Anni Manchi Sakunamule Movie Review: ‘అన్నీ మంచి శకునములే’ రివ్యూ.. ఓవరాల్‌గా అన్నీ మంచి శకునములే..

ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతా రామం లాంటి సినిమాలతో స్వప్న సినిమా రేంజ్ బాగా పెరిగిపోయింది. కథాబలం ఉన్న సినిమాలతోనే వాళ్లు వస్తారని నమ్ముతున్నారు ఆడియన్స్ కూడా. మరి ఇదే సంస్థ నుంచి ఇప్పుడొచ్చిన అన్నీ మంచి శకునములే ఎలా ఉంది..? నిజంగానే కథ వర్కవుట్ అయిందా లేదంటే మిస్ ఫైర్ అయిందా..?

Anni Manchi Sakunamule Movie Review: 'అన్నీ మంచి శకునములే' రివ్యూ.. ఓవరాల్‌గా అన్నీ మంచి శకునములే..
Anni Manchi Sakunamule
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: May 18, 2023 | 2:58 PM

మూవీ రివ్యూ: అన్నీ మంచి శకునములే

నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నయ్యర్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్, గౌతమి, షావుకారు జానకీ తదితరులు

మాటలు : లక్ష్మీ భూపాల

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫర్ : సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్

సంగీతం : మిక్కీ జె. మేయర్

నిర్మాణ సంస్థలు : స్వప్న సినిమా, మిత్రవిందా మూవీస్

నిర్మాత : ప్రియాంకా దత్

కథ, కథనం, దర్శకత్వం : బీవీ నందినీ రెడ్డి

ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతా రామం లాంటి సినిమాలతో స్వప్న సినిమా రేంజ్ బాగా పెరిగిపోయింది. కథాబలం ఉన్న సినిమాలతోనే వాళ్లు వస్తారని నమ్ముతున్నారు ఆడియన్స్ కూడా. మరి ఇదే సంస్థ నుంచి ఇప్పుడొచ్చిన అన్నీ మంచి శకునములే ఎలా ఉంది..? నిజంగానే కథ వర్కవుట్ అయిందా లేదంటే మిస్ ఫైర్ అయిందా..?

కథ:

దివాకర్ (రావు రమేశ్), సుధాకర్ (సీనియర్ నరేష్) అన్నాదమ్ములు.. వాళ్ల కుటుంబానికి ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) కుటుంబంతో మూడు తరాలుగా ఆస్తి గొడవలు నడుస్తుంటాయి. ఓ కాఫీ ఎస్టేట్ కోసం 100 సంవత్సరాలుగా కోర్టులో గొడవలు పడుతూనే ఉంటారు. అదే కుటుంబంలో రిషి (సంతోష్ శోభన్), ఆర్య (మాళవికా నాయర్) ఒకేరోజు పుడతారు. కానీ డాక్టర్ (ఊర్వశి) కన్ప్యూజన్ కారణంగా పుట్టిన కాసేపటికే ఆస్పత్రిలో పిల్లలు మారిపోతారు. ఒకరికి తెలియకుండా ఒకరింట్లో 24 ఏళ్ల పాటు పెరుగుతారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఆస్తి గొడవలు తగ్గిపోయాయా.. పిల్లలు మారిన విషయం తల్లిదండ్రులకు ఎప్పుడు తెలిసింది..? అసలు ఆర్య, రిషి ఎప్పుడు కలుస్తారు అనేది అసలు కథ..

కథనం:

కొన్ని సినిమాల ట్రైలర్ చూస్తున్నపుడు అరే భలే ఉందే.. కచ్చితంగా ఇది హిట్ మాల్ అనిపిస్తుంది. కానీ అసలు సినిమా మాత్రం సినిమా విడుదలైన తర్వాతే కనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ మంచి శకునములే విషయంలోనూ ఇదే జరిగింది. స్క్రీన్ నిండా జనం కనిపిస్తే సరిపోదు.. దానికి తగ్గ కథ కూడా ఉండాలి. కథ లేకుండా జనాన్ని పెడితే స్క్రీన్ నిండుతుంది కానీ సినిమా పండదు. అన్నీ మంచి శకునములే విషయంలో ఇదే జరిగింది. చిన్న కారెక్టర్‌కు కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉన్నారు. కానీ ఏం చేస్తాం.. స్క్రీన్‌పై కనిపించిన బలం.. కథలో కనిపించలేదు. అందుకే అన్నీ మంచి శకునములే కాస్తా.. అపశకునంగా మారిపోయింది. ఎప్పట్నుంచో చూసిన కథే ఇది.. కాకపోతే స్క్రీన్ ప్లే బాగుంటే హిట్టయ్యే కథ.. అందులోనే అసలు లోపాలున్నాయి.. స్క్రీన్ ప్లే దారుణంగా మిస్ ఫైర్ అయింది. ఫస్టాఫ్ అయితే మరీ సీరియల్‌గా సాగిపోతూ ఉంటుంది. అసలు కథలోకి వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతుంది. ఎందుకు వస్తాయో కూడా తెలియని సీన్స్ కొన్ని ఉన్నాయి. హీరో హీరోయిన్స్ మధ్య ట్రాక్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కోర్టు కేసులు, గొడవలు అంటూ సినిమా అంతా చూపించారు కానీ.. కానీ అందులో సీరియస్ నెస్ మాత్రం చూపించలేదు. ఎంతసేపు మాటల వరకు చెప్పడం.. కోర్ట్ సీన్స్ రూపంలో చూపించి లెంత్ పెంచడం తప్ప ఇంకేం లేదు. ఇంటర్వెల్ సీన్ కూడా అంతంతమాత్రమే. సెకండాఫ్ సైతం దానికి తక్కువేం కాదు. క్లైమాక్స్ వరకు కూడా అంతే సాగదీత.. చివరి 20 నిమిషాలు మాత్రం కొంచెం పర్లేదు. పిల్లలు మారిపోయారు అన్న విషయం తెలిసాక కాస్త ఎమోషన్ వర్కవుట్ అయింది. అది కూడా సీన్స్ గొప్పతనం కాదు.. నటీనటుల గొప్పతనం మాత్రమే.

నటీనటులు:

సంతోష్ శోభన్‌లో ఈజ్ ఉంది.. కానీ అతన్నెవరూ వాడుకోవడం లేదు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. తనకు ఇచ్చిన పాత్రకు 100 పర్సెంట్ న్యాయం చేసాడు కానీ కథ వర్కవుట్ కాలేదు. మాళవిక నయ్యర్ ఈ సారి నటనతో పాటు గ్లామర్ షో కూడా బాగానే చేసింది. నరేష్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ తమ పాత్రల్లో మెప్పించారు. గౌతమి నటన చాలా బాగుంది. న్యాచురల్‌గా కనిపించారు. షావుకారు జానకి చాలా ఏళ్ళ తర్వాత స్క్రీన్ మీద కనిపించారు. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

సంగీత దర్శకుడుగా మిక్కీ జే మేకర్ ఆకట్టుకోలేదు. ఆయన పాటలు పెద్దగా ఎక్కలేదు. ఆర్ఆర్ కూడా మహానటిని గుర్తు చేసింది. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. ఎడిటింగ్ మాత్రం వీక్‌గా ఉంది. నందిని రెడ్డి మాత్రం దర్శకురాలిగా పెద్దగా ప్రభావం చూపించలేదు. మంచి పాయింట్ తీసుకున్నా దాన్ని డెవలప్ చేయడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారేమో అనిపిస్తుంది. కథ విషయంలో సేఫ్ గేమ్ ఆడినా.. కథనంలో దొరికిపోయారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. హీరోను మించిన బడ్జెట్ పెట్టారు. కథను నమ్మి ఖర్చు పెట్టారు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా అన్నీ మంచి శకునములే.. ఆకట్టుకోని శకునాలే..