Telangana: సినిమాను చంపేస్తున్న టికెట్ రేట్లు.. ఇదే కంటిన్యూ అయితే ఇక కష్టమే
ముఖ్యంగా నైజాంలో అయితే మీడియం రేంజ్ సినిమాలకు సైతం 295 రూపాయల టికెట్ రేట్ సినిమాను చంపేస్తుంది. మరి దీనిపై నిర్మాతలెందుకు తీరు మార్చుకోవట్లేదు..? ఇలానే కంటిన్యూ అయితే కష్టం అన్నది ప్రేక్షకుల వెర్షన్..

ఏరా కొత్త సినిమా వచ్చింది వెళ్దామా.. బాబోయ్ ఎవడొస్తాడ్రా నాయనా టికెట్ 300 అంట..! బయటికి చెప్పట్లేదు కానీ చాలా మంది మనసులో ఉన్న మాటిదే. చాలా రోజుల తర్వాత టికెట్ల ఇష్యూ మళ్లీ మొదలయ్యేలా కనిపిస్తుంది. టికెట్ రేట్ ఎక్కువ పెడితే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ఆలోచిస్తున్నారు కానీ.. 100 మంది చూసే సినిమా 10 మందే చూస్తున్నారనే లాజిక్ మన నిర్మాతలెందుకు మిస్ అవుతున్నారో అర్థం కావట్లేదంటున్నారు విశ్లేషకులు. ఇందులో నిజం కూడా లేకపోలేదు. శాకుంతలం, ఏజెంట్, రావణాసుర లాంటి సినిమాలు ఊహించిన దానికంటే పెద్ద డిజాస్టర్ కావడానికి కారణం ఈ టికెట్ రేట్ కూడా.
స్టార్ హీరోల సినిమాలకు 300 రేట్ పెట్టడానికి రెడీగా ఉంటారు ఫ్యాన్స్. బాగుంటే ఫ్యామిలీస్‌తో వెళ్తారు.. నెగిటివ్ టాక్ వచ్చిందంటే డబ్బులు వేస్ట్ అని పెద్ద సినిమాలను కూడా చూడట్లేదు ఆడియన్స్. అలాంటిది మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా మల్టీప్లెక్స్‌లో 295 రూపాయల రేట్ నిండా ముంచేస్తుంది. ఏపీలో ఈ సమస్య లేదు కానీ నైజాంలో మాత్రం ప్రతీ సినిమాకు 300 టికెట్ రేట్ పెట్టేస్తున్నారు ప్రొడ్యూసర్స్.
మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాను చంపేస్తుంది పాప్ కార్న్ రేట్ అని చెప్పారు దర్శకుడు తేజ. పాప్ కార్న్ కొనాలంటే ముందు టికెట్ కొనాలిగా.. అక్కడే భయపడి ఆగిపోతుంటే ఇంక పాప్‌కార్న్ ఎవడు కొంటాడనేది ఆడియన్స్ ప్రశ్న. ఆ మధ్య విక్రమ్, మేజర్, కార్తికేయ 2, కాంతార లాంటి సినిమాలకు 200 రూపాయలు పెడితే ప్రేక్షకులు ఎగబడి చూసారు. అది వదిలేసి రేట్ పెంచుకుంటే.. ఫస్ట్ డే మార్నింగ్ షోకే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.