Hi Nanna Movie Review : ఏడిపించేసిన నాని.. హాయ్ నాన్న సినిమా ఎలా ఉందంటే
దసరాతో అదిరిపోయే మాస్ సినిమా ఇచ్చిన నాని.. ఇప్పుడు పూర్తిగా క్లాస్ సినిమాతో వచ్చారు. గతంలో జెర్సీలో తండ్రీ కొడుకు సెంటిమెంట్ చూపించిన ఈయన.. ఇప్పుడు తండ్రి కూతురు ఎమోషన్‌తో వచ్చాడు. హాయ్ నాన్న అంటూ ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాతో శౌర్యువ్ అనే దర్శకుడు పరిచయం అయ్యాడు. మరి ఈ సినిమాతో నాని ఎంతవరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..
మూవీ రివ్యూ: హాయ్ నాన్న
నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా, జయరాం, ప్రియదర్శి పులికొండ, అగంద్ బేబీ, విరాజ్ అశ్విన్, శ్రుతి హాసన్ తదితరులు
సంగీతం: హషీమ్ అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్
ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోనీ
నిర్మాత: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: శౌర్యువ్
దసరాతో అదిరిపోయే మాస్ సినిమా ఇచ్చిన నాని.. ఇప్పుడు పూర్తిగా క్లాస్ సినిమాతో వచ్చారు. గతంలో జెర్సీలో తండ్రీ కొడుకు సెంటిమెంట్ చూపించిన ఈయన.. ఇప్పుడు తండ్రి కూతురు ఎమోషన్‌తో వచ్చాడు. హాయ్ నాన్న అంటూ ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాతో శౌర్యువ్ అనే దర్శకుడు పరిచయం అయ్యాడు. మరి ఈ సినిమాతో నాని ఎంతవరకు ఆకట్టుకున్నాడో చూద్దాం..
కథ:
విరాజ్ (నాని) ముంబైలో ఫేమస్ ఫోటోగ్రఫర్. తన కూతురు మహి (కియారా ఖన్నా), మామయ్య (జయరాం)తో కలిసి ఉంటాడు. కూతురు అంటే విరాజ్‌కు ప్రాణం. పుట్టినప్పటి నుంచే అరుదైన వ్యాధితో పోరాడుతుంటుంది మహి. కంటికి పాపలా కూతురును చూసుకుంటుంటాడు విరాజ్. అయితే రోజూ అమ్మ కథ చెప్పాలని అడుగుతూ ఉంటుంది మహి. కానీ విరాజ్ మాత్రం అమ్మ కథ చెప్పడు. ఒకరోజు ఇంట్లోంచి వెళ్లిపోయిన మహిని అనుకోని ప్రమాదం నుంచి కాపాడుతుంది యష్ణ (మృణాళ్ ఠాకూర్). ఓ కాఫీ షాప్‌లో మహితో కలిసి చాలా క్లోజ్ అయిపోతుంది యష్ణ. కచ్చితంగా అమ్మ కథ చెప్తే కానీ ఇంటికి రాను అంటుంది మహి. అప్పుడు తన కథ చెప్తాడు విరాజ్. ఈసారి తండ్రి చెప్పే కథలో తన అమ్మ వర్ష పాత్రని యష్ణలో ఊహించుకుంటుంది మహి. అసలు వర్ష ఎవరు.. ఎందుకు విరాజ్ జీవితం నుంచి వెళ్లిపోయింది.. ఆ తర్వాత ఏమైంది.. యష్ణ, మహి ఎందుకు అంతగా కనెక్ట్ అయిపోతారు అనేది అసలు కథ..
కథనం:
కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో చూడ్డానికి వెళ్తాము.. కానీ నాని సినిమా మాత్రం ఎలా ఉన్నా చూడ్డానికి వెళ్తుంటారు ఆడియన్స్. అలాంటి ముద్ర వేసాడు ఈయన. ఒక్కసారైనా నాని సినిమా చూడొచ్చు అనిపిస్తుంది అతడి యాక్టింగ్ చూస్తుంటే. హాయ్ నాన్న కూడా దీనికి మినహాయింపు కాదు. సినిమా మొదలవ్వగానే 15 నిమిషాలు ఒకరకమైన ట్రాన్స్‌లోనే ఉండిపోతారు ప్రేక్షకులు. కానీ కథ ముందుకు వెళ్తున్న కొద్దీ భారంగా మారింది.. అసలేం ఉందని నాని ఈ కథ ఒప్పుకున్నాడో అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ వరకు చాలా మంది ప్రేక్షకులకు ఇదే అభిప్రాయం ఉంటుంది. ఇదేంటి ఇంత స్లోగా ఉంది.. పైగా పాత చింతకాయ పచ్చడి.. ఏముంది ఇందులో అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ కార్డ్ పడినప్పటి నుంచి ఒపీనియన్ మారిపోతుంది. ఫస్టాఫ్ లో కనిపించిన లోపాలన్నీ సెకండాఫ్ లో మాయం అయ్యాయి. అక్కడ మిస్ అయిన ఎమోషన్స్ ఇక్కడ పడ్డాయి.. పండాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సెకండాఫ్ రైటింగ్ అద్భుతంగా ఉంది. నాని, పాప మధ్య సీన్స్.. ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ ఇలా అన్నీ హైలీ ఎమోషనల్. అక్కడ కంటతడి పెట్టకుండా ఉండలేం అంటే అతిశయోక్తి కాదేమో..? ముఖ్యంగా పాప నటించిన తీరుకు కన్నీరు తప్పదు. ముఖ్యంగా సింపుల్ కథను చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు శౌర్యువ్. ఫస్టాఫ్ హీరో అమ్మ కథ చెప్పడం మొదలు పెట్టిన తర్వాత రొటీన్ అయిపోతుంది. ప్రెడిక్టబుల్ కథ, కథనాలే ఉంటాయి. కానీ టేకింగ్ వరకు మాత్రం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సింపుల్ సన్నివేశాలనే నాని, మృణాళ్ తమ నటనతో సినిమాను పతాక స్థాయికి చేర్చేసారు. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమాకు ఎండ్ కార్డ్ పడేంత వరకు నాని, కియారా నటన నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. తండ్రీ కూతురుగా ఈ ఇద్దరి నటన చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది.
నటీనటులు:
నాని ఎప్పటిలాగే ఈ క్యారెక్టర్ కోసమే పుట్టినట్టు అనిపించింది. భర్తగా రొటీన్ అనిపించినా.. నాన్న పాత్ర దగ్గరికి వచ్చేసరికి మాత్రం కళ్లతోనే ఏడిపించేసాడు నాని. ముఖ్యంగా కొన్ని సీన్స్‌లో అయితే నాని నటన గురించి చెప్పడానికి మాటలు రావు. ఇక కూతురుగా నటించిన కియార ఖన్నా చివర్లో ఏడిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ అన్నీ అద్భుతంగా నటించింది కియారా. మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సీతా రామం తర్వాత మరో ఎమోషనల్ రోల్ చేసింది ఈ బ్యూటీ. శ్రుతి హాసన్ ఎందుకు ఉందో ఆమెకు కూడా తెలియదు. జయరాం పర్లేదు.. క్లైమాక్స్‌లో ఆయన కారెక్టర్ పండింది. ప్రియదర్శి సినిమా అంతా హీరో ఫ్రెండ్‌గా బాగున్నాడు. బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ మరికొందరు తమ తమ పాత్రల్లో బాగా నటించారు.
టెక్నికల్ టీం:
హేషమ్ మ్యూజిక్ బాగుంది. పాటలు అయితే చాలా బాగున్నాయి. ముఖ్యంగా గాజు బొమ్మతో పాటు సమయమా పాటలు మనసుకు హత్తుకుంటాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కానీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. ఎడిటింగ్ కాస్త స్లో అయింది. ఫస్టాఫ్ కొన్ని సీన్స్ కట్ చేసుంటే బాగుండేది కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఎడిటర్‌ను తప్పు బట్టలేం. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. చాలా వరకు సీన్స్ అన్నీ అందంగా కనిపించాయి స్క్రీన్ మీద. నాని ఈ కథకు దొరకడంతో దర్శకుడు శౌర్యు లోపాలు పెద్దగా కనిపించలేదు. నార్మల్ సీన్స్ కూడా చాలా బాగా నటించి వాటి స్థాయిని పెంచేసాడు నాని. అలాగే మృణాళ్, కియారా కూడా దర్శకుడి పని మరింత సులువు చేసారు.