Ram Charan: నాన్న, బాబాయ్ తర్వాత నేను అంతగా గౌరవించే వ్యక్తి ఆయనే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆస్కార్ పొందడం అపురూపమైన విషయమని.. మన సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచిందన్న విషయాన్ని తానింకా నమ్మలేకపోతున్నానని అన్నారు చరణ్.
ఆస్కార్ వేడుకల అనంతరం.. నేరుగా ఢిల్లీకి చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అక్కడ ఇండియా టుడే నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. ఇందులో చరణ్ భారతీయ సినిమాకు ప్రతినిధిగా… తన భార్య ఉపాసనతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన సినీ కెరీర్ గురించి.. ఆస్కార్ అవార్డ్, ఆర్ఆర్ఆర్ చిత్రంతోపాటు అనేక విషయాలను ఆయన తెలియజేశారు. ఆస్కార్ పొందడం అపురూపమైన విషయమని.. మన సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచిందన్న విషయాన్ని తానింకా నమ్మలేకపోతున్నానని అన్నారు చరణ్. అలాగే తన భార్య ఉపాసన తనకు లక్కీ మస్కాట్ అని.. ఇంకా ఆమె కడుపులో ఉన్న ఐదు నెలల శిశువు ఇంకా లక్కీ అన్నారు. త్వరలోనే తండ్రిని కాబోతున్నాను. అన్నీ మంచి విషయాలు ఒకసారే జరుగుతున్నాయని అన్నారు.
చరణ్ మాట్లాడుతూ.. “ఆస్కార్ ఈవెంట్ జరిగిన ప్రదేశంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. నా చిన్నతనం నుంచి నేను ఆస్కార్‌కి పెద్ద ఫ్యాన్‌ని. మనం ఆస్కార్‌కి రీచ్ అయ్యాం. గెలుస్తామా? లేదా? అనేది నా దృష్టిలో పెద్ద విషయం కానే కాదు. ఆ వేదిక దాకా వెళ్లడమే నా దృష్టిలో పెద్ద గౌరవం. అది అరుదైన గుర్తింపు. మన సినిమాకు అక్కడ ప్రతినిధులుగా నిలుచోవడం ఆనందంగా అనిపించింది.
ఆస్కార్ వేడుక జరగడానికి ముందు మాలో ఎలాంటి భావోద్వేగాలు లేవు. కంగారుతో స్తబ్దుగా అనిపించింది. నా భార్య నా చేతిని గట్టిగా పట్టుకోవడం గుర్తుంది. మైక్ టైసన్ గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. రాజమౌళితో నేను చేసిన తొలి సినిమా మగధీర బ్లాక్ బస్టర్ అయింది. టాస్క్ మాస్టర్లతో పనిచేయడం నాకు చాలా ఇష్టం. నా కాళ్ల మీద నేను నిలుచోవడం ఇష్టం. రాజమౌళిగారితో పనిచేయడం అంటే పాఠశాలకు వెళ్లినట్టే భావిస్తాను. మా నాన్న చిరంజీవి, మా బాబాయ్ పవన్ కల్యాణ్ తర్వాత నేను అంతగా గౌరవించే వ్యక్తి రాజమౌళి” అని అన్నారు చరణ్.