Tollywood : వారసుడు 6 రోజుల్లో 190 కోట్లు.. వీరసింహారెడ్డి 5 రోజుల్లో 104 కోట్లు.. వాల్తేరు వీరయ్య 4 రోజుల్లో…
జనవరి 12న వీరసింహారెడ్డి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.. సినిమాలో ఏం లేదు.. అంతా పాత కథే అంటూ పెదవి విరిచారంతా. కానీ కలెక్షన్లు చూస్తుంటే మాత్రం మోత మోగిపోతుంది.
కొత్త కథలొద్దు.. పాత కథలే ముద్దు.. సంక్రాంతి సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి నేర్పించిన పాఠం ఇదేనా..? వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి కలెక్షన్ల ప్రభంజనం దర్శకుల ఆలోచనల్ని మార్చేసిందా..? దానికి ముందే ధమాకా చేసిన రచ్చతో రైటర్స్ అడుగులు మూస కథల వైపు పడుతున్నాయా..? ఈ మూడు విజయాలతో ఇండస్ట్రీ మరో పదేళ్ళు వెనక్కి వెళ్లబోతుందా..? ఈ గెలుపులోనే ఓటమి భయపెడుతుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వారసుడు.. 6 రోజుల్లో 190 కోట్లు వసూలు చేయగా.. వీరసింహారెడ్డి 5 రోజుల్లో 104 కోట్లు కొల్లగొడితే.. వాల్తేరు వీరయ్య 4 రోజుల్లో 128 కోట్లు రాబట్టింది.. చూస్తున్నారుగా పండక్కి విడుదలైన సినిమాల కలెక్షన్ల ప్రభంజనం. ఎవరికి వాళ్లు తగ్గేదే లే అన్నట్లు బాక్సాఫీస్ దగ్గర తుక్కు రేగ్గొడుతున్నారు. మన దగ్గర చిరంజీవి, బాలయ్య.. తమిళంలో విజయ్, అజిత్.. అందరి సినిమాలు పండగ నాలుగు రోజులు కలెక్షన్ల సునామీ సృష్టించాయి. అయితే ఇందులో ఏ ఒక్కటి కూడా కొత్త కథతో రాలేదు.. అన్నీ మూస ఫార్ములాలే.
ఓటిటిలో బెస్ట్ కంటెంట్ చూస్తున్న ఆడియన్స్‌కు రొటీన్ కథలు బోర్ కొట్టేవి. అదేంటో కానీ.. రెండు మూడు నెలలుగా ప్రేక్షకులకు మూస కథలే బాగా నచ్చేస్తున్నాయి. ముఖ్యంగా డిసెంబర్‌లో విడుదలైన ధమాకా నుంచే ఈ ట్రెండ్ మొదలైంది. రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ధమాకా పరమ రొటీన్ కంటెంట్‌తో వచ్చింది. కానీ సినిమాకు మాత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. పండక్కి అదే ట్రెండ్ సాగింది. జనవరి 12న వీరసింహారెడ్డి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది.. సినిమాలో ఏం లేదు.. అంతా పాత కథే అంటూ పెదవి విరిచారంతా. కానీ కలెక్షన్లు చూస్తుంటే మాత్రం మోత మోగిపోతుంది. బాలయ్య కెరీర్‌లోనే ఎన్నడూ లేనంతగా వీరసింహుడి ఊచకోత సాగింది. 5 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల మార్క్ అందుకుంది.. బ్రేక్ ఈవెన్‌కు మరో 15 కోట్ల దూరంలో నిలిచింది.
వాల్తేరు వీరయ్య పరిస్థితి కూడా అంతే. చిరంజీవి మేనియాలోనే ఈ సినిమాకు వసూళ్లు వచ్చేస్తున్నాయి కానీ కథ పరంగా చూసుకుంటే మాత్రం పాతికేళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే. వారసుడు కథ కూడా నాలుగైదు సినిమాలను మిక్సీ వేసి తీసినట్లే ఉంటుంది. కానీ విజయ్ మేనియాతో అక్కడ 200 కోట్లకు చేరువైంది. మొత్తానికి ఈ సంక్రాంతి సినిమాల రిజల్ట్ చూసాక.. మిగిలిన దర్శకుల ఆలోచనలు కూడా రొటీన్ కథల వైపు పరుగులు పెట్టడం ఖాయం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి