హ్యాండ్ రైటింగ్‌తోనే మేగజైన్ నడిపిన స్టార్ రైటర్.. అప్పట్లోనే ఆయన సృజనాత్మకతకు అందరూ ఫిదా!
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆస్కార్ వేదికపై తెలుగు పాట సత్తా గేయ రచయిత చంద్రబోస్, తన ప్రస్థానాన్ని ఎక్కడ మొదలుపెట్టారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వేల పాటలతో కోట్లాది మందిని అలరిస్తున్న ఆ రచయితకు అక్షరాల మీద మక్కువ ఇప్పుడు మొదలైంది కాదు.

ఆయనలోని సృజనాత్మకతకు బీజం ఆయన చదువుకునే రోజుల్లోనే పడింది. ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు తోటి విద్యార్థులను ఉత్సాహపరిచేలా ఆయన ఒక సాహసం చేశారు. ఎటువంటి ప్రింటింగ్ మిషన్లు, పెద్ద పెద్ద ఆఫీసులు లేకుండానే ఒక పత్రికను నడిపారు. అది కూడా కేవలం తన చేతి రాతతో! ఒక చిన్న గ్రామంలోని పాఠశాల గదుల మధ్య పుట్టిన ఆ పత్రికే ఆయనను ఇవాళ గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన చిన్ననాటి ‘ఎడిటర్’ అవతారం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ లిఖిత పత్రిక విశేషాలేంటో తెలుసుకుందాం..
వార్తా వాహిని – అక్షరాల వెల్లువ..
స్కూల్ రోజుల్లోనే చంద్రబోస్ తన మిత్రులతో కలిసి ‘వార్తా వాహిని’ అనే పేరుతో ఒక లిఖిత పత్రికను ప్రారంభించారు. అప్పట్లో నేటిలా కంప్యూటర్లు, డిజిటల్ ప్రింటింగ్ అందుబాటులో లేవు. కానీ ఆయనలోని ఉత్సాహం మాత్రం ఆకాశాన్ని తాకేది. వాళ్ల ఊరిలో జరిగే విశేషాలు, ఇతర విషయాలతో కూడిన వార్తలు రాసి ఓ పత్రిక తయారుచేసి ఆ ఊరి గ్రంథాలయంలో వేసేవారట. దానికి ఆయనే సంపాదకుడిగా వ్యవహరించేవారు. ప్రతి పేజీని తన చేతి రాతతో తీర్చిదిద్ది, దానికి రంగుల పెన్సిళ్లతో బొమ్మలు వేసి ఒక మేగజైన్ లా తయారు చేసేవారు. ఆయన అక్షరాలను పేర్చే తీరు, సమాచారాన్ని అందించే విధానం చూసి అప్పట్లోనే ఊర్లో అందరూ ఆశ్చర్యపోయేవారట.
అయితే ఒకరోజు ఎలాంటి వార్తలు లేకపోవడంతో కొన్ని కల్పిత వార్తలు రాయడం వల్ల ఊర్లో అందరూ వచ్చి గొడవపడ్డారంట. దాంతో చంద్రబోస్ తండ్రి ఆయనను కోప్పడ్డారట. ఇక చేసేది లేక అనివార్య కారణాల వల్ల తన లిఖిత పత్రికను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారట చంద్రబోస్. ఆయన స్వయంగా ఈ విషయాన్ని పంచుకుని ఆనాటి విషయాలను సరదాగా చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు తనను ఉత్సాహపరుస్తాయని అన్నారు.
తన కలం నుంచి జాలువారే ప్రతి పాటలోనూ ఆనాటి స్వచ్ఛత, మట్టి వాసన ఉండటానికి కారణం ఆయన పునాది అంత బలంగా ఉండటమే. కష్టాలను చూసి వెనకడుగు వేయకుండా, అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన నిరూపించారు.
చంద్రబోస్ ప్రయాణం ప్రతి విద్యార్థికి ఒక పెద్ద పాఠం. మనిషిలో ప్రతిభ ఉంటే అది ఏ రూపంలోనైనా బయటకు వస్తుంది అనడానికి ‘వార్తా వాహిని’ ఒక నిదర్శనం. ఆస్కార్ స్థాయికి ఎదిగినా, తన మూలాలను మర్చిపోకుండా చిన్ననాటి స్మృతులను పంచుకోవడం ఆయన గొప్పతనం.
