Tollywood: ట్రైన్‌లో అడ్డా కూలీలు పెట్టిన అన్నంతో కడుపు నింపుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్
ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ తన టాలీవుడ్ ప్రయాణంలో ఎదుర్కొన్న కఠిన సవాళ్లను పంచుకున్నారు. తిండి లేని రోజులు, రూమ్ అద్దె కట్టలేని పరిస్థితులు, కూలీగా పనిచేయడం వంటి సంఘటనలు తన జీవితంలో భాగమని తెలిపారు. అవకాశాల కోసం ఎన్నో అవమానాలను, ఆకలి బాధలను అనుభవించినప్పటికీ, ఆయన పట్టుదలతో ముందుకు సాగారు.

ప్రముఖ టాలీవుడ్ నటుడు అజయ్ ఘోష్ తన కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎదుర్కొన్న ఎన్నో కష్టాలను ఒక ఇంటర్వ్యూలో వివరించారు. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలని వచ్చే ఎంతోమంది దర్శకులు, టెక్నీషియన్లు, నటులు పడే వేదనను ఆయన కళ్లకు కట్టారు. గ్రామాల నుంచి వచ్చి, చదువులు మానేసి, తినడానికి తిండి లేక, రూమ్ అద్దెలు కట్టలేక, అవకాశాలు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అవకాశాలు లేనప్పుడు కొందరు స్నేహితుల రూమ్‌లలో భోజనం చేయడం, మరికొందరు పాత్రలు కడిగి, గదులు శుభ్రం చేసి అన్నం తినడం వంటి సంఘటనలు సర్వసాధారణమని ఆయన పేర్కొన్నారు. యూసుఫ్ గూడలోని సవేరా ఫంక్షన్ హాల్ వద్ద పెళ్లి భోజనాల సమయంలో వెళ్లి ఆకలి తీర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. తన సొంత అనుభవాలను పంచుకుంటూ, కంటతడి పెట్టించిన ఒక సంఘటనను వివరించారు.
కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ వెళ్లడానికి తన భార్య వంద రూపాయలు ఇవ్వగా, 98 రూపాయల టికెట్టు కొని, కేవలం రెండు రూపాయలతో ప్రయాణించానని చెప్పారు. ఆ రైలు మార్గమధ్యంలో చిట్ట్యాల వద్ద జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఇంజిన్ నిలిచిపోవడంతో తీవ్ర ఆకలికి గురయ్యానని తెలిపారు. అప్పుడు బేల్దారి కూలి పనికి హైదరాబాద్ వెళ్తున్న ఒక పెద్దాయన తన ఆకలిని గమనించి, ఒక ముద్ద గోంగూర అన్నం పెట్టినట్లు పేర్కొన్నారు. ఆ అన్నం తిని, నీళ్లు తాగి, రాత్రి 9:30 గంటలకు గమ్యస్థానం చేరి, అక్కడి నుంచి మధురానగర్ స్టూడియోకు నడుచుకుంటూ వెళ్లినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. సీరియల్స్ చేసిన తర్వాత కూడా పని లేక యూసుఫ్ గూడ చెక్‌పోస్టు బస్తీ నుంచి మాధాపూర్‌కు పెయింట్ కూలీగా వెళ్లిన రోజులు ఉన్నాయని అజయ్ ఘోష్ వివరించారు. చిన్నప్పటి నుంచి తన జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నానని, ఇవన్నీ తనకు అలవాటుపడిపోయాయని తెలిపారు. ప్రస్తుతం తినడానికి తిండి ఉన్నా, కష్టపడటం తనకు అలవాటని ఆయన అన్నారు.
పేద కుటుంబం నుండి వచ్చిన అజయ్ ఘోష్‌కు నటనపై ఆకాంక్ష ఉండేది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన మొదట ఒంగోలులో కిళ్లీ కొట్టు నడిపారు. ఆ తర్వాత చీరాల సిటీ కేబుల్‌లో న్యూస్ రీడర్‌గా ప్రవేశించి, ఆపై సెంట్రల్ సిటీ కేబుల్‌లో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు వచ్చి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. మధురానగర్‌లోని చందన స్టూడియో ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ ప్రజానాట్యమండలి సభ్యులతో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పట్లో అపెండిసైటిస్ బారిన పడినప్పుడు స్నేహితులే ఆదుకుని ప్రాణాలు నిలిపారని, ఆర్థికంగా కూడా వారే సహాయం చేశారని అజయ్ ఘోష్ గుర్తుచేసుకున్నారు. ఆయన తండ్రి నిబద్ధత కలిగిన కమ్యూనిస్ట్ నాయకుడని, తన జీవితంలో తన భార్య సాంబలక్ష్మి మద్దతు కూడా ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు.

Ajay Gosh
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
