Ambajipeta Marriage Band Review: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుహాస్.. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.

మూవీ రివ్యూ: అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్
నటీనటులు: సుహాస్, శరణ్య ప్రదీఫ్, శివానీ నాగారం, నితిన్ ప్రసన్న, జగదీష్ బండారి తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రాఫర్: వాజిద్ బైగ్
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దుశ్యంత్ కటికనేని
నిర్మాత: ధీరజ్ మొగిలినేని
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సుహాస్.. తాజాగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ:
అంబాజీపేటలో మల్లి (సుహాస్) అతడి గ్యాంగ్ బ్యాండ్ వాయిస్తూ కులవృత్తి అయిన కటింగ్, షేవింగ్ చేస్తుంటారు. మల్లికి అక్క పద్మ(శరణ్య ప్రదీప్) ఉంటుంది. ఆమెకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. పైగా చదువుకున్న అమ్మాయి. ఆ ఊరిలోనే టీచరుగా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. మరోవైపు అదే ఊళ్లో అనేక వ్యాపారాలతో పాటు వడ్డీ వ్యాపారం చేసే వెంకట్ బాబు (నితిన్ ప్రసన్న).. పద్మకు ఉద్యోగం పెర్మనెంట్ చేయించడంతో ఆ ఇద్దరి మీద ఊళ్లో పుకార్లు పుట్టిస్తారు. ఇద్దరికీ అక్రమ సంబంధం ఉంది అంటారు. అదే సమయంలో వెంకట్ తమ్ముడు తో ఇటు మల్లి, అటు అతని అక్క పద్మ ఇద్దరు వేర్వేరు విషయాల్లో గొడవపడతారు. మరోవైపు చిన్నప్పటి నుంచి వెంకట్ చెల్లెలు లక్ష్మి(శివాని)తో ప్రేమలో ఉంటాడు మల్లి. ఈ విషయం తెలియడంతో అటు పద్మకి, ఇటు మల్లికి కలిసి ఎలాగైనా బుద్ధి చెప్పాలని వెంకట్ భావిస్తూ ఉంటాడు. ఓ రాత్రి సమయంలో పద్మను ఒంటరిగా స్కూల్ కి పిలిపించి దారుణంగా అవమానిస్తాడు. అక్కకు జరిగిన అవమానం తట్టుకోలేక వెంకట్ పైకి వెళ్ళిన మల్లికి గుండు కొట్టిస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఆత్మవిమానం కాపాడుకోవడానికి అక్క తమ్ముళ్లు ఏం చేశారు అనేది మిగిలిన కథ.
కథనం:
కులం, ఆత్మగౌరవం, ఆత్మాభిమానం..ఈ పదాలు వినడానికి తేలిక కానీ మోయలేనంత బరువు. ఇదే నేపథ్యంలో సినిమా అంటే కత్తి మీద సామే దర్శకుడికి. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ విషయంలో. దాన్ని ఛాలెంజింగ్ గా తీసాడు దర్శకుడు దుష్యంత్ కటికనేని. ఇదేం తెలియని కథ కాదు.. మనం ఊర్లలో రెగ్యులర్ గా చూసే కథే. అగ్రకులాలు, తక్కువ జాతి అంటూ నిత్యం చూస్తున్న ఘటనలనే సినిమాగా తీసాడు దుశ్యంత్. చిన్న కథలోనే ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా బాగా రాసుకున్నాడు. అంతకంటే బలమైన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి సినిమాలో. ఫస్టాఫ్ అంతా లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్ తో సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి కథ ఇంకో మలుపు తీసుకుంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్స్ పైనే ఫోకస్ చేసాడు దర్శకుడు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ అదిరిపోయింది.. ఎక్కడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా సహజంగా తీసాడు దుష్యంత్. ఈ రియలిస్టిక్ అప్రోచ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కు ప్లస్. అక్కడక్కడా మైనస్ లు ఉన్నా.. సాలిడ్ స్క్రీన్ ప్లే వాటిని కనబడనివ్వలేదు. ముఖ్యంగా అక్క తమ్ముళ్ల మధ్య బాండింగ్ సన్నివేశాలు బాగున్నాయి. అలాగే హీరో హీరోయిన్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది.
నటీనటులు:
సుహాస్ మరోసారి అదరగొట్టాడు.. క్యారెక్టర్ కి ప్రాణం పోసాడు. హీరోయిన్ శివాని ఉన్నంతలో బాగా చేసింది. కానీ ఈ సినిమాకు మెయిన్ హీరో శరణ్య. ఆమెలో ఇంత గొప్ప నటి ఉందని తెలియదు. సినిమా చూసాక శరణ్య యాక్టింగ్ గుర్తుండిపోతుంది. పుష్ప ఫేమ్ జగదీష్ బండారికి మంచి రోల్ పడింది. విలన్ గా నితిన్ ప్రసన్న కూడా బాగా చేసాడు. మిగిలిన పాత్రలని తమ పరిధిలో నటించారు.
టెక్నికల్ టీమ్:
శేఖర్ చంద్ర సంగీతం ఈ సినిమాకు ప్రాణం. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ వాజిత్ వర్క్ బాగుంది. పల్లెటూరి అందాలను చాలా బాగా చూపించాడు. ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. దర్శకుడు దుష్యంత్ కటికనేని తీసుకున్న లైన్ బాగుంది దాన్ని ఎక్కడ డివియేట్ కాకుండా చక్కగా స్క్రీన్ మీద తీసుకొచ్చాడు. కమర్షియాలిటీ అంటూ లేనిపోని హంగుల కోసం తాపత్రయపడకుండా అనుకున్నది అనుకున్నట్టు చూపించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు.
పంచ్ లైన్:
ఓవరాల్ గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్.. హార్డ్ హిట్టింగ్ స్టోరీ.. సౌండ్ బాగానే వస్తుంది..




