AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sivakarthikeyan: మాట నిలబెట్టుకుంటోన్న హీరో శివకార్తికేయన్.. ఆ కుటుంబానికి ఏడేళ్లుగా ఆర్థిక సాయం

తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన తమిళ హీరోల్లో శివ కార్తికేయన్ కూడా ఒకడు. రెమో, వరుణ్ డాక్టర్, మహా వీరుడు, అమరన్ సినిమాలతో తెలుగులోనూ ఈ హీరోకు అభిమానులు ఏర్పడ్డారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. శివ కార్తికేయన్ గురించి ఒక ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Sivakarthikeyan: మాట నిలబెట్టుకుంటోన్న హీరో శివకార్తికేయన్.. ఆ కుటుంబానికి ఏడేళ్లుగా ఆర్థిక సాయం
Sivakarthikeyan
Basha Shek
|

Updated on: Jun 20, 2025 | 3:49 PM

Share

టీవీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టాడు శివ కార్తికేయన్. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ కూడా పోషించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. కేవలం నటనతోనే కాదు నిర్మాతగానూ, , సింగర్‌గా, రచయితగానూ సత్తా చాటుతూ కోలీవుడ్ లో దూసుకెళుతున్నాడీ క్రేజీ హీరో. ఇక శివ కార్తికేయన్ నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజవుతోంది. రెమో, సీమ రాజా, డాన్, డాక్టర్ వరుణ్, మహవీరుడు, అమరన్ చిత్రాలతో టాలీవుడ్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు శివ కార్తికేయన్. ప్రస్తుతం మద్రాస్, పరాశక్తి అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడీ క్రేజీ హీరో. సినిమాల సంగతి పక్కన పెడితే.. శివ కార్తికేయన్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఏడేళ్ల ముందు చనిపోయిన తమిళ రైతు నాయకుడికి ఇచ్చిన మాట ప్రకారం అప్పటి నుంచి రహస్యంగా సాయం చేస్తున్నారట ఈ హీరో. ఈ విషయాన్ని డైరెక్టర్ ఎరా శరవణన్ ఇటీవలే బయటపెట్టారు.

‘నా సోదరుడైన నెల్ జయరామన్ కన్నుమూసినప్పుడు అతని కుమారుడి చదువుకు అయ్యే ఖర్చులను తాను భరిస్తానని శివ కార్తికేయన్ హామీ ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఏడేళ్లుగా రహస్యంగా అతను సాయం చేస్తూనే ఉన్నారు. సాధారణంగా ఎవరైనా కష్టాల్లో ఉంటే కొందరు పరామర్శించి తాము అండగా ఉంటామని హామీలు ఇస్తుంటారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే మాట నిలబెట్టుకుంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో శివ కార్తికేయన్ ఒకడు. నెల్ జయరామన్ కుమారుడైన శ్రీనివాసన్‌ ఏడేళ్లుగా విద్యా ఖర్చులు భరించడమే కాకుండా వార్షిక పరీక్షల సమయంలో ఫోన్ చేసి అతనితో మాట్లాడతారు. శ్రీనివాసన్ ఇప్పుడు కోయంబత్తూరులోని కర్పగం కాలేజీ చదువుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోగా నిలిచారు’ అని శివ కార్తికేయన్ పై ప్రశంసలు కురిపించాడు శరవణన్.

ఇవి కూడా చదవండి

కాగా రైతు నాయకుడైన నెల్ జయరామన్ 2018, డిసెంబర్ నెలలో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. జయరామన్‌ని అప్పట్లో ఆస్పత్రిలో పరామర్శించిన శివ కార్తికేయన్ ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడేళ్లుగా ఆయన కుమారుడి చదువుకు ఆర్థిక సాయం చేస్తున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో శివ కార్తికేయన్‌పై సినీ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి