IND vs NZ 1st ODI: రంజీ ఆడే సత్తా లేదు.. కట్‌చేస్తే.. గంభీర్ మొండి పట్టుదలతో తొలి వన్డేలో చోటు?
India vs New Zealand ODI Series: ఏ జట్టులోనైనా సెలక్షన్ వివాదాలు సహజం, కానీ కోచ్,సెలక్టర్ల మధ్య సమన్వయం లోపిస్తే అది జట్టు ఫలితంపై ప్రభావం చూపుతుంది. 11వ తేదీన జరిగే మ్యాచ్‌లో గంభీర్ పంతం నెగ్గుతుందో లేదో చూడాలి.

IND vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాలో సెలక్షన్ సెగలు రేగుతున్నాయి. వడోదరలో జరగనున్న తొలి వన్డే కోసం ప్లేయింగ్ ఎలెవన్‌ను ఖరారు చేసే క్రమంలో, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా రంజీ స్థాయి క్రికెట్‌లో కూడా ప్రభావం చూపని ఒక ఆటగాడి కోసం గంభీర్ పట్టుబట్టడం చర్చనీయాంశంగా మారింది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, మైదానంలో ఆట మొదలవ్వకముందే టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలపై విశ్లేషకులు మండిపడుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం, కనీసం దేశవాళీ రంజీ ట్రోఫీలో కూడా రాణించని ఆటగాడిని వడోదర వన్డేలో ఆడించాలని కోచ్ గౌతమ్ గంభీర్ మొండిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంపిక వివాదంలో హర్షిత్ రాణా..
ఈ వివాదానికి కేంద్రబిందువు 23 ఏళ్ల కుడిచేతి వాటం వేగవంతమైన బౌలర్ హర్షిత్ రాణా. దేశవాళీ క్రికెట్‌లో చెప్పుకోదగ్గ రికార్డు లేకపోయినా, రంజీ ట్రోఫీలో వరుసగా విఫలమవుతున్నా అతనికి టీమిండియాలో చోటు దక్కడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టపడి ఆడుతున్న ఇతర దేశవాళీ ఆటగాళ్లను కాదని, రాణాకు పదేపదే అవకాశాలు ఇవ్వడం వల్ల యువ క్రికెటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
కాగితం మీద హర్షిత్ రాణా గణాంకాలు సాధారణంగానే ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 11 వన్డేల్లో 20 వికెట్లు తీశాడు. అయితే, అతని ఎకానమీ రేటు (6.01) ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఒత్తిడి ఉండే డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించడంలో అతను విఫలమవుతున్నాడు. మెరుగైన ప్రదర్శన చేసే ఇతర పేసర్లు అందుబాటులో ఉన్నా, రాణాను ఎంపిక చేయడంపై విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.
గంభీర్‌పై పక్షపాత ఆరోపణలు..
సోషల్ మీడియాలో అభిమానులు ఈ విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఐపీఎల్ నుంచి హర్షిత్ రాణాకు, గంభీర్‌కు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అతనికి ఈ అవకాశాలు దక్కుతున్నాయని పక్షపాత ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఫేవరిజం వల్లే జట్టు ఎంపిక జరుగుతోందని, ప్రతిభకు ప్రాధాన్యత లేదని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
కివీస్ సిరీస్ ఒత్తిడిలో భారత్..
న్యూజిలాండ్ వంటి పటిష్టమైన జట్టుతో తలపడుతున్నప్పుడు సరైన కాంబినేషన్ చాలా ముఖ్యం. గంభీర్ అనుసరిస్తున్న ఈ వ్యూహం ఫలిస్తే అద్భుతమే కానీ, విఫలమైతే మాత్రం కోచ్‌గా ఆయన తీవ్రమైన జవాబుదారీతనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వడోదర వన్డేలో రాణాకు అవకాశం ఇస్తే, అతను తన సత్తా చాటి విమర్శకుల నోళ్లు మూయిస్తాడా లేదా అనేదే ఇప్పుడు సస్పెన్స్.



