Tollywood: టాలీవుడ్ సంక్షోభానికి తెరదింపేందుకు కోమటిరెడ్డి రాజీమార్గం
టాలీవుడ్ సంక్షోభానికి మంగళవారం శుభం కార్డు పడేలా ఉంది. 30శాతం వేతనాలు పెంచాలని 8రోజులుగా సమ్మె చేస్తున్నారు ఫెడరేషన్ కార్మికులు. కొన్ని విభాగాలకు కొంతమేర మాత్రమే పర్సెంటేజీలవారీగా పెంచుతామన్నారు ప్రొడ్యూసర్లు. ఇరుపక్షాలు పంతానికి పోవటంతో జటిలమవుతుందనుకున్న సమస్యకు.. మంత్రి కోమటిరెడ్డి జోక్యంతో ఓ పరిష్కారం దొరికేలా ఉంది.

టాలీవుడ్ సంక్షోభానికి తెరదించేందుకు రాజీమార్గం ప్రతిపాదించారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 8 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు రాజీ ఫార్ములా ప్రతిపాదించారు. మంత్రి కోమటిరెడ్డితో వేర్వేరుగా సమావేశమయ్యారు ఫిలించాంబర్, ఫెడరేషన్ ప్రతినిధులు. వేతనాల పెంపు విషయంలో తమకున్న ఇబ్బందులు, అభ్యంతరాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఫిలించాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రతినిధులు.
తమ సమస్యలను, ప్రొడ్యూసర్ల మొండివైఖరిని మంత్రి కోమటిరెడ్డికి మొరపెట్టుకున్నారు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులు. దీంతో రెండు వర్గాలకూ కొన్ని సూచనలు చేశారు మంత్రి. నిర్మాతలు, కార్మికులు కలిసి ఓ కమిటీగా ఏర్పడాలని సూచించారు. ఫెడరేషన్ ఒకేసారికాకుండా వార్షిక పద్దతిన వేతనాల పెంపునకు ఒప్పుకోవాలని సూచించారు. నిర్మాతలు కూడా కొంచెం తగ్గాలని, తారతమ్యం చూపించకుండా ఒకే తరహాలో వేతనాలు పెంచాలని సలహా ఇచ్చారు కోమటిరెడ్డి.
రెండు వర్గాలతో వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజుకు సూచించారు మంత్రి కోమటిరెడ్డి. కార్మికులు వెంటనే సమ్మె విరమించి షూటింగ్‌లు మొదలుపెట్టాలన్నారు. తమ సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు. మంగళవారం చాంబర్ భేటీలో సానుకూల స్పందన వస్తుందనే అశాభావాన్ని వ్యక్తంచేశారు.
కోమటిరెడ్డితో భేటీకి ముందు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫిలించాంబర్ ప్రెసిడెంట్‌తో పాటు ఆరుగురు నిర్మాతలు ఏపీలో సినిమాటోగ్రఫీ మంత్రిని కలుసుకున్నారు. ఏపీ సీఎం, డిప్యూటీసీఎం అప్పాయింట్‌మెంట్ కోరారు. సమస్య పరిష్కరించకుండా ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులకు ప్రొడ్యూసర్ల ప్రయత్నాలపై ఫెడరేషన్ కార్మికులు అసహనం వ్యక్తంచేశారు. అయితే సాయంత్రానికి ఇరుపక్షాలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిని కలుసుకోవటంతో.. అపోహలకు తెరపడినట్లయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




