Box Office 2025: ఈ హీరోయిన్లు కనిపిస్తే కాసుల వర్షమే! లిస్ట్‌లో టాప్–5 భామలు.. ఆ బ్యూటీకి షాక్
ఈ ఏడాది కేవలం హీరోల చిత్రాలే కాకుండా, హీరోయిన్ల క్రేజ్ వల్ల కూడా బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయల వసూళ్లు నమోదయ్యాయి. ఒకప్పుడు హీరోల సినిమాలకు మాత్రమే వసూళ్ల రికార్డులు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోయిన్లు కూడా తమ క్రేజ్‌తో ..

ఈ ఏడాది కేవలం హీరోల చిత్రాలే కాకుండా, హీరోయిన్ల క్రేజ్ వల్ల కూడా బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల రూపాయల వసూళ్లు నమోదయ్యాయి. ఒకప్పుడు హీరోల సినిమాలకు మాత్రమే వసూళ్ల రికార్డులు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోయిన్లు కూడా తమ క్రేజ్‌తో బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. ముఖ్యంగా 2025వ సంవత్సరం భారతీయ నటీమణులకు ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఈ ఏడాది విడుదలైన భారీ చిత్రాల్లో నటిస్తూ, వేల కోట్ల రూపాయల వసూళ్లలో భాగస్వాములైన టాప్ 5 హీరోయిన్ల జాబితా ఇప్పుడు బయటకు వచ్చింది
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే ఎవరికైనా గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఒకే ఏడాది వరుస హిట్లు పడితే వారి క్రేజ్ ఆకాశాన్ని తాకుతుంది. 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోయిన్లు ఎవరు? ఏ భామ ఎంత కలెక్ట్ చేసింది? అనే లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లిస్టులో ఒకరు ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో అగ్రస్థానంలో నిలవగా, మరికొందరు తమ అరంగేట్రంతోనే సీనియర్లకు షాక్ ఇచ్చారు.
నంబర్ వన్ స్థానంలో నేషనల్ క్రష్!
వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ 2025లో బాక్సాఫీస్ క్వీన్‌గా అవతరించింది. గతేడాది యానిమల్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రష్మిక, ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో ఛావా, సికందర్, తమ్మ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు తమిళంలో కుబేర, తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలతో సందడి చేసింది. రష్మిక మందన్నా నటించిన చిత్రాల్లో నాలుగు సినిమాలు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. మొత్తంగా ఈ ఏడాది ఈమె ఖాతాలో రూ.1347.71 కోట్లు చేరాయి. దీంతో ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నటిగా రష్మిక రికార్డు సృష్టించింది.
సప్త సాగరాలు దాటి వచ్చి.. రెండో స్థానంలో!
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి సౌత్ మొత్తాన్ని తన మాయలో పడేసిన మరో నటి ఈ జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది రుక్మిణీ వసంత్. ఈ ఏడాది ఈమె నటించిన కాంతార చాప్టర్ 1, ఏస్, మదరాసి అనే మూడు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అలాగే శివకార్తికేయన్ సరసన నటించిన మదరాసి కూడా రూ.100 కోట్లకు పైగా రాబట్టింది. విజయ్ సేతుపతితో కలిసి నటించిన ఏస్ సినిమాలోనూ ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ ఏడాది ఈమె సినిమాల మొత్తం వసూళ్లు రూ. 962.33 కోట్లు కావడం గమనార్హం.
మూడో స్థానంలో సంచలనం!
‘నాన్న’ సినిమాలో విక్రమ్ కూతురిగా నటించి అందరినీ ఏడిపించిన ఆ చిన్నారి గుర్తుందా? ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ ఏడాది హిందీలో విడుదలైన ‘ధురంధర్’ అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైంది సారా అర్జున్. తొలి సినిమాతోనే ఏకంగా రూ.836.75 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ స్టార్లను కాదని ఈ యువ నటి మూడో స్థానంలో నిలవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Sara Arjun, Nita Padda And Kiara Advani
ఆ స్టార్ బ్యూటీకి నిరాశే!
ఈ జాబితాలో నాలుగో స్థానంలో అనీత్ పడ్డా నిలిచింది. హిందీలో ఈమె నటించిన ‘సైయారా’ సూపర్ హిట్ కావడంతో తొలి సినిమాతోనే రూ. 570.33 కోట్లు వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. ఇక ఐదో స్థానంలో కియారా అద్వానీ ఉంది. అయితే ఈ ఏడాది ఈమెకు కలిసి రాలేదని చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్, వార్ 2 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో వసూళ్లు రూ.550.63 కోట్లు వచ్చినప్పటికీ, ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చింది. మొత్తానికి 2025లో కుర్ర హీరోయిన్లు సీనియర్లకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.




