Health: చీటికి మాటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారా.? ప్రమాదంలో పడుతున్నట్లే.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు..
Health: కొందరు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే మెడికల్ షాప్‌కు పరిగెత్తుతారు. సొంత వైద్యాన్ని అప్లై చేసి ఇష్టారాజ్యంగా ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు. పెయిన్ కిల్లర్స్ మొదలు, యాంటీబయాటిక్స్‌ను ..
Health: కొందరు ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే మెడికల్ షాప్‌కు పరిగెత్తుతారు. సొంత వైద్యాన్ని అప్లై చేసి ఇష్టారాజ్యంగా ట్యాబ్లెట్లు వేసుకుంటుంటారు. పెయిన్ కిల్లర్స్ మొదలు, యాంటీబయాటిక్స్‌ను ఎడాపెడ వాడేస్తుంటారు. నిజానికి ఏ చిన్న ట్యాబ్లెట్ అయినా డాక్టర్ సూచనమేరకే తీసుకోవాలి. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడితే రోగనిరోధ వ్యవస్థలో లోపాలు ఏర్పాడుతాయని, బ్యాక్టీరియాకు మందులను తట్టుకునే శక్తి వస్తుంది. దీంతో మున్ముందు మందులు పనిచేయవు. మరింత శక్తిమంతమైన మందులు అవసరమవుతాయని చెబుతారు. అయితే తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో మరో షాకింగ్ విషయం వెల్లడైంది.
యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడితే ప్రమాదకరమైన ఫంగల్ వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాండిడా అనే ఫంగస్ కారణంగా ప్రమాదకరమైన ఇన్వాసివ్ కాండిడియాసిస్ సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ బిర్మింగ్‌హామ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. యాంటీబయాటిక్స్‌ను అతిగా వాడడం వల్ల జీర్ణవాహికలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశిస్తాయి. దీంతో ఈ మంచి బ్యాక్టీరియా స్థానంలో కాండిడా వంటి ఫంగస్ చేరుతాయని పరిశోధనల్లో తేలింది.
ఇందులో భాగంగా పరిశోధకులు ఎలుకలపై పరిశోధనలు నిర్వహించారు. ముందుగా కొన్ని ఎలుకలకు యాంటీబయాటిక్స్ మిశ్రమాన్ని అందించారు. తర్వాత వాటికి కాండిడా ఫంగస్‌ను ఎక్కించారు. ఇక మరికొన్ని ఎలుకలకు యాంటీబయాటిక్స్ ఇవ్వకుండానే ఫంగస్‌ను ఎక్కించారు. కొద్ది సమయం తర్వాత యాంటీబయాటిక్స్ వాడిన ఎలుకల్లో ఫంగస్ ఎక్కువ ఇన్‌ఫెక్షన్ కలిగించనట్లు గుర్తించారు. ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించే సైటోకైన్స్ అనే ప్రోటీన్ల ఉత్పత్తిపై యాంటీబయాటిక్స్ తీవ్ర ప్రభావం చూపినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలేమా అంటే దానికి పరిశోధకులు ఓ ఉపయాన్ని కనుగొన్నారు. సైటోకైన్స్‌ను విడిగా ఔషధ రూపంలో అందిస్తే యాంటీబయాటిక్ అతిగా వాడడం వల్ల వ్యాధులు సోకిన వారిలో మెరుగుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.