AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: ఏమీ లేనప్పుడు ఆ వ్యక్తి కడుపు నింపిన చిరంజీవి.. ఇప్పుడు ఆయన కూడా అగ్ర నటుడు

సీనియర్ నటుడు నాజర్ తన సినీ ప్రస్థానం తొలినాళ్లలో ఎదురైన పరిస్థితులను, చిరంజీవితో ఏర్పడిన స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు హోటల్లో పనిచేస్తున్న సమయంలో చిరంజీవి ఎలా గుర్తించారో వివరించారు. కష్టకాలంలో చిరంజీవి చూపిన దయ, ఆహారం పంచుకున్న తీరు తనకెప్పటికీ గుర్తుండిపోతాయని నాజర్ తెలిపారు.

Chiranjeevi: ఏమీ లేనప్పుడు ఆ వ్యక్తి కడుపు నింపిన చిరంజీవి.. ఇప్పుడు ఆయన కూడా అగ్ర నటుడు
Chiranjeevi Nassar
Ram Naramaneni
|

Updated on: Jan 05, 2026 | 4:37 PM

Share

సీనియర్ నటుడు నాజర్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో తన సుదీర్ఘ అనుబంధాన్ని, అరుదైన స్నేహాన్ని ఆత్మీయంగా పంచుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించక ముందు హోటల్ ఉద్యోగిగా ఉన్నప్పుడు చిరంజీవితో జరిగిన ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నై ఫిల్మ్ ఛాంబర్ సమీపంలో ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో, నాజర్ తన సైకిల్‌పై వెళ్తూ చిరంజీవిని చూశారట. చిరంజీవి గతంలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న పరిచయంతో ఆయన్ని గుర్తించి.. “నాజర్, ఏం చేస్తున్నావు?” అని ఆత్మీయంగా వాకబు చేశారట. నాజర్ తాను హోటల్లో పనిచేస్తున్నానని చెప్పగా, చిరంజీవి ఆశ్చర్యపోయి, “ఇంత మంచి నటుడివి నువ్వు హోటల్లో ఎందుకు పనిచేస్తావు? రా, నేను రికమెండ్ చేస్తాను” అని మరుసటి రోజు కలవమని ఆహ్వానించారు. అయితే, ఆ సమయంలో నాజర్‌కు సినిమా రంగంపై పెద్దగా నమ్మకం లేదు. నెలకు జీతం వచ్చే హోటల్ ఉద్యోగమే సురక్షితమని, సినిమా ఎప్పుడు వస్తుందో, ఎలా నిలబడాలో తెలియదని ఆయన భావించారు. అందుకే చిరంజీవి పిలిచినా వెళ్లలేదు. ఆ తర్వాత చిరంజీవి ఒక పెద్ద స్టార్‌గా ఎదిగారు. నాజర్ కూడా బాలచందర్ గారి సినిమాలతో మెల్లగా క్యారెక్టర్ యాక్టర్‌గా, విలన్‌గా మారారు.

అయితే ఇన్నేళ్ల ఇద్దరి ఫిల్మ్ జర్నీలో ఖైదీ నెంబర్ 150 సినిమా సమయంలో మళ్లీ వారిద్దరికీ నటించే అవకాశం వచ్చింది. నాజర్ మాట్లాడుతూ.. “నేను వెళ్లి నాకు వేషం ఇయ్యి అని అడగను. చిరంజీవికి కూడా నా మనస్తత్వం తెలుసు. మా స్నేహం చాలా ఆత్మగౌరవంతో కూడుకుంది. ఒకరినొకరు ఏమీ ఆశించలేదు” అని అన్నారు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో చిన్న పాత్ర చేశానని.. ఆ సమయంలో తాము ఇద్దరం మాట్లాడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు నాజర్ తెలియజేశారు.  “నాజర్ మనం కలిసి నటించేందుకు చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. ఇది పెద్ద పాత్ర కాకపోవచ్చు. కానీ ఇలాఎందుకు జరిగిందో నాకు తెలియదు. నీ మనస్తత్వం నాకు తెలుసు. నేను ఎవరికైనా సిఫారసు చేస్తే నీకు నచ్చదు” అని చిరంజీవి చెప్పినప్పుడు తమ కళ్లల్లో నీళ్లు తిరిగాయని నాజర్ గుర్తు చేసుకున్నారు. తమ మధ్య ఎప్పుడూ స్వార్థం లేదని, కేవలం స్నేహం మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు.

Also Read: తెలుగులో అత్యధిక ఫ్యాన్స్ వచ్చిన మూవీ ఈవెంట్ ఎవరిదో తెలుసా..?

అత్యంత హృద్యమైన సంఘటన ఏమిటంటే.. నాజర్ అప్పట్లో చెన్నైకి 60 కి.మీ దూరంలో ఉన్న జంగల్ పట్నం నుంచి రైలులో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చేవారట. ఉదయం ఆరు గంటలకు బయలుదేరాల్సి ఉండటంతో, ఆయన తల్లి అన్నం మాత్రమే వండి లంచ్ బాక్స్‌లో ఇచ్చేవారు. ఒకరోజు నాజర్ కేవలం అన్నం మాత్రమే తింటుండగా చిరంజీవి చూశారు. వెంటనే.. “నిన్ను చంపేస్తాను. మళ్లీ రేపటి నుంచి మీ అమ్మతో వంట చేయించకు. రేపటి నుంచి నువ్వు మాతోనే తినాలి” అని చిరంజీవి పట్టుబట్టారట. “లేదు, మీరు సాంబారు ఇస్తే చాలు” అని నాజర్ అనగా, “మేము ఏడుగురం తింటున్నాం, నువ్వు మాలో ఒకడివి?” అని చిరంజీవి అన్నారట. ఆ రోజు నుంచి చిరంజీవి తనతో పాటు భోజనం చేయించారని, ఆ దయను ఎప్పటికీ మర్చిపోలేనని  నాజర్ తెలిపారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లినా, పెద్ద స్టారైనా తనకు చిరంజీవి అంటే ఆ రోజుల్లో చూపిన దయగల స్నేహితుడిగానే గుర్తున్నారని నాజర్ వివరించారు. ఒకరోజు చిరంజీవితో గడిపిన సమయం వంద సినిమాలతో సమానం అని ఆ వ్యాఖ్యానించడం విశేషం.

Nassar Chiranjeevi

Nassar  – Chiranjeevi

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.