Bachhala Malli Review: బచ్చల మల్లి మూవీ రివ్యూ.. అల్లరి నరేశ్ మళ్లీ హిట్టు కొట్టాడా.. ?
Bachhala Malli Review: అల్లరి నరేష్ అంటే మనకు ఎప్పుడూ కామెడీ సినిమాలే గుర్తుకొస్తాయి. కానీ ఈ మధ్య ఆయన సీరియస్ సినిమాలు కూడా ఎక్కువగా చేస్తున్నారు. అలా చేసిన సినిమా బచ్చల మల్లి. సుబ్బు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
మూవీ రివ్యూ: బచ్చల మల్లి
నటీనటులు: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రావు రమేష్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష, ప్రసాద్ బెహరా తదితరులు
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్ నాథన్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుబ్బు
నిర్మాతలు: రాజేష్ దండ, బాలాజీ గుత్తా
అల్లరి నరేష్ అంటే మనకు ఎప్పుడూ కామెడీ సినిమాలే గుర్తుకొస్తాయి. కానీ ఈ మధ్య ఆయన సీరియస్ సినిమాలు కూడా ఎక్కువగా చేస్తున్నారు. అలా చేసిన సినిమా బచ్చల మల్లి. సుబ్బు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
బచ్చల మల్లి (అల్లరి నరేష్) చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుకుంటాడు. టెన్త్ క్లాస్ లో జిల్లా ఫస్ట్ కూడా వస్తాడు. దాంతో తండ్రి అందరికీ చెప్పుకొని మురిసిపోతాడు. కానీ అది జరిగిన కొన్ని రోజులకే చిన్న భార్య కోసం.. పెద్ద భార్యతో పాటు కొడుకు బచ్చల మల్లిని కూడా వదిలేసి వెళ్లిపోతాడు తండ్రి. దాంతో అప్పటి నుంచి పూర్తిగా మూర్ఖుడిగా మారిపోతాడు మల్లి. ఎవరు ఏం చెప్పినా వినడు.. తనను వదిలేసి వెళ్లిన వాళ్లను ఒక్క క్షణంలో ఆయన కూడా వదిలేస్తాడు. మందుకు, సిగరెట్ కు బానిస అవుతాడు.. అమ్మాయిల అలవాటు కూడా ఉంటుంది. అలాంటి మల్లి జీవితంలోకి కావేరి (అమృత అయ్యర్) వచ్చిన తర్వాత మార్పు మొదలవుతుంది. ఆమె కోసం అన్ని మానేస్తాడు బచ్చల మల్లి. కానీ తన మూర్ఖత్వంతో ప్రేమలో కూడా ఓడిపోతాడు.. ఆ తర్వాత ఏమైంది బచ్చల మళ్ళీ జీవితం ఎలా ముందుకెళ్ళింది.. మూర్ఖత్వం వదిలేసాడా లేదంటే అలాగే ముందుకు వెళ్లాడా అనేది ఈ సినిమా కథ..
కథనం:
జీవితం అన్నాక పట్టు విడుపులు ఉండాలి. ఎప్పుడూ ఒకేలా ఉంటాం.. మూర్ఖత్వంతో ముందుకు వెళతాం.. అంటే జీవితం సాఫీగా సాగదు. అందరినీ కలుపుకోవాలి.. అర్థం చేసుకోవాలి.. బచ్చల మల్లి అనే సినిమాతో దర్శకుడు సుబ్బు ప్రేక్షకులకు చెప్పాలి అనుకున్న కథ ఇదే. తీసుకున్న లైన్ అయితే బాగుంది కానీ చెప్పిన విధానం మాత్రం ఎక్కడో మిస్ కనెక్ట్ అయినట్టు అనిపించింది. ఈ సినిమా మొత్తం కేవలం బచ్చల మల్లి క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళిపోతుంది. టైటిల్ కార్డు మొదలైన దగ్గర నుంచి ఎండ్ కార్డు పడే వరకు కేవలం మల్లి అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. దర్శకుడు కూడా దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేశాడేమో.. అందుకే ఆ క్యారెక్టర్ అంత బాగా వచ్చింది. నిజానికి ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కు తోడు.. లవ్ ట్రాక్ కూడా బాగానే రాసుకున్నాడు దర్శకుడు. కాకపోతే బచ్చల మల్లి సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ తండ్రి, కొడుకుల మధ్య గొడవ. తండ్రి తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో 15 సంవత్సరాలు ఉన్న కుర్రాడు అంత మూర్ఖుడిగా మారిపోతాడు అని చూపించాడు డైరెక్టర్. కానీ ఆ తర్వాత కొడుకుకు కుటుంబానికి దూరమై ఆ తండ్రి పడే ఆవేదనను చాలా బాగా చూపించాడు.. అయితే మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఇంకాస్త బలంగా ఉండుంటే సినిమా మరింత పదునెక్కేది. ఎంతసేపు హీరో మూర్ఖత్వంగా ముందుకెళ్లడం మాత్రమే ప్రతి సీన్లో చూపించాడు దర్శకుడు. ఈ సినిమా కథ మూడు దశల్లో జరుగుతుంది. వాటిపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు సుబ్బు. ముఖ్యంగా హీరోయిన్ ట్రాక్ ఉన్నప్పుడు ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగానే ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. రావు రమేష్, అల్లరి నరేష్ మధ్య ఇంకొన్ని సన్నివేశాలు ఉండుంటే సినిమాకు ప్లస్ అయ్యేదేమో. క్లైమాక్స్ లో ఊహించినట్టుగానే బచ్చల మల్లి జీవితం అవుతుంది. ఓవరాల్ గా ఒక వ్యక్తి జీవితాన్ని సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
నటీనటులు:
అల్లరి నరేష్ ఈ క్యారెక్టర్ కు ప్రాణం పోసాడు. బచ్చల మల్లి అనే పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు నరేష్. ఈ సినిమా కేవలం ఆయన కోసం చూడొచ్చు అంటే అతిశక్తి కాదు. అమృత అయ్యర్ కూడా చాలా బాగా చేశారు. రావు రమేష్, అచ్యుత్ కుమార్ క్యారెక్టర్స్ బాగున్నాయి. హరితేజ మరో కీలకపాత్రలో బాగా నటించింది. మిగిలిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు..
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం. ముఖ్యంగా నిలబడి నిద్ర పడుతుందని అనే పాట చాలా బాగుంది. మిగిలిన పాటలు కూడా సందర్భానుసారంగా ఆకట్టుకుంటాయి. రిచర్డ్ సినిమాటోగ్రఫీ బాగుంది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ చాలా వరకు షార్ప్ గా ఉంది. ఇక దర్శకుడు సుబ్బు తను చెప్పాలనుకున్న ఒక జీవిత కథను స్క్రీన్ మీద చూపించాడు. ఎక్కడ డివియేట్ కాకుండా అనుకున్నది అనుకున్నట్టు చూపించాడు. అయితే క్యారెక్టర్జేషన్ పరంగా బచ్చల మల్లి అదిరిపోయాడు. కానీ సినిమా పరంగా మాత్రం ఎక్కడో ఇన్ కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను బాగానే నిర్మించారు.
పంచ్ లైన్:
ఓవరాల్ గా బచ్చల మల్లి.. ఒక మూర్ఖుడి కథ..
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.