Mangli: కావాలనే నన్ను ఇరికించారు.. అన్యాయం జరిగినవారికి అండగా ఉంటానంటున్న మంగ్లీ
మైక్రో ఫైనాన్స్ కేసు, గంటకో ట్విస్ట్.. పూటకో మలుపు తిరుగుతోంది. సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో మధు అండ్ గ్యాంగ్ కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో నిందితులుగా ఉన్న రమావత్ మధు, బాలాజీనాయక్, భరత్ చౌహాన్‌పై నల్గొండ, గద్వాల్‌లో 62 కేసులు నమోదయ్యాయి.

మైక్రో ఫైనాన్స్, శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేరుతో జరిగిన ఆర్థిక మోసం కేసులో తనపై వస్తున్న ఆరోపణలకు గాయని మంగ్లీ స్పందించారు. ఈ వ్యవహారంలో బాధితులకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ… వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మోసం కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పిన మంగ్లీ… కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నిజం తప్పకుండా బయటపడుతుందని, తాను చట్టాన్ని, న్యాయవ్యవస్థను సంపూర్ణంగా గౌరవిస్తానని పేర్కొన్నారు. ఇక, న్యాయ ప్రక్రియపై పూర్తి నమ్మకం ఉందని చెబుతూ… చట్టపరమైన మార్గంలోనే అన్ని విషయాలు స్పష్టమవుతాయని ఆమె వెల్లడించారు.
ఇది కూడా చదవండి: 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది
మైక్రో ఫైనాన్స్, శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేర్లతో నడిచిన ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, భూములపై పెట్టుబడులు పెడితే త్వరగా రిటర్న్స్ వస్తాయని చెప్పి అనేక మందిని ఆకర్షించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, చిన్న వ్యాపారులు, గ్రామీణ పెట్టుబడిదారులు లక్ష్యంగా చేసుకుని ఈ స్కీమ్ నడిపినట్టు బాధితులు చెబుతున్నారు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే నెలనెలా లాభాలు, కొంత కాలానికి డబుల్ అవుతుందనే హామీలతో డబ్బులు సేకరించినట్టు సమాచారం. కొందరికి ప్రారంభంలో చిన్న మొత్తాలు తిరిగి ఇచ్చి నమ్మకం కల్పించి… తర్వాత పెద్ద మొత్తాలు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
అనంతరం సంస్థ కార్యకలాపాలు మందగించడం, చెల్లింపులు ఆగిపోవడం వల్ల అనుమానాలు మొదలయ్యాయి. బాధితుల ప్రకారం, కోట్ల రూపాయల వరకు డబ్బులు ఈ వ్యవహారంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పలువురు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసినట్టు సమాచారం. ఈ కేసులో కొందరిపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యి విచారణ కొనసాగుతోంది. ఈ వివాదంలో ప్రముఖ గాయని మంగ్లీ పేరు బయటకు రావడంతో చర్చ మరింత వేడెక్కింది. అయితే ఈ ఆరోపణలను ఆమె పూర్తిగా ఖండించారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ… ఈ మోసంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తన పేరును ఈ కేసులోకి లాగుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.




