AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవదాసు సినిమా క్రేజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు చుక్కలు చూపిన జనాలు

కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ఎవర్ గ్రీన్ గా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఈ సినిమా ఒకటి.. తెలుగు సినిమాలో చెరిగిపోని సంతకం ఈ సినిమా.. అదే అక్కినేని నాగేశ్వరరావు నటించిన.. కాదు జీవించిన దేవదాసు

దేవదాసు సినిమా క్రేజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు చుక్కలు చూపిన జనాలు
Movie
Rajeev Rayala
|

Updated on: Apr 05, 2026 | 1:01 PM

Share

అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ప్రధాన పాత్రల్లో, వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో, ఘంటసాల సంగీత సారధ్యంలో 1953లో విడుదలైన దేవదాసు చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి. ఈ సినిమా కేవలం ఒక కళాఖండంగానే కాక, అప్పట్లో ప్రజల మనస్సులపై చెరగని ముద్ర వేసింది. దశాబ్దాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ సినిమా క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచిన ఒక సంఘటనను పత్రికలు కూడా విస్తృతంగా ప్రచురించాయి. దేవదాసు విడుదలైన తర్వాత, సినిమాలోని పాటలు, ముఖ్యంగా ఘంటసాల గానం చేసిన గీతాలు అద్భుతమైన ప్రజాదరణ పొందాయి. అంతేకాదు, దేవదాసు కథకు పాటలు ప్రాణం పోశాయి అని చాలామంది అభిప్రాయపడ్డారు. అప్పట్లో రేడియోల్లో, గ్రామ్‌ఫోన్‌లలో ఈ పాటలు నిరంతరం వినిపించేవి.. ఎక్కడ నలుగురు గుమిగూడినా దేవదాసు పాటలే పాడుకునేవారు.

ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఘంటసాల, దర్శకుడు వేదాంతం రాఘవయ్య సహా అందరి క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఇటువంటి ప్రభావాన్ని చాటి చెప్పిన సంఘటన ఘంటసాల అనుభవంలో ఉంది. దేవదాసు విజయవంతమైన తర్వాత కొద్దికాలం గ్యాప్‌లో, గాయకుడిగా, నటుడిగా పేరుగాంచిన ఘంటసాల తెనాలిలో సక్కుబాయి నాటకంలో నటించడానికి వెళ్లారు. రక్తకన్నీరు నాగభూషణం వలె, ఘంటసాల కూడా అప్పుడప్పుడు నాటకాల్లో నటించేవారు. సక్కుబాయి నాటకంలో ఆయన యోగి వేషం వేశారు. నాటకంలో ఆయన ప్రవేశం రంగ రంగ ఏనండి అనే పాటతో జరగాల్సి ఉంది. అయితే, ఘంటసాల నాటకంలో నటిస్తున్నారని తెలిసిన ప్రేక్షకులు, రెండు మూడు దృశ్యాలు పూర్తయ్యేసరికే ఆయన కోసం ఎదురుచూడలేకపోయారు.

ఘంటసాల రావాలి, రావాలి అంటూ నినాదాలు చేస్తూ గోల చేశారు. నిజానికి నాటకంలో ఘంటసాల ప్రవేశం ద్వితీయార్థంలో ఉంటుంది. అయినా జనాల పట్టుదల ముందు నాటక నిర్వాహకులు తలవంచక తప్పలేదు. ఈ గోల తట్టుకోలేక ఘంటసాల ముందే రంగ ప్రవేశం చేశారు. తనదైన శైలిలో “రంగ రంగ” అంటూ గానం చేశారు. కానీ, “దేవదాసు” మత్తులో ఉన్న ప్రేక్షకులు అక్కడితో ఆగలేదు. అది నాటకమని, ఘంటసాల ఒక పాత్రలో నటిస్తున్నారని తెలిసినప్పటికీ, యోగి వేషంలో ఉన్న ఆయన్నుండి దేవదాసు పాటలే కావాలని పట్టుబట్టారు. ఈ డిమాండ్‌తో ఘంటసాల విస్మయం చెందారు. ఆయన ప్రేక్షకులకు దండం పెట్టి, బాబు నాటకం జరగనివ్వండి. నాటకం అయ్యాక మీకు కావాల్సిన పాటలన్నీ పాడతాను. దేవదాసు పాటలు మాత్రమే కాదు, మీరు అడిగిన ఏ పాటలైనా పాడతాను అని వినయంగా కోరారు. నాటకం పూర్తయిన వెంటనే ఘంటసాల తన మాట నిలబెట్టుకుని, దేవదాసు సినిమా పాటలు, ఇతర గ్రామ్‌ఫోన్ పాటలు పాడి ప్రేక్షకులను సంతోషపరిచారు. ఇది తెలుగు సినీ చరిత్రలో దేవదాసు సినిమాకు ఉన్న అసాధారణ ప్రభావాన్ని, ప్రజల హృదయాల్లో దాని స్థానాన్ని గుర్తు చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us