Amigos Review: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ రివ్యూ.. డిఫరెంట్ ఐడియా.. డీసెంట్ వాచ్
గతేడాది బింబిసారతో బ్లాక్‌బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ అంటూ వచ్చేసాడు. టైటిల్‌తోనే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన నందమూరి హీరో.. సినిమాతో ఆకట్టుకున్నాడా..? మరో హిట్ కొట్టాడా..?
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, జయప్రకాష్, సప్తగిరి తదితరులు
ఎడిటింగ్: తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్
మాటలు: సురేంద్ర కృష్ణ-రవిరెడ్డి మల్లు-సుధాకర్ రెడ్డి ఏరువ
సంగీతం: జిబ్రాన్
నిర్మాతలు: వై.రవిశంకర్-నవీన్ ఎర్నేని
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజేంద్ర రెడ్డి
గతేడాది బింబిసారతో బ్లాక్‌బస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ అంటూ వచ్చేసాడు. టైటిల్‌తోనే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన నందమూరి హీరో.. సినిమాతో ఆకట్టుకున్నాడా..? మరో హిట్ కొట్టాడా..? మైత్రి మూవీ మేకర్స్ హ్యాట్రిక్ పూర్తి చేసారా..? అసలు ఈ డోపల్ గ్యాంగర్స్ స్టోరీ ఎలా ఉంది..?
కథ:
సిద్ధార్థ్ (కళ్యాణ్ రామ్) హైదారాబాద్‌లో తన మామ (బ్రహ్మాజీ)తో కలిసి కన్సట్రక్షన్ బిజినెస్ చేస్తుంటాడు. ఓ డీల్ మాట్లాడుతున్న సమయంలోనే ఇషిక (ఆషిక రంగనాథ్)ను చూసి ఇష్టపడతాడు. విషయం పెళ్లి చూపుల వరకు వెళ్తుంది.. కానీ చెడిపోతుంది. అదే సమయంలో సప్తగిరి ద్వారా డోపల్ గ్యాంగర్స్ (ఏ సంబంధం లేకుండా ఒకేలా ఉండే వ్యక్తులు) గురించి తెలుసుకుంటాడు సిద్ధార్థ్. అలా తనలా ఉన్న వాళ్లను కలుసుకోడానికి ఓ వెబ్ సైట్‌లోకి వెళ్తాడు. అప్పుడు మంజునాథ్ హెగ్డే, మైఖెల్ ఉరఫ్ బిపిన్ రాయ్ (కళ్యాణ్ రామ్)లు పరిచయం అవుతారు. ముగ్గురు కలిసి గోవాలో కలుసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో మైఖెల్ గురించి కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి మిగిలిన ఇద్దరికి. అతడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని తెలుసుకుంటాడు సిద్ధార్థ్. కానీ అప్పటికే వీళ్ళిద్దర్ని అడ్డు పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తుంటాడు బిపిన్ రాయ్. అప్పుడు ఏం జరిగింది..? NIA బిపిన్‌ను పట్టుకుందా లేదా అనేది అసలు కథ..
కథనం:
ఆలోచన కొత్తగా ఉంటే కథ కూడా కొత్తగా అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ అమిగోస్ విషయంలో ఇదే జరిగింది. డోపల్ గ్యాంగర్ అనే కొత్త ఐడియాను ఈ సినిమాలో తీసుకున్నాడు దర్శకుడు రాజేంద్ర రెడ్డి. మనుషుల్ని పోలిన మనుషులు అనే కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అమిగోస్ మాత్రం కాస్త డిఫరెంట్ సబ్జెక్ట్. సంబంధం లేని ముగ్గురు ఒకేలా ఉన్న వ్యక్తుల కథ ఇది. ఈ ముగ్గురు ఒకే కథలోకి ఎలా వచ్చారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.. కానీ ఆ ఒక్క పాయింట్ మాత్రమే ఇంట్రెస్టింగ్‌గా ఉండటం సినిమాకు మైనస్ అయింది. కొత్త ఐడియా తీసుకున్నా.. రొటీన్ స్క్రీన్ ప్లే ఈ సినిమాను బాగా ఇబ్బంది పెట్టింది. ఉన్న ముగ్గురులో ఒకరు విలన్ అని ట్రైలర్ లోనే చెప్పాడు దర్శకుడు. మిగిలిన ఇద్దరినీ అడ్డుపెట్టుకొని విలన్ ఎలా తప్పించుకున్నాడు అనేది ఈ సినిమా కథ. ఫస్ట్ ఆఫ్ అంత స్టోరీ సెటప్ చేయడానికి టైం తీసుకున్నాడు దర్శకుడు. మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ ఇచ్చాక.. సెకండ్ హాఫ్ కాసేపు ఆసక్తికరంగా సాగుతుంది కథ. క్లైమాక్స్ మరీ హడావిడి లేకుండా ఊహించినట్టుగా ఉంది. మూడు పాత్రలో కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడు.. మరీ ముఖ్యంగా విలన్ పాత్రలో రాక్షసంగా ఉన్నాడు. సెకండాఫ్‌లో వచ్చే బిపిన్ ఇంట్రో ఎపిసోడ్ చాలా భయంకరంగా ఉంటుంది. అతడు చూసే చూపులే చాలా చోట్ల భయపెడతాయి. మొదటి నుంచి చివరి వరకు కేవలం కళ్యాణ్ రామ్ షో ఈ సినిమా. అతడిలో ఎంత మంచి నటుడు ఉన్నాడనేది ఈ చిత్రం చూపిస్తుంది. అయితే లవ్ సీన్స్ పెద్దగా వర్కవుట్ అవ్వకపోవడం.. చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా చెప్పలేకపోవడం ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. తీసుకున్న పాయింట్ మాత్రమే ఆసక్తికరంగా ఉన్నా.. చెప్పిన విధానం మాత్రం ఎన్నో సినిమాల్లో చూసినట్లుగానే ఉండిపోయింది.
నటీనటులు:
కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో అదిరిపోయేలా నటించాడు. ముఖ్యంగా బిపిన్ రాయ్ పాత్రకు ప్రాణం పోసాడు. అతడి రాక్షసత్వాన్ని చూపించే సన్నివేశాలు సినిమాలో కొన్ని ఉన్నాయి. ఇక హీరోయిన్ ఆశిక రంగనాథ్ పాత్ర మేర బాగానే మెప్పించింది. ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ స్క్రీన్ మీద చాలా బాగుంది. అశిక కూడా అందంగా కనిపించింది. బ్రహ్మాజీ మరో కీలక పాత్రలో బాగున్నాడు. మిగిలిన వాళ్ళంతా ఓకే..
టెక్నికల్ టీం:
సంగీత దర్శకుడు జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. పాటలు తక్కువగానే ఉన్నా.. రీమిక్స్ చెడగొట్టకుండా ఓకే అనిపించాడు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్. చాలా చోట్ల సౌందర రాజన్ కెమెరా పనితనం ఫ్రేమ్స్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చింది. దర్శకుడు రాజేంద్ర రెడ్డి ఆలోచన బాగుంది కానీ ఆచరణ మరింత పకడ్బందీగా ఉంటే ఇంకా బాగుండేది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్ గా అమిగోస్.. డిఫరెంట్ ఐడియా.. రొటీన్ స్క్రీన్ ప్లే.. డీసెంట్ వాచ్.. (Lakshmi Narayana)