Pawan Kalyan: సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్..
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీహరి పలు ప్రముఖ పత్రికలలో పని చేశారు.
ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి మాతృమూర్తి కన్నుమూసిన ఘటన అందరినీ కలచివేసింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీహరి పలు ప్రముఖ పత్రికలలో పని చేశారు. సుమారు 55 ఏళ్ల పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనే పుస్తకాన్ని రచించారు.
గుడిపూడి శ్రీహారి మృతిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాత్రికేయ రంగంలో ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో గుడిపూడి శ్రీహరిది విశేష అనుభవం. ఆయన సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి. తెలుగు చిత్రసీన ప్రస్థానంలోని అనేక ముఖ్య ఘట్టాలను శ్రీహరి అక్షరబద్ధం చేశారు. హరివిల్లు శీర్షికతో చేసిన రచనలు నిశిత పరిశీలనను తెలిపేవి అంటూ పవన్ పేర్కోన్నారు.
శ్రీ గుడిపూడి శ్రీహరి గారి ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/mKZyvQyeN4
— JanaSena Party (@JanaSenaParty) July 5, 2022
1969 నుండి ది హిందూ పత్రికలో రివ్యూలు వ్రాయడం ప్రారంభించారు. అప్పటి నుండి అనేక తెలుగు సినిమాలకు రివ్యూలు వ్రాసేవారు. ప్రతి తెలుగు సినిమా వచ్చిందటే దానిని చూడడం, రివ్యూ రాయటం ఆయన చేసిన కృషికి నిదర్శనం. శ్రీహరి భార్య లక్ష్మి గత ఏడాది నవంబర్ లో మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.విదేశాల్లో ఉన్న కుమారుడు శ్రీరామ్ స్వదేశానికి చేరుకోగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. గుడిపూడి శ్రీహరి మరణ వార్త తెలిసి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.