Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం.. ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి మరో యాక్షన్ అడ్వెంచెరస్ మూవీని తెరకెక్కించేందుకు జక్కన్న రెడీ అవుతున్నారు.
రాజమౌళి కుటుంబం ఒకే ఇంట్లో కలిసి జీవిస్తుందని చాలా మందికి తెలుసు. తండ్రి, సోదరులు అందరూ దాదాపు ఒకే ఇంట్లో ఉంటారు. అయితే ఆ ఇంటి హాలులో తలుపుకు ఎదురుగా గోడపై ఒక మహనీయుని చిత్రం పటం ఉంటుంది. అదెవరిదో కాదు భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ది. ప్రపంచంలోని గొప్ప నాయకులలో అంబేద్కర్ కూడా ఒకరు. రాజ్యాంగాన్ని రూపొందించిన ఆయన లక్షలాది అణగారిన వర్గాల జీవితాలకు సాధికారత కల్పించారు. అయినా కూడా అంబేద్కర్ కొన్ని వర్గాలకు, కులాలకు మాత్రమే పరిమితమయ్యారన్న అభిప్రాయాలున్నాయి. అంబేద్కర్ విగ్రహాలు భారతదేశంలోని అనేక ప్రదేశాలలో, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలలో చూడవచ్చు. కానీ ఇంట్లో అంబేద్కర్ చిత్రపటాలు పెట్టుకునే వారు చాలా తక్కువ. అందుకు చాలా ‘సామాజిక కారణాలు’ ఉండొచ్చు. కానీ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇంట్లో అంబేద్కర్ పెద్ద చిత్ర పటం ఉంటుందట. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఇటీవల విజయేంద్ర ప్రసాద్ ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అంబేద్కర్ సినిమా గురించి ఇంటర్వ్యూయర్ విజయేంద్ర ప్రసాద్ ను ఒక ప్రశ్న అడిగారు. ‘సాధారణంగా అంబేద్కర్ ఫొటోలు, చిత్ర పటాలు, విగ్రహాలు ఏదో ఒక ప్రాంతంలో లేదా కొన్ని కమ్యూనిటీ హౌస్‌లలో మాత్రమే కనిపిస్తాయి కానీ ఇంత పెద్ద చిత్రాన్ని హాలులో ఎందుకు పెట్టలేదు?’ అని అడిగారు. దీనికి విజయేంద్ర ప్రసాద్ సూటిగా సమాధానమిస్తూ, ‘నాకు అంబేడ్కర్ అంటే చాలా ఇష్టం. కానీ అందుకు కారణేమేంటో నేను వివరించలేను. 2012లో హిస్టరీ, సీఎన్‌ఎన్ ఛానల్‌లు స్వాతంత్య్రానంతర భారతదేశపు గొప్ప వ్యక్తి ఎవరనే అంశంపై నిర్వహించిన సర్వేలో అంబేద్కర్‌కు మొదటి స్థానం, అబ్దుల్ కలాంకు రెండో స్థానం లభించాయి. నేను అంబేద్కర్ గురించి ఎలాంటి రీసెర్చ్ చేయలేదు. కానీ ఆయనంటే నాకెంతో ఇష్టం. అందుకే అంబేడ్కర్ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకున్నాను’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.
విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన 2022లో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.