AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chalapati Rao : నాలుగు తరాల నటులతో నటించిన చలపతిరావు.. సీనియర్ ఎన్టీఆర్‏తో ప్రత్యేక అనుబంధం..

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణవార్త మరువక ముందే మరో నటుడి కన్నుమూత ఇండస్ట్రీ దిగ్ర్భాంతికి గురిచేసింది. మూడు తరాల నటులతో కలసి పనిచేసిన సీనియర్ నటుడు చలపతి రావు గుండెపోటు మరణించారు.

Chalapati Rao : నాలుగు తరాల నటులతో నటించిన చలపతిరావు.. సీనియర్ ఎన్టీఆర్‏తో ప్రత్యేక అనుబంధం..
Chalapathi Rao Biography
Rajitha Chanti
|

Updated on: Dec 25, 2022 | 9:06 AM

Share

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చలపతిరావు దాదాపు 1200కు పైగా సినిమాల్లో నటించారు. పలు సినిమాల్లో నటుడిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. విభిన్న పాత్రలతో తెలుగుతెరపై తనదైన ముద్ర వేశారు చలపతిరావు. గత రెండు రోజుల క్రితం సీనియర్ నటుడు నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతిని జీర్ణించుకోకముందే చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకోవడంతో తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ దుఃఖంలో మునిగిపోయింది. చలపతి రావు మరణం ఇండస్ట్రీకి తీరని లోటని.. ఈఏడాది తెలుగు సినీపరిశ్రమలో లెజండరీ నటులను కోల్పోయింది.

1944 మే8న కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రులో చలపతి రావు జన్మించారు. ఆయనకు కుమారుడు రవిబాబు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాటకాల్లో రాణించిన ఆయన, సినిమాపై మక్కువతో అనేక విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించారు. 90వ దశకంలో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున,బాలయ్య వంటి అగ్రహీరోలతో నటించారు. 1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి 116 సినిమతో సినీరంగ ప్రవేశం చేసిన చలపతి రావు.. దాదాపు 1200లకు పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగానే కాదు.. నిర్మాతగానూ గుర్తింపు పొందారు. ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా.. సహయ నటుడిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కలియుక కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

సీనియర్ ఎన్టీఆర్ తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. మూడు తరాల నటులతోనూ ఆయన నటించారు. యమగోల, యుగపురుషుడు, డ్రైవర్ రాముడు, అక్బర్ సలీమ్ అనార్కలి, భలే కృష్ణుడు, సరదా రాముడు, జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, చట్టంతో పోరాటం, అల్లరి రాముడు, అల్లరి, నిన్నే పెళ్లాడతా, సింహాద్రి, బన్నీ, బొమ్మరిల్లు, అరుంధతి, సింహా, దమ్ము, లెజెండ్ ఇలా ఎన్నో వందల సినిమాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు. చలపతి రావు చివరిసారిగా గతేడాది విడుదలైన బంగార్రాజు చిత్రంలో కనిపించారు. చలపతి రావు మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చలపతి రావు కుమార్తె అమెరికాలో ఉంటున్నారు. ఆమె వచ్చిన తర్వాత ఆయన అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచి బుదధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.