Allu Arjun: వరుణ్ ప్రతి సినిమా కోసం కష్టపడతాడు కానీ ‘గని’ కోసం ప్రాణం పెట్టాడు: అల్లు అర్జున్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు, ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గని(Ghani movie). గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత వరుణ్ నటిస్తున్న సినిమా ఇది. దాంతో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమాలోని పాటలకు, ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఏప్రిల్ 2న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మా ఫ్యామిలీలో నాన్నగారు అల్లు అరవింద్ తర్వాత తమ్ముడు శిరీష్ నిర్మాత అవుతాడు అనుకున్న.. కానీ హీరో అయ్యాడు. ఇప్పుడు మా అన్నయ్య అల్లు బాబి అధికారికంగా నిర్మాతగా మారి మొదటి సినిమా చేశాడు. అది నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇది బాబికి మొదటి సినిమా అయి ఉండొచ్చు కానీ నా ప్రతి సినిమా విషయంలో బాబి జడ్జిమెంట్ ఉంటుంది. 20 ఏళ్ళ అనుభవం మా అన్నయ్యకు ఉంది. తను ఒక కథ ఎంపిక చేసుకొని సినిమా చేసాడు అంటే ఖచ్చితంగా అది హిట్. సిద్దు ముద్దకు మా కజిన్ సిస్టర్ ని ఇచ్చాము. ఎక్కడో యూఎస్ లో జాబ్ చేసుకుంటూ ఎన్నో కష్టాలు పడి.. ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజు ఒక నిర్మాతగా నిలబడ్డాడు. అలాగే నా బ్రదర్ వరుణ్ తేజ్ గురించి చెప్పాలి. వరుణ్ అంటే నాకు చాలా ఇష్టం. కేవలం కుటుంబ సభ్యుడిగానే కాకుండా నటుడిగా వరుణ్ ఎంచుకునే కథలు చాలా ఇష్టం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి కథలో ఒక నావెల్టీ ఉంటుంది. ఇలాంటి కథలు ఎంపిక చేసుకోవడం అందరు హీరోలకు సాధ్యం కాదు. గని సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. అన్ని రోజులు సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయాలి అంటే చిన్న విషయం కాదు. ప్రతి సినిమా కోసం కష్టపడతాడు కానీ గని కోసం ప్రాణం పెట్టాడు. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను..అని బన్నీ అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
