AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madrasi Movie Review: మదరాసి మూవీ రివ్యూ.. శివకార్తికేయన్ సినిమా ఎలా ఉందంటే

శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ జంటగా మురుగదాస్ తెరకెక్కించిన సినిమా మదరాసి. తుపాకి, గజిని, కత్తి లాంటి సినిమాలతో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన మురుగదాస్.. చాలా ఏళ్లుగా హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నుంచి వచ్చిన సినిమా మదరాసి. మరి ఈ సినిమా ఎలా ఉంది..?

Madrasi Movie Review: మదరాసి మూవీ రివ్యూ.. శివకార్తికేయన్ సినిమా ఎలా ఉందంటే
Madharasi Movie Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Rajeev Rayala|

Updated on: Sep 05, 2025 | 7:11 PM

Share

మూవీ రివ్యూ: మదరాసి

నటీనటులు: శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్, షబీర్, బిజూ మీనన్ తదితరులు

సంగీతం: అనిరుద్ రవిచందర్

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రాఫర్: సుదీప్ ఎలమన్

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

దర్శకుడు: ఎ ఆర్ మురుగదాస్

నిర్మాత: శ్రీ లక్ష్మీ మూవీస్

కథ:

చిన్నతనంలో కళ్ల ముందే తన కుటుంబం మొత్తాన్ని ఒక ప్రమాదంలో చనిపోవడం చూస్తాడు రఘు (శివకార్తికేయన్). దాంతో షాక్‌లోకి వెళ్లిపోతాడు. దాంతో 14 ఏళ్ల వయసు నుంచే ఆయనకు డిల్యూషన్ సిండ్రోమ్ అనే వ్యాధి సోకుతుంది.. 16 ఏళ్ల పాటు మెంటల్ హాస్పిటల్‌లో ఉండి చికిత్స తీసుకుంటాడు. అప్పట్నుంచి ఎవరైనా సాయం కోసం చూస్తుంటే వాళ్లలో చనిపోయిన తన కుటుంబంలోని ఎవరో ఒకర్ని ఊహించుకుంటాడు.. వాళ్లను కాపాడుతుంటాడు. అదే సమయంలో రఘు జీవితంలోకి వస్తుంది మాలతి (రుక్మిణి వసంత్). అతడి సమస్య తెలిసి కూడా ప్రేమిస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల వదిలేసి వెళ్లిపోతుంది. దాంతో చనిపోవాలని నిర్ణయించుకుని సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు రఘు. అదే సమయంలో రఘు జీవితంలోకి వస్తాడు NIA అధికారి ప్రేమ్ కుమార్ (బిజూ మీనన్). తమిళనాడులోకి గన్స్ కంటైనర్స్ రాకుండా అడ్డుకోవాలని చూస్తుంటారు వాళ్లు. కానీ వాటిని ఓ సేఫ్ ప్లేస్‌లో దాచేస్తాడు విలన్ విరాట్ (విద్యుత్ జమాల్). తన స్నేహితుడు చిరాగ్‌తో కలిసి గన్ బిజినెస్ చేస్తుంటాడు. గన్ కల్చర్ తమిళనాడుకు రాకుండా ఆపాలని NIA ప్రయత్నిస్తున్న సమయంలో.. వాళ్ల వళయంలోకి రఘు వస్తాడు. అక్కడ్నుంచి ఏం జరిగింది అనేది కథ..

కథనం:

మురుగదాస్ సినిమా అంటే ఒక రమణ.. ఒక గజిని.. ఒక కత్తి.. ఒక తుపాకి..! ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ అద్భుతాలే. పొట్టోడు గట్టోడు అనే మాట మురుగదాస్‌ను చూసే పెట్టారేమో అనిపించేది. చెప్పేది పాత కథే అయినా కూడా ఎమోషన్ అద్భుతంగా ఉండేది కానీ ఇప్పుడలా కాదు. ఆ మురుగదాస్ బూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. అప్పుడు మనం చూసిన మురుగదాస్ సినిమాల్లో స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది.. కానీ ఇక్కడ చూస్తుంటే గన్స్.. వాటితో పాటు మనుషులు పరుగులు పెడుతున్నారు.. కనీసం కథ లేదు.. హీరో క్యారెక్టరైజేషన్‌లో క్లారిటీ లేదు. ఏదో ఓ డిసీజ్ పెడితే కథలో క్యూరియాసిటీ పెరుగుతుందనే ఆశతో.. శివకార్తికేయన్‌కు లోపం పెట్టినట్లు అనిపించింది.. గజినీలో హీరో లోపం కూడా ఆసక్తికరంగా ఉంటుంది.. కానీ ఇక్కడలా కాదు. ఎంతసేపూ కాల్చుకోవడం, చంపుకోవడం తప్ప మదరాసిలో ఇంకేం కనిపించలేదు. గన్ కంటైనర్స్ చెన్నైలోకి వస్తాయి.. అవి జనాల్లోకి వెళ్లకుండా ఆపాలి.. ఇదే కథ. లైన్ చిన్నది కావడంతో.. సాగతీత పెద్దదైంది.. అక్కడక్కడే తిరుగుతుంది. విలన్‌ను చంపే వీలున్నా చంపరు.. కథ ముగించే ఛాన్స్ ఉన్నా అవ్వదు. బబూల్‌గమ్ సాగదీసినట్లు లాగడంలో ఆ సంతోషమేంటో అర్థం కాలేదు.. నిర్మాతకు డబ్బు బడ్జెట్ లాస్ తప్ప. క్లైమాక్స్ అయితే మరీ దారుణం.. 5 నిమిషాల్లో అయిపోయే ఫైట్‌ను కాస్తా 25 నిమిషాలు తీసాడు. బాహుబలిలో ప్రభాస్, రానాలా కొట్టుకుంటూనే ఉంటారు హీరో విలన్. ఎందుకంత వయోలెన్స్ అనేది అర్థం కాదు. ఒకప్పుడు కూడా మురుగదాస్ సినిమాల్లో వయోలెన్స్ ఉన్నా ఎమోషన్ కూడా ఉండేది. మదరాసిలో అది ఏ కోశానా కనిపించదు. విద్యుత్ జమాల్ సీన్స్ కూడా చాలా ఓవర్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా మదరాసి ఏ మాత్రం ఆకట్టుకోకపోగా చిరాకు తెప్పిస్తుంది.

నటీనటులు:

శివకార్తికేయన్ తన వరకు బాగానే చేసినా.. ఇలాంటి పాత్రలు ఆయనకు పెద్దగా సూట్ అవ్వవు. రుక్మిణి వసంత్ పర్లేదు. ఎన్ఐఏ ఆఫీసర్‌గా బిజూ మీనన్ బాగా చేసాడు. ఆయన పాత్ర సినిమాకు కీలకం. విక్రాంత్ కూడా బాగానే నటించాడు. విద్యుత్ జమాల్ మరోసారి తుపాకి సినిమాను గుర్తు చేసాడు. సేమ్ పాత్ర రిపీట్ అయింది అంతే. మిగిలిన వాళ్ళంతా ఓకే..

టెక్నికల్ టీం:

అనిరుధ్ సంగీతం అస్సలు ఆకట్టుకోలేదు. ప్రతీ సినిమాకు హెల్ప్ అయ్యే ఆయన మ్యూజిక్ ఈసారి మాత్రం పూర్తిగా ముంచేసింది. ఒక్క పాట కూడా వినాలనిపించేలా లేదు. ఆర్ఆర్ కూడా అంతంతమాత్రమే. ఎడిటర్ అయితే మరీ దారుణం. కత్తెరకు పని చెప్పడమే మరిచిపోయాడు. శ్రీకర్ ప్రసాద్ లాంటి సీనియర్ ఎడిటర్ ఉన్నా మురుగదాస్ ఇలాంటి ల్యాగ్ సీన్స్ ఎలా పెట్టాడో అర్థం కాలేదు. సినిమాటోగ్రఫీ పర్లేదు. మురుగదాస్ తన మార్క్ మరోసారి పూర్తిగా మిస్ అయ్యాడు. నిర్మాతకు కథకు మించిన ఖర్చు పెట్టించారు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా మదరాసి.. కథ శూన్యం.. గన్స్ మోత తప్ప ఇంకేం లేదు..!