800 Movie Review: ఆటుపోట్ల మురళీ జీవితానికి అద్దం.. 800 సినిమా ఎలా ఉందంటే
ముత్తయ్య మురళీధరన్ (మధుర్ మిట్టల్)కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. కానీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఆయన్ని ఎప్పుడూ తక్కువ చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చిన్నపుడే శ్రీలంకన్ తమిళులు అంటూ కుటుంబంపై దాడి చేస్తారు. ఆ తర్వాత ఓ చర్చిలో ఉంటూ చదువుకుంటాడు ముత్తయ్య. ఆ తర్వాత కాండీకి వెళ్లి అక్కడ క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటాడు. ఆ తర్వాత ఎలా స్టార్ అయ్యాడు, క్రికెట్‌లో ఎలా ముందుకు వచ్చాడు..

మూవీ రివ్యూ: 800
నటీనటులు: మధుర్ మిట్టల్, మహిమా నంబియార్, నాజర్, నరేన్, దిలీపన్, వినోద్ సాగర్ తదితరులు
సంగీతం: భీమ్స్
సినిమాటోగ్రఫీ: RD రాజశేఖర్
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
నిర్మాత: వివేక్ రంగాచారి (తెలుగులో శివలెంక కృష్ణప్రసాద్)
రచన, దర్శకుడు: శ్రీపతి MS
శ్రీలంక క్రికెట్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘800’. ఎంఎస్ శ్రీపతి తెరకెక్కించిన ఈ సినిమాలో మధుర్ మిట్టల్ నటించారు. మరి ఈ బయోపిక్ ఎలా ఉంది..? సినిమా ఆకట్టుకుందా లేదా..?
కథ:
ముత్తయ్య మురళీధరన్ (మధుర్ మిట్టల్)కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే పిచ్చి. కానీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఆయన్ని ఎప్పుడూ తక్కువ చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా చిన్నపుడే శ్రీలంకన్ తమిళులు అంటూ కుటుంబంపై దాడి చేస్తారు. ఆ తర్వాత ఓ చర్చిలో ఉంటూ చదువుకుంటాడు ముత్తయ్య. ఆ తర్వాత కాండీకి వెళ్లి అక్కడ క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటాడు. ఆ తర్వాత ఎలా స్టార్ అయ్యాడు, క్రికెట్‌లో ఎలా ముందుకు వచ్చాడు.. తనను వెక్కిరించిన వాళ్లకు సమాధానం ఎలా చెప్పాడు అనేది మిగిలిన కథ..
కథనం:
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ అంటే ఏముంటుంది.. మహా అయితే కొన్ని స్ట్రగుల్స్ చూపిస్తారు. ఆ తర్వాత అంతా క్రికెట్ లో ఆయన సాధించిన ఘనత ఉంటుంది.. బయోపిక్ అంటే భజన తప్ప ఇంకేముంటుంది అనుకుంటారు. కానీ 800 అది కాదు.. ఇది మురళీధరన్ బయోపిక్ అనేకంటే ఆయన కంప్లీట్ లైఫ్ అనొచ్చు. చిన్నప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్న సమస్యలు.. కుటుంబంలో కష్టాలు.. పరాయి దేశం వాడివి అంటూ వెక్కిరించిన మనుషులు.. క్రికెట్ లోకి వచ్చాక మోసగాడు అనే విమర్శలు.. 500 వికెట్లు తీసిన తర్వాత కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు.. ఇలా ఒక్కటేమిటి మురళీధరన్ లైఫ్ లో ప్రతి కోణాన్ని చూపించారు. నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడంలోనే నా జీవితం అయిపోయింది అని మురళి చెప్పే డైలాగ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. కేవలం ఆయన జీవితం అంటే క్రికెట్ మాత్రమే కాదు. వ్యక్తిగత జీవితంలో మురళి ఎదుర్కొన్న సమస్యలను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇంకా చెప్పాలంటే ఇందులో క్రికెట్ తక్కువగా ఉంది.. మురళి ఎదిగిన విధానం కంటే.. ఎదుగుతున్న క్రమంలో ఆయన తొక్కేయడానికి చేసిన ప్రయత్నాలే ఈ సినిమాలో ఎక్కువగా చూపించారు. LTTE, శ్రీలంకన్ తమిళులు, సింహళం.. ఇవన్నీ మురళీధరన్ జీవితంలో కీలక పాత్ర పోషించాయి. ఈ సంఘటనలను కూడా బయోపిక్ లో చక్కగా చూపించారు. సినిమాలో హై ఇచ్చే మూమెంట్స్ కంటే.. హైలీ ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి. అలాగే పాకిస్థాన్ వెళ్లినపుడు శ్రీలంకన్ టీంపై జరిగిన ఉగ్రదాడిని కూడా బాగా క్యాప్చర్ చేసారు దర్శకుడు శ్రీపతి.
నటీనటులు:
మురళీ పాత్రకు మధుర్ మిట్టల్ పూర్తి న్యాయం చేశాడు. ఆయన పాత్ర కోసమే పుట్టాడేమో అనిపించేలా నటించాడు. హీరోయిన్ మహిమా నంబియార్ కాసేపు కనిపించినా ఆకట్టుకుంది. సీనియర్ నటీమణి వడి పుక్కరుసు, నాజర్, నరేన్ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నికల్ టీం:
జిబ్రన్ సంగీతం బాగుంది. ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. కొన్ని సీన్స్‌లో అదే హైలైట్ అయింది. ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమాకు బలం. చాలా సీన్స్ కెమెరా వర్క్‌తో మరింత రిచ్‌గా కనిపించాయి. దర్శకుడు శ్రీపతి స్క్రీన్ ప్లే బాగుంది.. స్లో నెరేషన్ ఉంది గానీ క్రికెట్ లవర్స్ ను మురళీ బయోపిక్ ఆకట్టుకుంటుంది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా 800.. ఆటుపోట్ల మురళీ జీవితానికి అద్దం..