Tolywood: “నేను నపుంసకుడిని.. ఒకడ్ని ప్రేమిస్తే కోట్లు తీసుకుని మోసం చేశాడు”
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అనిల్ రాజు తన గురువు శివశంకర్ మాస్టర్, అన్నయ్య ఆనంద్ రాజ్, తల్లి స్వర్ణలత గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అత్తర సాయిబో రారా పాటతో గుర్తింపు పొందిన అనిల్ రాజు, తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, ఆస్తి వివాదాలు, యేసు ప్రభువుపై విశ్వాసం, తల్లి వారసత్వం గురించి వివరించారు.

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అనిల్ రాజు.. ప్రముఖ నేపథ్య గాయని స్వర్ణలత కుమారుడు, నటుడు ఆనంద్ రాజ్ సోదరుడు. తన జీవితంలోని వివిధ కోణాలను వెల్లడిస్తూ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అత్తర సాయిబో రారా పాటతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన అనిల్ రాజు, ఆ పాటతో పాటు మేఘమా మరువకే, రాను రాను అంటూనే చిన్నది వంటి అనేక విజయవంతమైన పాటలకు కొరియోగ్రఫీ చేశారు. శివశంకర్ మాస్టర్ తనకు గురువు అని, ఆయన నుంచి క్రమశిక్షణతో పాటు డాన్స్‌లో అనేక మెళుకువలు నేర్చుకున్నానని తెలిపారు. అనిల్ రాజు వ్యక్తిగత జీవితం అనేక సవాళ్లతో కూడుకున్నది. తాను 16 సంవత్సరాల వయస్సులో ట్రాన్స్‌జెండర్‌గా మారినప్పుడు, తన అన్నలు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారని, కొట్టారని కూడా వెల్లడించారు. ఈ కష్ట సమయంలో తన తల్లి స్వర్ణలత మాత్రమే తనను అర్థం చేసుకుని, అండగా నిలిచిందని తెలిపారు. ఆమె తనను ముద్దుగా దిలీప్ అని పిలిచేదని, తన అవసరాలన్నీ తీర్చిందని చెప్పారు.
ఒక దశలో ముంబైకి వెళ్లి హిజ్రా కమిటీలో భిక్షాటన చేశానని, అప్పుడు తన తల్లి తనను వెనక్కి తీసుకువచ్చిందని గుర్తుచేసుకున్నారు. అనిల్ రాజు తల్లి స్వర్ణలత.. గంటసాల, పిఠాపురం నాగేశ్వరరావు వంటి దిగ్గజ గాయకులతో కలిసి ఎనిమిది భాషల్లో వేల పాటలు పాడిన ప్రఖ్యాత నేపథ్య గాయని. 1945లోనే ఆల్ ఇండియా రేడియోలో గాయనిగా ప్రస్థానం ప్రారంభించి, 11 సంవత్సరాలకే సినీ నేపథ్య గాయనిగా గుర్తింపు పొందారు. ఆమె 72 సినిమాలను నిర్మించినట్లు తెలిపారు. స్వర్ణలతకు మద్రాస్‌లో వందల కోట్ల విలువైన ఆస్తులు ఉండేవని, బెంగుళూరులో కన్నడ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కూడా ఉందని అనిల్ రాజు పేర్కొన్నారు. ఆమెకు బంగారమంటే ఇష్టమని, నిండుగా నగలు ధరించేవారని తెలిపారు. అనిల్ రాజు తల్లి స్వర్ణలత మరణం విషాదకరమని, మార్చి 5న తన అక్కకు డబ్బులు ఇవ్వడానికి వెళ్తుండగా దొంగలు దాడి చేసి, తీవ్రంగా కొట్టారని, ఈ దాడిలో తాను కూడా ఉన్నానని చెప్పారు. మార్చి 10న, తన పుట్టినరోజు నాడే ఆమె మరణించిందని గుర్తుచేసుకున్నారు. ఈ దాడిలో ఆమె ఒంటిపై ఉన్న 20 లక్షల విలువైన బంగారం, నాలుగు లక్షల నగదు పోయాయని తెలిపారు.
నేను నపుంసకుడిని…
తాను నపుంసకుడిని అనిల్ రాజు బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. అబ్బాయిగా పుట్టినప్పటికీ.. చిన్నప్పటి నుంచి తనలో మగ లక్షణాలు లేవని వివరించారు. నపుంసకులు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారని.. తాను కూడా ఓ వ్యక్తిని ప్రేమించి కోటి రూపాయలు నష్టపోయినట్లు అనిల్ రాజు తెలిపారు. వాడి కోసం పిచ్చితో చేతులు కోసుకున్నానని.. అతడ్ని మర్చిపోయే క్రమంలో సంవత్సరం పాటు అమెరికాలో ఉండాల్సి వచ్చిందన్నారు. చివరకు కుక్కకు బిస్కెట్ వేశా అనుకున్నానని.. అతడ్ని పట్టించుకోవడం మానేసినట్లు తెలిపాడు. ఇక మరో వ్యక్తికి తన జీవితంలో స్థానం లేదని వెల్లడించాడు.
ప్రస్తుతం అనిల్ రాజు యేసు ప్రభువును నమ్ముకొని జీవిస్తున్నారు. క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత తన పాత అలవాట్లను, వేషధారణను మానేశానని తెలిపారు. తన తల్లి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మార్చి 10న ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని, కళాకారులకు, చర్చిలకు విరాళాలు ఇస్తున్నానని చెప్పారు. తన తల్లి సంపాదించిన 200 ఎకరాల కడపలోని పొలాన్ని అన్నదమ్ములతో పంచుకోగా, తనకు 50 ఎకరాలు వచ్చాయని తెలిపారు. తన వద్ద ఇంకా మూడు కిలోల బంగారం ఉందని కూడా వెల్లడించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
