Uttej: “మావాడు .. మనవాడు.. మన అందరివాడు”.. అంటూ గరికపాటికి చురకలంటించిన ఉత్తేజ్
ఇక ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా గరిగపతి పై సీరియస్ అవుతున్నారు. తాజాగా మెగాస్టార్ వీరాభిమాని అయిన నటుడు ఉత్తేజ్ ఈ వ్యవహారం పై స్పందించారు.
మెగాస్టార్ చిరంజీవి పై గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. చిరు పై గరికపాటి సీరియస్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. ఇక ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా గరిగపతి పై సీరియస్ అవుతున్నారు. తాజాగా మెగాస్టార్ వీరాభిమాని అయిన నటుడు ఉత్తేజ్ ఈ వ్యవహారం పై స్పందించారు. గరికపాటి గురించి సోషల్ మీడియా వేదికగా భారీగానే రాసుకొచ్చారు ఉత్తేజ్. “అరె అరె అరే!! చాలా బాధేసింది గరికపాటి గారూ.. చిరంజీవి అన్నయ్య గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. మీరు చెప్పే ప్రవచనాలు రోజూ వింటూ ఉంటాము. మా ఇంట్లో 24 గంటలు రేడియో మోగుతూనే ఉంటుంది. ఇవుడిపుడే, మా జనరేషన్కి మీమీద ఓ అభిప్రాయం, ఏర్పడి, ఓ గౌరవం తొంగిచూస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలో, శిఖరాగ్రప్రయాణంలో..ఇసుక వల్ల జారి పడ్డట్టుగా, చిన్న చిన్న రాగ ద్వేషాలని, ఈర్ష్యా, అసూయలని జయించలేక..2 నిముషాల సంయమనం లేకపోవడం వల్లో,…ఏదైతేనేం జారిపడ్డారు..
“చిరంజీవి గారు దయచేసి ఫోటో సెషన్ ఆపండి లేదంటే వెళ్లిపోతాను, సెలవిప్పించండి. “అంటూ… అయ్యో !! గరికపాటి గారూ.., అన్నయ్య ఫోటోలకి ఎగబడతారా…?? అన్నయ్యతో మేము ఫోటోలకు ఎగబడతామా? ఫోటో సెషన్ తను పెట్టారా.?? కదా…మీకు తెలియందా ఇది.!!!!???? వాళ్ళు అందరూ.. కాదు మేమందరం చిరంజీవి అనే నాలుగు అక్షరాలతో ఫోటో తీయించుకోమ్… 4 దశాబ్దాల చరిత్రతో, శ్రమతో, వినయంతో, ప్రొఫెషనలిజంతో ఎదిగిన హీరోతో, క్రమశిక్షణతో, స్పందించే హృదయం తో, సేవాగుణంతో, మనిషితనంతో, మానవత్వం తో… రక్త, నేత్ర దానాలతో, ఆక్సిజన్ సిలిండర్లతో, చారిటీలతో…. సేవాగుణం ఉద్యమ దీప్తిలా వెలుగుతున్న… నిర్విలంకారుడితో.. ఓ “మనిషి”తో వెరసి ..మా చిరంజీవి తో ఫోటో దిగుతున్నాం..
ప్రతిఫలాపేక్ష కోరని ప్రకృతి గుణాన్ని ఆపాదమస్తకం ఒంటబట్టించుకున్న మాహావృక్షాన్ని, చెట్టంత మనిషిని, అక్షరానికి దాసోహమయ్యే విద్యార్థిని, పెద్దలంటే అపరిమితమైన గౌరవం చూపే మనిషిని, ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా పరుగెత్తుకు వచ్చే దయార్థ హృదయుడిని, మీరు అలా ఎలా??
గరికపాటి గారూ… చ్చో చ్చో చ్చో చ్చో… పుస్తకమైనా,, పేపర్ అయిన కిందపడితే తీసి పైన పెడతారు, గొప్పగా ..ఎవరు రాసినా, ఎవరు బాగా యాక్ట్ చేసినా, మంచి పని ఎవరు చేసినా వెంటనే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడతారు… అమితాబ్ జీ, సల్మాన్ భాయ్ ఊరికే ఫ్రీగా యాక్ట్ చేయరు అన్నయ్యతో… అన్నయ్యకి వారిచ్చే గౌరవం. సుద్దాల అశోక్ తేజ (మామయ్య) హాస్పిటల్ లో ఉంటే వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు.
ఓ కవికి.. నేను అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తూ… మామయ్యకి మీరు వీడియో కాల్ చేయడం అంటే… మీరు చూసారు..మామయ్య దర్శించారు. అన్నాను.. అన్నయ్య.. వెంటనే నన్ను అంత పెద్దవాణ్ణి చేయకు అంటూ.. తీయగా వారించారు.. అదీ సంగతి!! విశ్వనాథ్ గారికి సన్మానమ్ జరుగుతుంటే కాళ్ల దగ్గర కూర్చుని మాట్లాడారు.. అదీ విషయం..!! ఒకసారి ఏ ఎన్ ఆర్, కమల్, రజినీకాంత్ , చిరంజీవి గార్లు అందరూ ఉన్న ముఖచిత్రం పై అందరి ఆటోగ్రాఫ్స్ తో మ్యాగజైన్ రిలీజ్ .. అన్నయ్య ఆటోగ్రాఫ్ చేయడానికి అందరూ బ్లాక్ డ్రెస్సెస్ తో ఉండటంవల్ల ఎక్కడ చేయాలో అనుకుంటుండగా ఒకరు…ఏఎన్ఆర్ గారి. వైట్ లాల్చీ మీద చేయండి కన్పిస్తుంది అన్నారు.. ఏఎన్ఆర్ గారి మీద సంతకం చేసేంత నేను ఎదగలేదు.. అంటూ కనపడకపోయిన పర్లేదు అంటూ.. కుదిరిన ప్లేస్ లో సైన్ చేశారు. అదీ ఆయన వినయం మరి!!
వచ్చింది ఎవరు ? ఏ స్థితిలో ఉన్నాడు?? ఏ సందర్భంలో ఉన్నాడు?? తన పాత్ర ఎంత ?? పక్క వాళ్ళ పాత్ర ఎంత ?? కారణా కారణాలేంటి ?? అంటూ ఆచి, తూచి అర్థం చేసుకోవాల్సిందేమో.. కదా…..??? మీ మాటల్లోనే చెప్పాలంటే “దేహాన్ని విడిస్తే, దేశాభిమానం పెరుగుతుంది అన్నట్టు. మనం ఇంకా ఈ ఐహిక దేహాల్ని విడవలేదేమో…?? అప్పుడే కదా గుండెగదుల లోతులు తెలిసేది..మ్మ్..!! మీరు అపుడెపుడో మాట్లాడుతూ… కళాశాల నిర్వహించడానికి డబ్బులు సరిపోక నరకం పడుతుంటే ” అమ్మవారు” ప్రసన్నమై, మీకో దారి చూపించినట్టు… మాకు కూడా, ఓ గొప్ప మనిషిగా, ఓ గొప్ప సంస్కారిగా, ప్రతిభావంతుడైన నటుడిగా, మెగాస్టార్ గా.. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి నిలువెత్తు, విలువెత్తు సాక్ష్యం గా ” అన్నయ్య” కూడా మా అభిమానుల గుండెల్లో ప్రతీ క్షణం ప్రసన్నమై మమ్మల్నో దారిలో పెడుతుంటారు.. గరికపాటీజీ.
ఇలా ఎన్నో.. ఎంతో…గంటలపాటు అన్నయ్య గురించి ప్రవచనం చెప్పగలను. ఇంకొన్ని వందల ఉదాహరణలున్నాయి… నా దగ్గర.. అలా కొన్ని వేలమంది తో లక్షల ఉదాహరణలున్నాయి. అన్నయ్య వినయం గురించి అన్నయ్య స్వహస్తాల అక్షరాల్లో చూడండి. 1999 లో రాసింది. జత చేస్తున్న.. చిరంజీవి అనే అక్షరాల్లో మధ్యన ఉన్న “సున్న” ఎప్పటికప్పుడు నాకు తెల్సింది శూన్యం అంటూ చెప్తుంది..అంటూ చిన్నవాడిగా, నిత్య విద్యార్థిగా రాసుకున్నారు. ఇప్పటికీ అలాగే ఉంటారు . అలా ఎన్నో, ఆడియో, వీడియోలు ఉన్నాయి అన్నయ్య లక్షణాలు గురించి. ఒంటరిగా ఉన్నప్పుడు, పదిమందిలో ఉన్నప్పుడు ఒకేలా మాట్లాడతారు. ఒకేలా ప్రవర్తిస్తారు.. చివరగా ఓ మాటండీ. నా, నీ అనే నాన్సిజం కాదు.. మా మనిషి కదా, మా కుటుంబం మనిషి కదా.. మా కుటుంబ పెద్ద కదా… మా దిక్కూ మొక్కూ కదా.. ఎవరన్నా ఏదైనా అంటే బాధగా వుంటుంది కదా.
మా అంటే మూవీ ఆర్టిస్ట్ అసౌసియేషన్ మాత్రమే అనుకుంటున్నారేమో… అబ్బే…అంతకన్న ఎక్కువగా విశ్వ వ్యాప్తమై పరుచుకున్నాడు.. మావాడు .. మనవాడు.. మన అందరివాడు. “మానవుడు” మా చిరంజీవుడు.. కుదిరితే చిరంజీవి పుస్తకం చదవండి కొనక్కర్లేదు.. అన్ని చోట్లా ఉంటుంది. అందరి దగ్గరా ఉంటుంది. పర్వాలుగా, సంపుటాలుగా, కాండాలుగా. ఒకే నా గురూజీ.. ఉంటాను మరి.. ( అన్నట్టు సరస్వతమ్మ అందరికీ ఇచ్చినట్టే మీకిచ్చిన.. మీరు చెప్పే మాటల్ని రేడియో లో వింటూనే ఉంటాను..) ఉత్తేజ్ అంటూ ఓ భారీ ప్రవచనాన్ని రాసుకొచ్చారు ఉత్తేజ్.