Actor Darshan : రక్తచరిత్ర లిఖించి… సుప్పిణీ శుద్దపూసనంటున్న దర్శన్..

హీరో ఐతే మాకేంటి.. మా ట్రీట్‌మెంట్ మాదే.. అని పోలీసులంటే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. అని ప్రభుత్వ పెద్దలు కూడా చేతులెత్తేశారు. ఇది దర్శన్ గారి దురాగతమే అని పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ కూడా తేల్చేసింది. మృతుడి ఒంటిమీద 15 గాయాలుంటే.. కొట్టింది మా సారే అని మీ ఫ్యాన్సే చెబుతుంటే.. మాకేమీ తెలీదని బొంకుతారేంటి అని నిలదీస్తోంది అటాప్సీ రిపోర్ట్. అటు.. హీరో దర్శన్‌తో పాటు నిందితులందరికీ పోలీస్‌ కస్టడీ మరో 5 రోజులు పొడిగించింది బెంగళూరు కోర్టు.

Actor Darshan : రక్తచరిత్ర లిఖించి... సుప్పిణీ శుద్దపూసనంటున్న దర్శన్..
Darshan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 15, 2024 | 8:11 PM

భార్యను విస్మరించి.. ప్రేయసితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. ఇదేమని ప్రశ్నించిన అభిమానిని టార్గెట్ చేసి.. మరో అభిమానితో కలిసి కిడ్నాప్ చేయించి, బంధించి, చితకబాది, హతమార్చి ఇప్పుడు నాకేం తెలీదు.. నేను అమాయకుడ్ని అంటూ ఇన్నోసెంట్ ఫేసు పెడుతున్నాడు కన్నడ హీరో దర్శన్. అసలే ఛాలెంజింగ్ స్టార్.. వీర లెవల్లో ఫ్యాన్‌ ఫాలోయింగ్… ఆయన్ను అరెస్టు చెయ్యడమే ఒక సాహసం. మరి.. కూర్చోబెట్టి విచారణ చేయాలంటే… అబ్బో చుక్కలు కనిపిస్తున్నాయట బెంగళూరు ఖాకీలకు.

ఒక్క కర్నాటకనే కాదు.. టోటల్ ఇండియాలో సంచలనంగా మారిన.. అభిమాని హత్య కేసులో కథానాయకుడు దర్శన్ తూగుదీప.. ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. హీరో దర్శన్‌ సహా మొత్తం 16 మంది నిందితుల్ని.. అన్నపూర్ణేశ్వర స్టేషన్‌లో రిమాండ్‌లో ఉంచి పోలీసుల ఇంటరాక్షన్ జరుగుతోంది. కానీ.. మిగతా నిందితులు విచారణకు సహకరిస్తున్నా.. దర్శన్ నుంచి మాత్రం నో రియాక్షన్. సైలెన్స్‌గా ఉండడమే కేసు నుంచి తప్పించుకోడానికి ఏకైక మార్గం అనుకున్నారో ఏమో.. హత్యకు సంబంధించి పోలీసులు ఏం అడిగినా.. మౌనమే సమాధానం అవుతోంది. ప్రశ్న ఏదైనా.. తెలీదుతెలీదుతెలీదు.. అనే ఆన్సరే వస్తోందట దర్శన్‌ నుంచి.

ఇదే కేసులో అరెస్టయిన దర్శన్‌ ప్రియురాలు పవిత్రగౌడ.. ఇతర నిందితులు చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తున్నారు. దర్శన్‌ మాత్రం చెప్పిందే చెబుతున్నాడు. రేణుకాస్వామిని స్కెచ్‌ వేసి హత్య చేయలేదట. బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలని మాత్రమే అనుకున్నాం.. దెబ్బలు తట్టుకోలేక రేణుకాస్వామి చనిపోయాడు.. అనేది మిగతా నిందితులు చెబుతున్న సమాచారం. ఘటనకు సంబంధించి వీళ్లు ఇంత ఇన్‌ఫర్మేషన్‌ ఇస్తున్నా.. దర్శన్ నోరు మెదపకపోవడంతో.. దర్యాప్తు ముందుకు సాగడం లేదు.

అటు.. రేణుకాస్వామి కేసుకు సంబంధించి చిత్రదుర్గలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు పోలీసులు. మీడియా కెమెరాలు, ఓబీ వ్యాన్లతో పోలీస్ స్టేషన్ దగ్గర విచారణ కష్టతరంగా మారింది. అటు.. దర్శన్ అభిమానులు, జనం పీఎస్ వైపు పోటెత్తుతున్నారు. అందుకే.. పగటివేళ.. ఇంటరాగేషన్‌కు బ్రేక్ ఇచ్చి.. నైట్ డ్యూటీ మొదలుపెట్టారు సీఐ సంజీవ్‌ గౌడ. చిత్రదుర్గలో రేణుకాస్వామిని కిడ్నాప్‌ చేసిన స్థలం, ఘటనకు ప్రమేయం ఉన్న ఇతర చోట్లకు నిందితుడు రఘును తీసుకువచ్చి ప్రత్యక్ష విచారణ చేశారు. రఘు.. కేసులో కీలక వ్యక్తి. దర్శన్‌ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రఘు.. రేణుకాస్వామిని గుర్తించి కిడ్నాప్‌ చేయించి.. మొత్తం ఎపిసోడ్‌లో తమ హీరోకి వెన్నుదన్నుగా నిలిచాడు. అందుకే.. రఘును తమదైన స్టయిల్‌లో విచారిస్తున్నారు ఖాకీలు.

రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ పేరు బయటకు రాకుండా పెద్ద డీలే కుదిరిందట. నేరాన్ని తమపై వేసుకుని, హీరోని కేసు నుంచి కాపాడితే 30 లక్షలిస్తానన్నది దర్శన్ చేసుకున్న ఒప్పందం. ఆవిధంగా చేతులు మారిన 30 లక్షల నగదును కూడా సీజ్‌ చేశారు పోలీసులు. దర్శన్‌కు బాగా సన్నిహితుడైన ఒకరి ఇంటిమీద దాడి చేసి.. ఈ 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అటు.. మృతుడు రేణుకాస్వామికి సంబంధించి కూడా ఆసక్తికరమైన విషయాలు బైటికొస్తున్నాయి. అవకాశం దొరికినా తప్పించుకోకుండా.. అనవసరంగా హీరో చేతికి చిక్కి.. మృత్యువాత పడ్డాడు రేణుకాస్వామి. కిడ్నాప్‌ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువచ్చే క్రమంలో.. అనేకసార్లు తప్పించుకునే అవకాశం ఉన్నా.. రేణుకాస్వామి తప్పించుకోలేదట. ఈ విషయాలన్నీ క్యాబ్ డ్రైవర్ రవి ఇంటరాగేషన్‌లో వెల్లడయ్యాయి.

నిందితుల జాబితాలో ఏ8గా ఉన్న రవికి హత్యతో ప్రత్యక్ష ప్రమేయం లేదు. ప్రత్యక్ష సాక్షి కూడా కాదు. కానీ.. ఎపిసోడ్‌లో ముప్పాతిక భాగం ఇతడి సమక్షంలోనే జరిగింది. టొయోటా ETS కారు అద్దెకు నడుపుకునే రవికి.. స్నేహితుడు జగ్గు ఫోన్ చేసి.. రేణుకాస్వామిని బెంగుళూరు తీసుకురావాలని చెప్పాడు. చిత్రదుర్గలో రేణుకాస్వామితో పాటు.. జగ్గు, దర్శన్ అభిమాన సంఘం నేత రఘు, అను అనే మరొకరు కారు ఎక్కారు. జర్నీ సమయంలోనే వీళ్ల మధ్య వాగ్వాదం జరిగిందట. పవిత్రగౌడకు పంపించిన మెసేజ్‌లపై రేణుకాస్వామిని జగ్గు, రఘు నేరుగా నిలదీశారట. మెసేజ్‌లు పంపడం నాకు హాబీ.. అని ముక్కుసూటిగానే రేణుకాస్వామి బదులిచ్చాడట. మార్గమధ్యంలో తుమకూరులో ఆగి అందరూ టిఫిన్‌ చేస్తే బిల్లు కూడా రేణుకాస్వామే చెల్లించాడు. తనకు ముప్పు పొంచిఉందని గ్రహించినా.. రేణుకాస్వామి తేలిగ్గా తీసుకున్నాడని, అటోఇటో తేల్చుకుందామన్న తెగింపుతోనే ఉన్నాడని క్యాబ్ డ్రైవర్ రవి చెబుతున్నాడు. బెంగళూరు వచ్చేలోపు అనేకసార్లు కారు నిలిపినా రేణుకాస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు.

కారు బెంగళూరు కామాక్షిపాళ్యలోని షెడ్‌ వద్దకు చేరుకోగానే అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారు. రేణుకాస్వామిని చూసి ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా.. అని నవ్వుకుని కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారట. రేణుకాస్వామిని రఘు లోపలకు తీసికెళ్లాడు. అను, రవి, జగ్గు బయటే ఉండిపోయారు. కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన రఘు.. రేణుకాస్వామి చనిపోయాడని చెప్పి.. కేసులో అప్రూవర్‌గా మారతారా? అంటూ ఆఫరిచ్చాడట. రవి ఒప్పుకోకపోవడంతో కారు అద్దె 4వేలు ఇచ్చి పంపించేశాడు రఘు. రవి, అను, జగ్గు ముగ్గురూ చిత్రదుర్గకు తిరిగి వచ్చేశారు. తర్వాత హత్యాఘటన వెలుగులోకొచ్చి.. విషయం పెద్దది కావడంతో.. భయపడిపోయి లొంగిపోయాడు క్యాబ్ డ్రైవర్ రవి.

హీరో దర్శన్‌కి పోలీస్‌ స్టేషన్‌లో రాచమర్యాదలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై కర్నాటక సర్కార్ స్పందించింది. నిందితుడు దర్శనైనా, నేనైనా ట్రీట్‌మెంట్ ఒకటే అన్నారు హోమ్‌మంత్రి పాటిల్. కానీ.. దర్శన్‌ను కేసు నుంచి తప్పించేందుకు పెద్ద స్ఖాయిలో లాబీయింగ్ జరుగుతోంది. ఈ కేసులో నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు.. ఎవ్వరూ సిఫార్సులతో రావొద్దు.. అని ఖరాఖండీగా చెప్పేశారు సీఎం సిద్ధరామయ్య. అటు.. రేణుకాస్వామి పోస్టుమార్టమ్‌ నివేదిక.. దర్శన్‌ని మరింత ఇరకాటంలోకి నెట్టింది. ప్రైవేట్ పార్ట్స్‌పై దర్శన్‌ తన్నడంతోనే మరణించాడని చెబుతోంది పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్. తల, పొట్ట, ఛాతీ భాగాల్లో ఒంటి మీద 15 చోట్ల గాయాలున్నాయట. రేణుకస్వామి తలను మినీ ట్రక్కుకు బాదినట్లు శవపరీక్షలో తేలింది. సో కేసునుంచి దర్శన్‌కి నో ఎస్కేప్ అన్నమాట. తన కోపమే తన కొంప ముంచిందన్నట్టు.. నిన్నటిదాకా హీరో ఫోజు కొట్టిన దర్శన్‌కు.. ఇకమీదట జైలు కష్టాలు తప్పేలా లేవు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.