సౌత్ డామినేషన్‌పై.. బాలీవుడ్ పోస్ట్‌మార్టమ్.. బాహుబలి తరువాత మారిన బాలీవుడ్ ఫేట్!
1957లో వచ్చిన టాలీవుడ్ సినిమా మాయాబజార్.. 1995లో తీసిన హాలీవుడ్ మూవీ బ్రేవ్‌హార్ట్. నేను ట్రిపులార్ తియ్యడానికి ఈ రెండు సినిమాలే స్పూర్తి.. దర్శకధీరుడు రాజమౌళి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. ఒకటి గమనించారా.. ఇక్కడ టాలీవుడ్ - హాలీవుడ్ మధ్య బాలీవుడ్ అనే మాట గల్లంతయింది.

1957లో వచ్చిన టాలీవుడ్ సినిమా మాయాబజార్.. 1995లో తీసిన హాలీవుడ్ మూవీ బ్రేవ్‌హార్ట్. నేను ట్రిపులార్ తియ్యడానికి ఈ రెండు సినిమాలే స్పూర్తి.. దర్శకధీరుడు రాజమౌళి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇది. ఒకటి గమనించారా.. ఇక్కడ టాలీవుడ్ – హాలీవుడ్ మధ్య బాలీవుడ్ అనే మాట గల్లంతయింది. రాజమౌళికి ఇన్‌స్పిరేషన్ ఇచ్చే సినిమాల్లో హిందీ మూవీ లేదనేగా అర్థం..! జక్కన్న ఒపీనియన్ అటుంచితే.. దశాబ్దకాలంగా దక్షిణాది సినిమాల దండయాత్రతో బీటౌన్ ఉడికిపోతోంది. నార్త్ స్టార్‌డమ్‌లో కూడా వణుకు స్టార్టయింది. లేటెస్ట్‌గా ఆమిర్‌ఖాన్ మాటలు బాలీవుడ్‌లో సరికొత్త పరివర్తన వైపు నడిపిస్తున్నాయి.
మాయాబజార్ ఒక అరుదైన కళాఖండం. పౌరాణికానికీ ఫ్యామిలీ సెంటిమెంట్‌కీ ముడిపెట్టి, మాంచి కామెడీ టైమింగ్, మెస్మరైజింగ్ మ్యూజిక్‌తో 70 ఏళ్ల కిందటే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కొట్టింది టాలీవుడ్. కమర్షియల్ సినిమా అంటే ఇది కదా.. మేకింగ్ వ్యాల్యూస్ అంటే అవి కదా.. ఆర్టిస్టుల నుంచి పెర్ఫామెన్స్ రాబట్టుకునే టాలెంట్ ఇది కదా.. అని దక్షిణాది వైపు ఓరకంట చూసింది బాలీవుడ్ ప్రపంచం. తర్వాత కూడా సౌత్ నుంచి మాయాబజార్ లాంటి ఐకానిక్ మూవీస్ చాలానే వచ్చాయి. ఉత్తరాదివాళ్లను తమవైపు చూసేలా చేశాయి. కానీ.. జక్కన్న చేసిన బాహుబలి ప్రయోగం తర్వాతే వాళ్ల కాళ్ల కింద నేల కదిలినట్టయింది.
బాహుబలి1, 2తోనే ఆగలేదు దక్షిణాది దండయాత్ర. అదే రాజమౌళి చేసిన ట్రిపులార్, ప్రశాంత్ నీల్ కేజీఎఫ్-2 అండ్ సలార్, నాగ్ అశ్విన్ తీసిన కల్కి, సుకుమార్ మేజిక్ పుష్ప.. ఇలా ఆల్‌టైమ్ రికార్డుల్ని బద్దలుగొట్టి.. బాక్సాఫీసుల దగ్గర డండనక ఆడించిన సినిమాలు వరదలా వచ్చేశాయి. ఇండియన్ సెల్యులాయిడ్‌ను సౌత్ సినిమా రూలింగ్ ఏ స్థాయిలో నడిచిందంటే.. గత పదేళ్లలో మన సినిమాలకు దక్కిన మొత్తం వసూళ్లు ఐదు వేల కోట్లకు పైమాటే. ఇక్కడ నివ్వెరపోవడం.. ఉన్నచోటే నిలబడిపోవడం బాలీవుడ్ వంతయింది. మనం అడించలేమా.. రప్పారప్పా! మనం పేల్చలేమా.. థౌజండ్‌వాలా!? అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఉత్తరకుమారులు. అదేనండీ.. ఉత్తరాదిలో వేళ్లూనుకుపోయిన స్టారాధిస్టార్లు. లేటెస్ట్‌గా.. మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ సౌత్ సినిమాపై చేసిన కామెంట్లు యమా ట్రెండింగ్‌లో ఉన్నాయ్. మనం మారాలి. మన సైన్మా మారాలి. అదే మూసలో వెళ్లామంటే వాళ్లు ఇంకా మడతెట్టేస్తారు.. అంటూ సొంత ఇండస్ట్రీని అప్రమత్తం చేశారు ఆమిర్‌ఖాన్.
హీరో ఆమిర్‌కీ రైటర్ జావేద్ అక్తర్‌కీ మధ్య నడిచిన డిబేట్‌లో బాలీవుడ్ ఉనికిపై ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరిగింది. ప్రతీ క్యాలెండర్లో డజన్లకొద్దీ సిన్మాలొస్తున్నాయి. కానీ.. గతంతో పోలిస్తే హిందీ ప్రేక్షకులు బాలీవుడ్ సిన్మాలకు కనెక్ట్ కాలేకపోతున్నారు.. మూస కథలు, రొటీన్ యాక్షన్ సీక్వెన్స్.. హిందీ ఆడియెన్స్‌కి బోర్‌కొట్టేసింది. పెద్దగా ముఖపరిచయం లేని సౌత్ హీరోల సిన్మాలు డబ్ చేసినా సూపర్‌డూపర్ హిట్ ఔతున్నాయి.. మరి బాలీవుడ్ ఆత్మపరిశీలన చేసుకోవద్దా..? అని అప్పీల్ ఇచ్చారు ఆమిర్‌ఖాన్.
2016లో ఆమిర్‌ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ మూవీ 2,200 కోట్లు వసూల్ చేసి.. బాహుబలికి దీటైన జవాబిచ్చింది. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్‌ను, మల్టిప్లెక్స్ ఆడియన్స్‌నీ కంబైన్డ్‌గా అలరించింది. ఆ తరహా మేజిక్ మళ్లీ మనం ఎందుకు చెయ్యలేకపోతున్నాం అనేది బాలీవుడ్ కొలీగ్స్‌ని ఆమిర్‌ఖాన్ అడుగుతున్న ప్రశ్న. ఇలాగే తెల్లమొహాలేసుకుని చూస్తూ కూర్చుంటే బాలీవుడ్ బాక్సులు బద్దలైపోతాయ్.. మేలుకోవాలి.. గుణపాఠాలు నేర్చుకోవాలి.. అనేది అక్కడొచ్చిన కంక్లూజన్. సో.. పూర్వవైభవాన్ని మళ్లీ సాధించుకుందామా అంటూ సౌత్ డామినేషన్‌పై నార్త్ వాళ్ల పోస్ట్‌మార్టమ్ షురూ ఐనట్టేనా..? మరి.. బాలీవుడ్‌కి బౌన్స్‌బ్యాక్ అయ్యే యోగం ఉన్నట్టేనా?!
ఒకప్పుడు ఏ ఫర్ యాపిల్.. బీ ఫర్ బాలీవుడ్. షోలే సినిమా కోసం బండ్లు కట్టుకుని థియేటర్లకెళ్లిన రోజులు గుర్తున్నాయా..? ఎయిటీస్‌లో ఆషికి సినిమా రిలీజైనప్పుడు కాలేజీలకు సెలవులిచ్చిన ముచ్చట మర్చిపోయామా..? భాష అర్థం కాకపోయినా.. డబ్బింగ్ ట్రెండు లేకపోయినా.. హిందీ సినిమాను ఎగబడి చూసిన చరిత్రుంది సౌత్ ఆడియన్స్‌కి. అసలు.. బాలీవుడ్ అంటేనే ఫేస్ ఆఫ్ ది ఇండియన్ సినిమా. ఇప్పుడు సౌత్ సినిమాతో పోటీ పడలేక హిందీ సినిమా గాడి తప్పుతోందా..?
హిందీ సినిమా అస్తవ్యస్తమవుతోంది. మన హీరోలు కనీసం హిందీలో మాట్లాడుకోవడం లేదు. మారాలి.. అంతా మారాలి. సరికొత్త బాలీవుడ్‌ని ఆవిష్కరించాలి. పని మీద కాకుండా మనీ మేకింగ్ మీదే మనోళ్లకు ఫోకస్ ఎక్కువ. బ్రాండ్ బిల్డప్పులతోనే సరిపోతోంది హిందీ హీరోలకు. ఇంకెక్కడొస్తుంది పోటీతత్వం? బాలీవుడ్ ఇంకా చచ్చిపోలేదు.. ఆసరా కోసం చూస్తోంది.. ఇప్పుడైనా రీసెట్ కావొచ్చు.. ప్రాణం పొయ్యొచ్చు.. స్టార్ల మీద కంటే టాలెంట్ మీద పెట్టుబడి పెట్టండి. ఉత్తరాది సినిమాలో ఈ ఉక్కబోత ఇప్పుడు కాదు.. ఎప్పుడో మొదలైంది. ఈ నైరాశ్యానికి కారణం నువ్వంటే నువ్వంటూ ఇండస్ట్రీలోపలే కుమ్ములాట జరుగుతోంది. నార్త్ మేకర్స్ మారాల్సిందే అంటూ అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్ లాంటి సీనియర్ హీరోలు సీరియస్ కామెంట్లు చేశారు. బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఐతే దక్షిణాది మీద అదేపనిగా పొగడ్తలు కురిపిస్తూనే ఉన్నారు.
దక్షిణాదిలో ఎప్పుడూ గొప్ప సినిమాలు చేస్తున్నారని సీనియర్ హీరో అనిల్ కపూర్ కాంప్లిమెంట్ ఇచ్చారు. నార్త్ వాళ్లు సినిమా మేకింగ్‌ను స్టాక్ మార్కెట్‌లా మార్చేశారని సొంతవాళ్లనే కార్నర్ చేశారు దర్శకుడు ఇంతియాజ్ అలీ. ముక్కూ మొహం తెలీని సౌత్ హీరోల సినిమాలు హిందీ మార్కెట్లోకొచ్చి 700 కోట్లదాకా దండుకుంటున్నాయి. మాస్ పల్స్ పట్టుకోవటంతో దక్షిణాది మాత్రమే ఎందుకు ముందుంది.. ఇన్నాళ్లూ మనం బీ, సీ సెంటర్స్‌కే పరిమితం చేసిన సౌత్ సినిమాగా ఇప్పుడు ఏక్లాస్ సినిమాగా మారి.. ఏకు మేకై కూర్చుంది కారణమేమి? కనబడ్డం లేదా మన ఫెయిల్యూర్స్ అంటూ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు ఓపెన్‌గా మాట్లాడ్డంతో బాలీవుడ్‌లో స్పష్టమైన కదలిక మొదలైనట్టుంది. సౌత్ డామినేషన్‌పై పోస్ట్‌మార్టమ్ షురూ ఐంది. కింగ్‌ఖాన్ వీర లెవల్లో పెర్ఫామెన్స్ ఇచ్చిన జవాన్, పఠాన్.. బాలీవుడ్‌లో వెయ్యికోట్లు దండుకున్న రెండు ఘరానా సినిమాలు. కానీ.. ఇలా బ్లాక్‌బస్టర్ల వాసన చూసి కూడా రెండేళ్లు దాటింది. ఆ తర్వాత బాక్సాఫీసు దగ్గర ఆ రేంజ్‌లో పంట పండించిన హిందీ సినిమా ఒక్కటైనా లేదు. రాజ్‌కుమార్‌రావు ట్రైచేసిన రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ స్త్రీ-2 గత ఆగస్టులో రిలీజై ఓ మోస్తరుగా ఆడింది. 600 కోట్లదాకా కొల్లగొట్టింది. లేటెస్ట్‌గా శంభాజీ వీరోచితగాధపై తీసిన చావా సినిమా నార్తుతో పాటు సౌత్‌నీ దున్నేసింది. ఐదొందల కోట్ల దిశగా పరుగుపెడుతోంది. సీజనల్‌గా దొరికే ఇటువంటి ఒకటీఅరా తప్పితే బీటౌన్‌లో చెప్పుకోడానికంటూ తీపి కబుర్లు లేనే లేవు.
మల్టిపుల్ హీరోలతో భారీభారీ బడ్జెట్లతో ఎన్నెన్ని ఫీట్లు చేసినా.. బాలీవుడ్‌లో బొమ్మ అడ్డం తిరుగుతోంది. ఆరేడేళ్లు కష్టపడి 400 కోట్లు పోసి తీసిన బ్రహ్మాస్త్ర సినిమాను మన జక్కన్నతో ప్రమోట్ చేయించినా లాభం లేకపోయింది. సౌత్‌లోనే కాదు నార్త్‌లో కూడా పెద్దగా ఆడలేదు బ్రహ్మాస్త్ర. వెయ్యి కోట్ల కల కలగానే మిగిలిపోతోంది. అందుకే.. మేకప్ తీసేసి, ప్యాకప్ చెప్పేసి పక్కకెళ్లి కూర్చుంది బాలీవుడ్. తప్పు ఎక్కడ జరుగుతోంది. మనమెక్కడ వెనకబడుతున్నాం.. మారాల్సింది మేకింగ్ వ్యాల్యూస్ లేక మార్కెటింగ్ స్ట్రాటజీలా..? ఇదీ అక్కడ జరుగుతున్న ఆత్మవిమర్శ.
మన దగ్గర అర్జున్‌రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగా ముంబైకి మకాం మార్చి ఎనిమల్ అనే రా అండ్ రస్టిక్ సినిమా తీసి.. బాలీవుడ్‌లోనే ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నాడు. జెనరేషన్‌కి తగ్గట్టు జానర్‌ను మార్చుకుంటూ.. ఆడియన్స్‌తో కనెక్టివిటీ ఎలా పెంచుకోవాలో బీ-టౌన్‌కి నేనే నేర్పించా అని ఓపెన్‌గా చెప్పేశారు ఎనిమల్ మూవీ మేకర్. కానీ.. మన ప్రభాస్‌ను తీసుకుని రామాయణ కావ్యంపై ప్రయోగం చేసి.. అంతులేని అప్రతిష్టను మూటగట్టుకున్నారు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్. కోట్లు ఖర్చుపెట్టి అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ చేయించినా.. అడ్డం తిరిగింది ఆదిపురుష్ ప్రాజెక్ట్. సో.. టెక్నికల్‌గా అప్‌డేట్ ఐతేనే చాలదా? ప్రేక్షకుడి నాడి పట్టిచూడాల్సిందేనా?
ఉత్తరాదిని వణికిస్తున్న దక్షిణాది. నార్త్‌లో అదరగొట్టిన బాహుబలి, పుష్పరాజ్.. అంటూ ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ.. యాభై ఏళ్ల కిందటే ఎన్టీయార్ నార్త్‌లో బ్యాక్‌టుబ్యాక్ మూడు బ్లాక్‌బస్టర్లు కొట్టారు. స్ట్రెయిట్ హిందీ సినిమాల్లో నటించమంటే అస్సలు ఒప్పుకోలేదు. టాలీవుడ్ కోసం బాలీవుడ్, హాలీవుడ్ ఛాన్సుల్ని కూడా వదులుకున్నారు. మరి.. అప్పుడు లేవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయ్. సౌత్ మీద పడి నార్త్ వాళ్లు ఎందుకు ఏడుస్తున్నట్టు..?
సౌత్ డైరెక్టర్ల కోసం నార్త్ హీరోలు, మన హీరోల కాల్‌షీట్ల కోసం బాలీవుడ్ డైరెక్టర్లు క్యూలో నిలబడ్డం కనిపిస్తూనే ఉంది. అల్లు అర్జున్‌తో సంజయ్ లీలా బన్సాలీ మంతనాలు, తమిళ డైరెక్టర్ అట్లీతో టచ్‌లో ఉన్న బాలీవుడ్ ఖాన్ సార్లు.. ఇవన్నీ రెగ్యులర్‌గా వింటూ వస్తున్న వార్తలే. అప్పటిదాకా మోనోపోలీ నడిపించిన బాలీవుడ్ పెద్దలకు ఇవన్నీ మింగుడుపడ్డం లేదా?
హీరోలూ, డైరెక్టర్లే కాదు.. హీరోయిన్లు సైతం దక్షిణాదికి దాసోహం అనడం ఒక విచిత్రమైన పరిణామం. సాహో సినిమాలో ప్రభాస్‌తో రొమాన్స్ చేశాకే.. ప్యాన్ ఇండియా ఇమేజ్ దక్కించుకుంది శ్రద్ధాకపూర్. తర్వాత రాజమౌళి ట్రిపులార్ మూవీలో పావుగంట నిడివి గల పాత్రలో నటించడం కోసం ఏడాదిన్నర కాల్‌షీట్లు ఖర్చు చేసుకోడానికీ వెనుకాడలేదు అలియాభట్. చరణ్‌తో బిగ్‌ప్రాజెక్టు చేయాలని సంకల్పించినప్పుడు శంకర్ గుడ్‌లుక్స్‌లో పడ్డానికి తెగ తంటాలు పడింది కియారా అద్వానీ. లేటెస్ట్‌గా తారక్-కొరటాల కాంబోలో వచ్చిన మల్టిలింగువల్ దేవర సినిమాలో ఆ రెండు పాటల్లో కనిపించబట్టే గ్లామరస్ క్వీన్‌గా ముద్ర వేయించుకుంది జాన్వి కపూర్. రీసెంట్ బ్లాక్‌బస్టర్ చావాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్ ఎవరంటే పుష్ప సినిమాతో పాపులరైన శ్రీవల్లేగా..?
అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌ను కోవిడ్ మరింతగా దెబ్బ కొట్టింది. భారీ పెట్టుబడులు పెట్టిన సినిమాలు రెండేళ్ల పాటు ఆగిపోవటంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా నార్త్ ఆడియన్స్ థియేటర్లకు రాకపోవటం పరిస్థితి దారుణంగా మారింది. కోవిడ్ తర్వాత బాలీవుడ్ ఆడియన్స్ ఫుట్‌ఫాల్ 40 శాతం వరకు పడిపోయింది. దాదాపు 800 వందలకు పైగా థియేటర్లు మూతపడ్డాయి. 70స్, 80స్‌లో ధర్మేంద్ర, దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్.. మదర్ ఇండియా, మొగల్ ఈ అజమ్, షోలే లాంటి సినిమాలతో బాలీవుడ్ మార్కెట్‌ని గొప్పగా క్రియేట్ చేశారు. తర్వాత మైనే ప్యార్‌కియా, హమ్‌ఆపే హైకౌన్ లాంటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలతో ఆ పునాదులు గట్టిపడ్డాయి. ఇప్పుడా ఇండస్ట్రీ ప్రమాదంలో పడిందా..?
హిందీ సినిమా ఫెయిల్యూర్‌పై ఎవరి విశ్లేషణ వారిది. సాత్ డామినేషన్‌ను జీర్ణించుకోలేకపోతున్నారని, బీటౌన్ బిగ్గీస్‌లో ఇగో సమస్య తలెత్తిందని మరో వాదనుంది. ఎందుకంటే ఉత్తరాదిన పాలిటిక్స్ తర్వాత గొప్పగా చెప్పుకోదగ్గది గ్లామర్ ఫీల్డే. కింగ్‌ఖాన్లకున్న చరిష్మాలతో అక్కడి ప్రభుత్వాలే ఆధారపడి బతికేస్తుంటాయి. సినిమా ప్రపంచాన్ని శాసించడానికి అండర్‌గ్రౌండ్‌లో ఒక చీకటి సామ్రాజ్యమే ఉంది. మరి.. అంతటి బలిష్టమైన బాలీవుడ్.. ఇలా బక్కచిక్కిపోతే… కలెక్షన్లు లేక కునారిల్లిపోతే..! ఖాన్ సాబుల కడుపు మండదా ఏంటి?