RTC Buses: సంక్రాంతి వేళ రాష్ట్ర ప్రజలకు బిగ్ షాక్.. ఆర్టీసీ బస్సులు బంద్..! కష్టాలు తప్పవ్..
సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు షాక్ తగిలింది. ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఆర్టీసీ అధికారులకు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. దీని వల్ల పెద్ద మొత్తంలో అద్దె బస్సులు నిలిచిపోనున్నాయి. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడనున్నారు.

సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనుండటంతో ఏపీఎస్‌ఆర్టీసీ భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఏకంగా 8 వేలకుపైగా స్పెషల్ సర్వీసులను తిప్పనుట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని ప్రకటించి ప్రజలకు ఊరటనిచ్చింది ఏపీఎస్ఆర్టీసీ. ఈ క్రమంలో ప్రయాణికులకు షాకిచ్చే మరో ప్రకటన బయటకు వచ్చింది. అదే ఆర్టీసీ అద్దె యాజమానుల సమ్మె. మహిళలకు ఉచిత పథకం వల్ల తమ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని, తమకు ప్రభుత్వం నుంచి అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ అద్దె యజమానులు సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు.
అద్దె బస్సుల యాజమాన్యాల సమ్మె
సంక్రాంతి పండుగ సందర్భంలో అద్దె బస్సుల యాజమానులు సమ్మెకు దిగుతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడనున్నారు. గురువారం ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ప్రకటించిన అద్దె బస్సుల యాజమాన్యాలు.. తమకు ప్రభుత్వం నుంచి అదనంగా రూ.15 వేల నుంచి రూ.20 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం వీరితో మాట్లాడిన ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు.. ఒక్కొ బస్సుకు నెలకు రూ.5,200 చొప్పున ఇస్తామంటూ ఓ సర్క్యూలర్ జారీ చేసింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అద్దె బస్సుల యజమానులు.. సమ్మెకు సిద్దమయ్యారు.
నిలిచిపోతున్న 2,700 అద్దె బస్సులు
ప్రస్తుతం ఏపీలో 2,700 అద్దె బస్సులు నడుస్తున్నాయి. వీటిల్లో 2,419 బస్సులు స్త్రీ శక్తి పథకం కోసం నడుపుతున్నారు. వీటిల్లో మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు వంటి బస్సులు ఉన్నాయి. పండుగ సమయంలో ఈ బస్సులు ఆగిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. సంక్రాంతికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రజల రాకపోకలు ఎక్కవగా ఉంటాయి. ప్రధానంగా గ్రామాలకు ఎక్కువమంది వెళ్తుంటారు. ఇప్పుడు ఈ బస్సులు నిలిచిపోతే ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యే అవకాశముంది. పండక్కి సొంతూళ్లకు వెళ్లేవారితో పాటు తిరిగి వచ్చేవారికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సంక్రాంతి సమయంలో సమ్మెకు దిగనుండటంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి.
