెండేళ్ల తర్వాత అదే దర్శకుడు తన సినిమా కోసం డేట్స్ అడగడానికి ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు. అప్పుడు ఆ ‘మక్కల్ సెల్వన్’ ఇచ్చిన రిప్లై ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. విజయ్ సేతుపతి సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న ఆ చేదు అనుభవం వెనుక ఉన్న సంగతులేంటో తెలుసుకుందాం..

Vijay Setupathi
పల్లెటూరి మొహం..
విజయ్ సేతుపతి కెరీర్ ఆరంభంలో ఎన్నో తిరస్కరణలను ఎదుర్కొన్నారు. 2011లో తన రెండో సినిమా పూర్తయిన తర్వాత ఒక పెద్ద దర్శకుడు ఆయనను పిలిచి తీవ్రంగా అవమానించారు. “నీ ఫేస్ సిటీలో ఉండే అబ్బాయిలా లేదు.. నువ్వు పల్లెటూరి వాడిలా కనిపిస్తున్నావు” అని చెప్పి రిజెక్ట్ చేశారు. దీనిపై విజయ్ సేతుపతి స్పందిస్తూ.. “అలాంటి కారణాలతో ఒకరిని వద్దనుకునే వారికి సరైన పరిణతి లేదని నేను భావిస్తాను. అసంబద్ధమైన కారణాలతో తిరస్కరించే వారు తమ పరిజ్ఞాన లోపాన్ని బయటపెట్టుకుంటున్నారు తప్ప నాలో తప్పు లేదని నాకు తెలుసు” అని చెప్పారు.
సాధారణంగా సినిమాల్లో చూపిస్తున్నట్లు ‘ఒక అవమానం జరిగితేనే సూపర్‌స్టార్ అవుతారు’ అనే మాటను విజయ్ సేతుపతి నమ్మరు. అది ఒక తప్పుడు ప్రకటన అని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా బుద్ధి లేకుండా మాట్లాడితే వారిపై కోపం తెచ్చుకోవడం వృధా అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతరుల మనసులను మార్చడం మన చేతుల్లో లేదని, తన పిల్లల మనసునే తాను మార్చలేనప్పుడు ఇతరులను ఎలా మార్చగలనని ఆయన ప్రశ్నించారు. మనల్ని ఎవరైనా ఇష్టపడకపోతే దానిని అంగీకరించడమే సరైన మార్గమని ఆయన సూచించారు.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. విజయ్ సేతుపతిని అవమానించిన అదే దర్శకుడు, రెండేళ్ల తర్వాత మళ్ళీ ఆయన వద్దకు వచ్చారు. అప్పటికి విజయ్ సేతుపతి స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. తనను గతంలో అవమానించారనే కోపం ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా ఆయన చెప్పిన కథను విన్నారు. అయితే కథ నచ్చకపోవడంతో ఆ సినిమాను సున్నితంగా తిరస్కరించారు. ఒకవేళ కథ బాగుంటే గతాన్ని మర్చిపోయి కచ్చితంగా నటించేవాడినని, ఎందుకంటే కోపం లేదా ప్రేమ అనేవి శాశ్వతం కావని ఆయన వెల్లడించారు.
అకౌంటెంట్ నుంచి అద్భుత నటుడి వరకు..
విజయ్ సేతుపతి తన 20 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ.. 2004లో ఒక థియేటర్ గ్రూపులో అకౌంటెంట్‌గా చేరిన విషయాన్ని వెల్లడించారు. నటుడు కావాలనే బలమైన కోరికతో ఈ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి, ఎన్నో ఒడిదుడుకులను చూశానని చెప్పారు. మనుషుల మధ్య ఉండే కోపం, ప్రేమ అనేవి కొన్ని క్షణాలకే పరిమితమని.. వాటిని పట్టుకుని కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదని ఆయన ఇచ్చే స్ఫూర్తిదాయకమైన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ సేతుపతి జీవితం ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది.. మనల్ని ఎవరైనా తక్కువ చేసినప్పుడు కుంగిపోకుండా, మన సక్సెస్‌తోనే వారికి సమాధానం చెప్పాలి. తనను అవమానించిన వారిపై కూడా ద్వేషం చూపని ఆయన గొప్ప మనసు అందరికీ ఆదర్శం.
