AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kota Bommali PS: కోటబొమ్మాళి పీఎస్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే

ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలకు ఆదరణ తగ్గింది అనుకుంటారు కానీ.. మంచి కథాబలం ఉన్న సినిమాలు వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా ఆదరిస్తారు. అలా ఇప్పుడు వచ్చిన సినిమా కోటబొమ్మాలి పిఎస్. మలయాళంలో సక్సెస్‌ అయిన నాయట్టు సినిమాకిది రీమేక్‌. తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు ఇందులో.

Kota Bommali PS: కోటబొమ్మాళి పీఎస్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే
Kota Bommali Ps
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Nov 24, 2023 | 5:05 PM

Share

మూవీ రివ్యూ: కోట బొమ్మాళి

నటీనటులు: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు

ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్

సినిమాటోగ్రాఫర్: జగదీష్ చీకటి

సంగీతం: రజిని రాజ్

నిర్మాతలు: బన్నీ వాసు, విద్యా కొప్పినీడి

దర్శకుడు: తేజ మార్ని

శ్రీకాంత్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో తేజ మార్ని తెరకెక్కించిన సినిమా కోట బొమ్మాళీ. తాజాగా ఈ సినిమా విడుదల అయింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఎంతవరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

టెక్కలి నియోజకవర్గంలో బై ఎలక్షన్ల సందడి నడుస్తున్న సమయంలో ఆ ఎన్నికలను ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తుంటాడు హోమ్ మంత్రి(మురళీశర్మ). అదే నియోజకవర్గంలోని కోట బొమ్మాళి పీఎస్‌ లో రామకృష్ణ (శ్రీకాంత్‌) హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తుంటాడు. అతను కూంబింగ్ ఎన్ కౌంటర్‌ స్పెషలిస్ట్ కూడా. అదే స్టేషన్‌లో కుమారి (శివానీ రాజశేఖర్‌), రవి కుమార్‌(రాహుల్‌ విజయ్‌) కానిస్టేబుల్స్ గా పని చేస్తుంటారు. అంతా సాఫీగా జరిగిపోతున్న సమయంలో ఒక పొలిటికల్ లీడర్ కారణంగా ఈ పోలీసుల జీవితాలు తారుమారవుతాయి. ఆ తర్వాత ఓ రోజు రాత్రి పార్టీకి వెళ్లి వస్తుండగా రామకృష్ణ, రవి, కుమారి ప్రయాణిస్తున్న పోలీస్‌ జీపు ఓ యాక్సిడెంట్ అవుతుంది. ఆ ప్రమాదంలో నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి (విష్ణు) మరణిస్తాడు. అతడి మరణానికి కారణమైన పోలీస్‌లను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌ పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ..

కథనం:

ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలకు ఆదరణ తగ్గింది అనుకుంటారు కానీ.. మంచి కథాబలం ఉన్న సినిమాలు వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా ఆదరిస్తారు. అలా ఇప్పుడు వచ్చిన సినిమా కోటబొమ్మాలి పిఎస్. మలయాళంలో సక్సెస్‌ అయిన నాయట్టు సినిమాకిది రీమేక్‌. తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు ఇందులో. ఈ సినిమాకు ప్రధానమైన బలం నటీనటుల ఎంపిక. ఇది క్రైమ్‌ ప్రధానంగా సాగే పొలిటికల్‌ థ్రిల్లర్. పోలీసులను, చట్టాలను, అందులో ఉన్న బొక్కలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు.. అధికారం కోసం పోలీసులతో ఎలా ఆడుకుంటారు అనేది సినిమాలో చాలా బాగా చూపించారు.

రాష్ట్రంలో ఎన్నికల వేడి నడుస్తున్న సమయంలో ఇలాంటి సినిమా రావడం పరిస్థితులకు అద్దం పడుతుంది. జనాలను కులాల పేరుతో ఎలా వాడుకుంటాయనే దానికి ఈ సినిమా నిదర్శనం. సినిమా మొత్తం చాలా రేసీగా సాగిపోయింది. ఎలక్షన్ల సమయంలో పోలీసులు పడే పాట్లు.. ఓట్ల కోసం రాజకీయ నాయకులు పడే ఇబ్బందులు.. ఇవన్నీ చాలా రియలిస్టిక్‌గా చూపించారు. ఎక్కువ ఓట్లున్న సామాజిక వర్గాల కోసం రాజకీయ పార్టీలు ఎలాంటి ఎర వేస్తారు.. ఆ ఓట్లు పిండుకోడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు.. ఎలాంటి శవ రాజకీయాలు చేస్తారు అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. పోలీసుల జీపు కారణంగా ఉన్నత సామాజిక వర్గానికి చెందిన యువకుడు చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ సమయంలో పోలీసులు తాగి ఉండటం.. దాన్నుంచి తప్పించుకోవడానికి శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ ఎలా కష్టపడతారు అనేది అసలు పాయింట్. వాళ్ళను పట్టుకోడానికి పోలీస్‌ ఆఫీసర్‌ వరలక్ష్మి శరత్ కుమార్ వేసే ఎత్తులు వేయడం, దాన్ని శ్రీకాంత్‌ చిత్తు చేయడం అంతా ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్‌ వరకు సినిమా పరుగులు పెడుతుంది. సెకండాఫ్‌ కాస్త బోర్ కొడుతుంది.

నటీనటులు:

శ్రీకాంత్ చాలా విలువలు తర్వాత అద్భుతమైన పాత్రలో నటించాడు. ఆయన మీద సినిమా మొత్తం నడుస్తుంది. ఆ పాత్రను చాలా చక్కగా పోషించాడు శ్రీకాంత్. రాహుల్ విజయ్ కూడా తన పాత్ర పూర్తి న్యాయం చేశాడు. ఇక శివాని రాజశేఖర్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించింది. హోం మంత్రి పాత్రలో మురళి శర్మ అద్భుతంగా నటించాడు. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీమ్:

కోట బొమ్మాళి పీఎస్‌ సినిమాకు టెక్నీషియన్లు అదనపు బలం. ఇలాంటి క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలకు రీ రికార్డింగ్ బాగుండాలి.. రంజిన్‌ రాజ్‌ ఈ విషయంలో మంచి మార్కులు స్కోర్ చేశాడు. జగదీష్‌ చీకటి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎక్కువ భాగం రాత్రిళ్లే సినిమా సాగుతుంది. ఎడిటింగ్ పర్లేదు. దర్శకుడు తేజ మార్ని సినిమాని బాగా డీల్‌ చేశాడు. రీమేక్ అయినా కూడా.. చాలా మార్పులు చేశాడు తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు ఆసక్తికరంగా తెరకెక్కించడంలో సఫలం అయ్యాడు.

పంచ్ లైన్:

కోట బొమ్మాళీ పీఎస్.. ఎంగేజింగ్ పొలిటికల్ థ్రిల్లర్..