Santhana Prapthirasthu movie review: సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకోండి..
ఈ మధ్య చిన్న సినిమాలలో వస్తున్న కాన్సెప్టులు చాలా విభిన్నంగా ఉంటున్నాయి. అలా వచ్చిన సినిమానే సంతాన ప్రాప్తిరస్తు. మగవాళ్లలో పిల్లల్ని కనే సామర్థ్యం అనే సెన్సిటివ్ కాన్సెప్టుతో వచ్చింది ఈ చిత్రం. మరి ఇది ఆకట్టుకుందా లేదా అనేది తెలుసుకుందాం ...

మూవీ రివ్యూ: సంతాన ప్రాప్తిరస్తు నటీనటులు: విక్రాంత్ రెడ్డి, చాందినీ చౌదరి, మురళీధర్ గౌడ్, అభినవ్ గోమఠం, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్ తదితరులు కథ, స్క్రీన్‌ప్లే: సంజీవ్ రెడ్డి, షేక్ దావూద్ జి సంగీతం: సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫర్: మహి రెడ్డి పండుగుల ఎడిటర్: సాయి కృష్ణ గణాల నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
కథ:
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన చైతన్య (విక్రాంత్) పోటీ పరీక్షల కోసం వరంగల్ నుంచి వచ్చిన కళ్యాణి (చాందినీ చౌదరి)ని కలుస్తాడు. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. కళ్యాణి తండ్రి, ఈశ్వరరావు (మురళీధర్ గౌడ్) వాళ్ళ ప్రేమను అంగీకరించడానికి నిరాకరించడంతో ఈ జంట పారిపోయి పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళ పెళ్లయిన ఆరు నెలల తర్వాత తమకు బిడ్డ పుడితే తన తండ్రితో విడిపోయిన సంబంధం మెరుగుపడుతుందని వాళ్ళు నమ్ముతారు. అయితే కళ్యాణి గర్భం దాల్చదు.. వైద్య పరీక్షలలో చైతన్యకు తక్కువ శుక్రకణాల సంఖ్య ఉన్నట్లు తెలుస్తుంది. ఊహించని మలుపులో ఈశ్వరరావు వాళ్ళ ఇంటికి వచ్చి, పెళ్లిని అంగీకరించినట్లు నటిస్తూ వాళ్ళతో పాటే ఉండటం మొదలుపెడతాడు. 100 రోజుల్లో వాళ్ళ పెళ్లిని విచ్ఛిన్నం చేసి.. తన కూతురిని వరంగల్‌కు తిరిగి తీసుకెళ్తానని చైతన్యతో సవాలు చేస్తాడు. ఈ గడువులోగా తన సంతానోత్పత్తిని మెరుగుపరుచుకుని.. తన భార్య గర్భవతి అయ్యేలా చేయాలనే లక్ష్యంతో చైతన్య తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏమైంది అనేది కథ..
కథనం:
సంతాన ప్రాప్తిరస్తు అనేది హీరో సంతానలేమి సమస్య చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి కథ ట్రై చేయడం కూడా కాస్త రిస్కే. కానీ చేసాడు విక్రాంత్ రెడ్డి. కాగితంపై రాసుకున్నపుడు ఈ కథ బాగా ఉంటుంది.. అలాగే కామెడీ కూడా బాగానే పండించొచ్చు అనేలా ఉంటుంది. కానీ సంతాన ప్రాప్తిరస్తులో మాత్రం కామెడీ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం సున్నితంగానే చెప్పే ప్రయత్నం చేసారు. అక్కడ దర్శకుడు సంజయ్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. ఇలాంటి కథలు ఎడ్జ్ ఆఫ్ ది బోర్డర్‌లో ఉంటాయి.. ఏ మాత్రం అటూ ఇటూ అయినా బూతు సినిమాలా మారిపోతుంది. హీరో ఒకవైపు తక్కువ శుక్రకణాల సంఖ్యతో పోరాడుతూనే.. తన అంగీకరించని మామగారు పెట్టిన సవాలును అధిగమించాలి. దీని చుట్టూ కొన్ని సీన్స్ బాగానే రాసుకున్నారు. అయితే ఈ తరహా కథనాలు బలమైన ఎమోషనల్ స్ట్రెంత్‌తో ఉండాలి.. ఇందులో అది పెద్దగా కనిపించదు. తరుణ్ భాస్కర్ వచ్చిన తర్వాత కాస్త కథలో వేగం పెరిగింది. జాక్ రెడ్డి అనే విచిత్రమైన అంత్యక్రియలసేవల ఆపరేటర్‌గా పరిచయం కావడం ప్లస్‌గా మారింది. అతను హీరోని తన ప్రపంచంలోకి లాగుతాడు. స్టార్టింగ్ కాస్త కామెడీ బాగానే అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ కథనం మెల్లగా రొటీన్ అయిపోయింది. ఊహించదగిన రొమాంటిక్ సన్నివేశాలు, సాఫ్ట్‌వేర్‌పై సెటైర్లు, స్లో నెరేషన్ ఈ సినిమాను ఇబ్బంది పెట్టాయి. సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ కామెడీ పర్లేదు.
నటీనటులు:
విక్రాంత్ రెడ్డి బాగానే ఉన్నాడు.. స్క్రీన్ మీద మెచ్యూర్డ్‌గానే నటించాడు. సాధారణ IT ప్రొఫెషనల్ పాత్రలో బాగా ఒదిగిపోయాడు. చాందిని చౌదరి పర్లేదు. వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, తరుణ్ భాస్కర్ కారణంగా కొన్ని సన్నివేశాలు బాగానే పనిచేశాయి. వాళ్ల క్యారెక్టర్స్ బాగా పేలాయి.. నటన కూడా బాగుంది. మురళీధర్ గౌడ్ కఠినమైన తండ్రిగా ఒప్పించగలిగాడు.
టెక్నికల్ టీం:
సునీల్ కశ్యప్ సంగీతం పర్లేదు.. ఆర్ఆర్ కూడా బాగానే అనిపిస్తుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ కాస్త షార్ప్ కట్స్ ఉంటే బాగుండేవి. సినిమాటోగ్రఫీ పర్లేదు. కథ వరకు చాలా బాగుంది కానీ స్క్రీన్ ప్లే కాస్త టైట్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్లేదు. దర్శకుడిగా సంజయ్ రెడ్డి వర్క్ ఓకే.. యావరేజ్ దగ్గరే ఆగిపోయాడేమో అనిపించింది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా సంతాన ప్రాప్తిరస్తు.. జస్ట్ ఓకే.. నైస్ ఐడియా..!




