AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Son of Vyjayanthi Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూ.. కళ్యాణ్ రామ్ సినిమా మెప్పించిందా.?

నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది మరి ఈ చిత్రం ఎలా ఉంది..? కళ్యాణ్ రామ్ కోరుకున్న విజయాన్ని తీసుకొచ్చిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Arjun Son of Vyjayanthi Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి రివ్యూ.. కళ్యాణ్ రామ్ సినిమా మెప్పించిందా.?
Arjun Son Of Vyjayanthi
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Apr 18, 2025 | 1:06 PM

Share

మూవీ రివ్యూ: అర్జున్ సన్నాఫ్ వైజయంతి

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, శ్రీకాంత్, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్ తదితరులు

ఎడిటర్: తమ్మిరాజు

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ: సి రామ్ ప్రసాద్

సంగీతం: అజినీష్ లోక్‌నాథ్

స్క్రీన్ ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా

కథ, దర్శకుడు: ప్రదీప్ చిలుకూరి

నిర్మాతలు: కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు

కథ:

అర్జున్ (కళ్యాణ్ రామ్) వైజాగ్‌ను తన కనుసన్నల్లో శాసిస్తుంటాడు. పోలీసులు కూడా ఆయన ఉన్న చోటుకు కనీసం అనుమతి లేనిదే లోపలికి రారు. అంత పవర్ ఫుల్‌గా మారిపోతాడు అర్జున్. ఆయన తల్లి వైజయంతి (విజయశాంతి) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆమె ఉన్న చోట నేరం జరిగితే అస్సలు సహించదు. తప్పు చేసింది కన్న కొడుకు అయినా కూడా క్షమించదు. ఈ ఇద్దరి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో వైజాగ్ సిటీని మహాంకాళి అనే రౌడీ అందరినీ భయపెడుతుంటాడు. అర్జున్ వచ్చాక ఆ మహాంకాళి కూడా సైలెంట్ అయిపోతాడు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పఠాన్ (సోహైల్ ఖాన్) జైలు నుంచే చాలా ప్లానింగ్ చేస్తుంటాడు. ఆ ప్లాన్ అడ్డుకోడానికి అర్జున్ వస్తాడు. అక్కడ్నుంచి వార్ వైజయంతి, అర్జున్ మధ్య కాకుండా.. అర్జున్, పఠాన్ మధ్య మొదలవుతుంది. ఆ తర్వాత ఏమైంది..? అసలు డిసిపి ప్రకాశ్ (శ్రీకాంత్)కు వైజయంతికి ఉన్న సంబంధం ఏంటి..? ఎందుకు పఠాన్ అలా చేస్తుంటాడు అనేది మిగిలిన కథ..

కథనం:

మాస్ సినిమాలు చూసేటప్పుడు లాజిక్స్ వెతక్కూడదు. అలా కాదని ఆరాలు తీయడం మొదలుపెడితే.. అరగంట కూడా చూడలేం. అర్జున్ సన్నాఫ్ వైజయంతి కూడా అలాంటి కమర్షియల్ సినిమానే. తెలియని కథ కాదు.. స్క్రీన్ ప్లే కొత్తగా ఏముండదు. అదే జనతా గ్యారేజ్ తరహా టెంప్లేట్ ఫార్ములా సినిమానే. జనానికి కష్టం వస్తే పోలీసుల దగ్గరికి కాకుండా హీరో దగ్గరికి వస్తుంటారు. ఓ పేటలో ఉంటూ.. వాళ్ల కష్టాలను తీరుస్తుంటాడు హీరో. అతన్ని దేవుడిలా కొలుస్తుంటారు జనం.. అవసరం అయితే ప్రాణాలిస్తారు కానీ హీరో గురించి ఒక్క ముక్క కూడా బయట చెప్పరు. ఇలాంటి టెంప్లేట్ కథనే మదర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ చేసాడు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నాడు.. ముఖ్యంగా విజయశాంతి, కళ్యాణ్ రామ్ సీన్స్ బాగున్నాయి. ఫస్టాఫ్ చాలా వేగంగా వెళ్లిపోయింది.. ప్రతీ 10 నిమిషాలకు ఓ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. సినిమాలో సీన్స్ తక్కువ.. యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. షూటింగ్ మొత్తం 140 రోజుల్లో చేస్తే.. 110 రోజులు అందులో కేవలం యాక్షన్ సీన్స్ చిత్రీకరించామని దర్శక నిర్మాతలు చెప్పారు. అలా ఎందుకు చెప్పారో సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ ఆకట్టుకుంటుంది.. బాగా హైప్ ఇచ్చిన క్లైమాక్స్‌లో చిన్న ట్విస్ట్ ఉంది.. అదిక్కడ చెప్పడం బాగుండదు.. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అనవసరపు కామెడీ ట్రాక్స్.. లేనిపోని పాటలు ఇరికించకుండా.. తాను అనుకున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రాపర్‌గా తెరకెక్కించాడు దర్శకుడు ప్రదీప్. హీరో, మదర్ మధ్య వచ్చే సీన్స్ చాలా వరకు బాగానే ఎమోషనల్‌గా వర్కవుట్ అయ్యాయి. అదే సినిమాకు సేవియర్ కూడా. క్లైమాక్స్ కూడా ఊహించినంత స్థాయిలో లేకపోయినా.. వాళ్లు ఇచ్చిన హైప్ కాస్త మ్యాచ్ అయ్యారు. రొటీన్ మాస్ సినిమాలు చూసే ఆడియన్స్‌కు అర్జున్ సన్నాఫ్ వైజయంతి పర్లేదనిపిస్తుంది.

నటీనటులు:

వైజయంతిగా విజయశాంతి అద్భుతంగా నటించారు.. ఈ క్యారెక్టర్ ఆమె తప్ప ఎవరూ చేసినా చూడలేం. కళ్యాణ్ రామ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.. మాస్ రోల్‌లో రప్ఫాడించాడు. ఫుల్ ఎనర్జీతో కనిపించాడు. డాన్సులు, ఫైట్లు కుమ్మేసాడు. సాయి మంజ్రేకర్ టిపికల్ వైఫ్ పాత్ర. శ్రీకాంత్ కీలక పాత్రలో మెప్పించాడు. సోహైల్ ఖాన్ పర్లేదు.. మిగిలిన వాళ్లలో పృథ్వీ క్యారెక్టర్ బాగుంది. సినిమా అంతా హీరోతోనే ఉండే పాత్ర ఇది. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

అజినీష్ లోక్‌నాథ్ సంగీతం బాగుంది. పాటలు పర్లేదు.. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. రామ్ ప్రసాద్ వర్క్ బాగుంది. తమ్మిరాజు ఎడిటింగ్ ఓకే.. కాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింది కానీ దర్శకుడి ఛాయిస్ కదా..? ఇక నిర్మాతలు కూడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మదర్ సెంటిమెంట్ కలిపి ప్రాపర్ కమర్షియల్ సినిమా తీసాడు.. అక్కడక్కడా డల్ మూవెంట్స్ ఉన్నా.. మాస్ ఆడియన్స్‌కు పర్లేదనిపిస్తుంది ఈ చిత్రం. ఎక్కడా కొత్త సినిమా చూసిన ఫీల్ రాదు.. అలాగని తీసిపారేసే కథ కూడా కాదు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. కొత్తగా ఏం లేదు.. రొటీన్ కమర్షియల్ బొమ్మ అంతే..