AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAA Elections 2021: మనకెందుకు మోనార్కూ… వెనక్కొచ్చేయ్…! ప్రకాశ్‌రాజ్‌‌‌‌కి ఓ అభిమాని ఆవేదన పత్రం!

మా ఎన్నికల నేపథ్యంలో బరిలోకి దిగిన అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే.

MAA Elections 2021: మనకెందుకు మోనార్కూ... వెనక్కొచ్చేయ్...! ప్రకాశ్‌రాజ్‌‌‌‌కి ఓ అభిమాని ఆవేదన పత్రం!
Prakash Raj
Rajeev Rayala
| Edited By: Janardhan Veluru|

Updated on: Jul 29, 2021 | 5:38 PM

Share

MAA Elections 2021: మా ఎన్నికల నేపథ్యంలో బరిలోకి దిగిన అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పెద్దలంతా కలిసి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కొందరు సీనియర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మా ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది. మా ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత మంచు విష్ణు రంగంలోకి దిగారు. తాను కూడా పోటీ చేస్తానని.. మా మెంబర్స్ సమస్యలను దగ్గరుండి చూశానని..మా బిల్డింగ్ సొంత డబ్బులతో కడతానని విష్ణు చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఈ వేడి మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్‌‌‌కు ఓ అభిమాని ఆవేదనతో లేఖ రాశారు. ఆ లేఖలో ఏమున్నదంటే..

”మొన్న బొమ్మరిల్లు డాడీగా కోటానుకోట్ల తెలుగిళ్లకు దగ్గరయ్యావు. నిన్నటికినిన్న రేలంగి మామయ్యగా అందరి మనసుల్లో నిలబడిపోయావు. తెర మీద నువ్వు కనిపిస్తే చాలు.. ప్రేక్షకుడి మనసంతా ఉల్లాసంగా ఉత్సాహంగా మారిపోతుంది. కొన్నిసార్లు కరుణామయుడిలా కనిపించినా.. మరికొన్ని పాత్రల్లో కర్కోటకుడిగా జడిపించినా… నీ నటనాకౌశలంతో మా మనసుల్ని మురిపిస్తూనే వున్నావు. ఆవిధంగా నీకు సదా రుణగ్రస్తులం.

తెర మీద తిరుగులేదనిపించుకున్న మీరు.. తెర వెనుక కూడా అంతే హుందాగా అంతే బిందాస్‌గా వుండాలన్నది మీ సగటు అభిమాని కోరిక. కానీ.. తెర వెనుక జరిగే ‘మా’ కుర్చీలాటలో మీరూ పావులుగా మారాలనుకోవడం మా మనసులకు పిన్నీసులతో గుచ్చినట్టవుతోంది. సోషల్ లైఫ్‌లో మిమ్మల్ని సోనూతో పోల్చుకుని… అంతకంటే ఎత్తులో ఎక్కడో చూడాలనుకున్నవాళ్ల అంచనాల్ని ‘మా’ ఛైర్మన్‌ పదవి మీద మీకుండే ఆశలు చంపేస్తున్నాయి. అది మీకు తగునా… అని మీరే మరోసారి ఆలోచించుకోమంటోంది మీ అభిమాన ప్రపంచం.

మీరసలు తెలుగు మనిషి కాదని… చాలామందికి నిన్నటిదాకా తెలీదు. అంతగా కలిసిపోయారు మాలో. ఇప్పుడు ‘మా’ పోటీలో చేరాక మీరు మావాళ్లు కాదని, నాన్-లోకల్ అని అందరూ పొడిచిపొడిచి చెబుతుంటే.. ఇక్కడ గాయాలవుతున్నాయి. అయినా… ప్రజాజీవితంలో నిలబడాలనుకునే వాళ్లకు ఉండాల్సిన కనీస అవసరాలు ఓర్పు-సహనం. అది మనకెంతుందో మనకే బాగా తెలుసు. ఉత్తి పుణ్యానికే ఆవేశపడిపోతారన్న అపవాదు మనమీద ఎప్పటినుంచో వుంది. తెలుగు పరిశ్రమలో ఇప్పటికే మీ పేరు మీద నాలుగైదు గొడవలు నమోదై వున్నాయి. సెట్స్‌ మీద కూడా గిల్లికజ్జాలు పెట్టుకుంటారని ఇప్పటికీ వాళ్లూవీళ్లూ మిమ్మల్ని అంటూనే వుంటారు. మొన్నటికిమొన్న మీరు పెట్టిన మీ ప్రెస్‌ మీట్‌లోనే మీరు ఓపిక వహించడం మరిచారు. ఒకానొక సందర్భంలో కనీస సభామర్యాద మంటగలిసింది కూడా. మీడియా వాళ్లడిగిన సూటి ప్రశ్నలకు ఉడుక్కుని మీరు కూడా ఆవేశంగా స్టేజ్ దిగి దూసుకొచ్చేశారు… గుర్తుందా? ఇది పద్ధతి కాదు అని మీ ప్యానల్ వాళ్లే మిమ్మల్ని వెనక్కి లాక్కెళ్లిన సంగతి మర్చిపోయారా…?

ఛైర్మన్‌ కుర్చీనెక్కాలనుకుంటున్న మిమ్మల్ని, మీ నాయకత్వాన్ని మీ ప్యానెల్‌ వాళ్లే ధిక్కరిస్తున్న సంగతి మీరు గ్రహించారా? మీవాళ్లే నీ చేతుల్లోంచే మైకు లాక్కుంటే మీరేమీ చెయ్యలేకపోయారు. గత ఛైర్మన్లు ఏం చేశారో మేం మాట్లాడబోం అని మీరన్న ఆ మరు నిమిషమే… గత ఛైర్మన్లపై విమర్శలు గుప్పించారు మెగాబ్రదర్ నాగబాబు. మరి.. మీరు గీసిన గీతను మీ వాళ్లు దాటరన్న భరోసా మీకుందా చెప్పండి…! ఇక్కడుండే పొలిటికల్ హీట్ కూడా మిమ్మల్ని ఒకచోట నెమ్మదిగా నిలబడనివ్వదు. కేంద్రంలో మోదీ పార్టీకి మీరిచ్చే రిటార్ట్‌లు.. మిమ్మల్నిప్పటికే ఒక వర్గానికి దూరం చేస్తున్నాయి. సైద్ధాంతిక విభేదాలున్నా… పవన్‌కల్యాణ్ లాంటి కొన్ని పవర్ సెంటర్స్ నుంచి మద్దతు కోరుకోక తప్పదు మీకు. ఒక రాష్ట్రంలో అధికారపార్టీకి మీరు ఓపెన్ సపోర్ట్ నివ్వడం కూడా ‘మా’ ఎన్నికల మీద ఎఫెక్ట్ చూపకుండా ఎందుకుంటుంది?

మా అసోసియేషన్ బిల్డింగ్ మా డబ్బులతో మేమే కడతాం.. మీరు రెడీనా అని ఛాలెంజ్ విసిరేంత శ్రీమంతులున్న మూవీ ఆర్టిస్టుల సమాజంలో మీలాంటి సామాన్యులు ఎంత చెప్పండి? సుహృద్భావ వాతావరణంలో… మీకున్న సాధు స్వభావంతో, నిలువెత్తు నిజాయితీతో మాత్రమే నెగ్గుకు రావాలన్న మీ ఆశయం గొప్పదే. కానీ.. దానికి యుక్తి సరిపోదు… కుయుక్తి కావాలి.. అది మీ దగ్గర లేదని మాకు తెలుసు. నిన్నటికి నిన్న ‘భగత్ సింగ్ నగర్’ మూవీ టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా మీరు అసహనానికి గురయ్యారు. వీడియో ప్రజెంటేషన్‌లో మూవీ ఆర్టిస్టుల సంఘం ప్రస్తావన రావడంతో మీరు ఇబ్బందిపడ్డం, మనసు నొచ్చుకోవడం అందరి కంటా పడింది. టన్నుల కొద్దీ ఆత్మాభిమానం వుండే మీలాంటివారు.. ఇలా ప్రతి నిమిషం ఆత్మవంచన చేసుకుంటూ ముందుకెళ్లడం ఎంతవరకు అవసరం…?

పదేపదే… పదులసార్లు రాజీ పడి… ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అగత్యం మీకెందుకు చెప్పండి… కేవలం వెయ్యిమంది నటీనటుల్ని పాలించడం కోసం ఇంతలా తాపత్రయపడ్డంలో ఔచిత్యముందా…? ఒక వ్యక్తిగా… సామాజికవాదిగా… అన్నిటికీ మించి ఒక విశిష్టమైన నటుడిగా మిమ్మల్ని అభిమానించే కోట్లాదిమందికి… మీరిలా ‘వీధిన’ పడ్డం ఎందుకో రుచించడం లేదు. అదృష్టవశాత్తూ (ప్రమాద వశాత్తూ) ఈ పోటీలో మీరు నెగ్గినా ఆ రెండేళ్ల పదవీకాలం మిమ్మల్ని మనశ్శాంతికి దూరం చేస్తుందని, మీ ఆత్మాభిమానానికి ప్రతిరోజూ పరీక్ష పెడుతుందని… మా అందరి భయం.

అయినా…’మా’ వాళ్లిచ్చే ఆ ముళ్ల కిరీటమే కావాలనుకుంటే.. ముందుకే నడవండి.. ఓటు హక్కు లేకపోయినా.. విజయీభవ అంటూ ఆశీర్వదించడానికి మీ సైన్యంగా మేమూ ఎప్పుడూ సిద్ధమే!

(రాజ శ్రీహరి, TV9 Telugu, ET Desk)

మరిన్ని ఇక్కడ చదవండి : 

హే.. పోరా..! ఫ్యాన్‌పై పూజా ఫైర్..!ముంబైయి ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం..:Pooja Hegde in Mumbai Airport Video.

K.G.F Chapter 2 : కేజీఎఫ్2 నుంచి అధీరా లుక్.. సంజయ్ దత్‌‌‌‌ను చూస్తే వెన్నులో వణుకుపుట్టాల్సిందే..