Sridevi Soda Center Review: సూరిబాబు లైటింగ్‌.. సోడాల శ్రీదేవి అల్లరి.. కాశీ పెంచుకున్న పగ.. శ్రీదేవి సోడా సెంటర్‌ ఇంతకీ ఎలా ఉందంటే?

తెలుగు ఆడియన్స్ నీ, సినిమాలనూ సెపరేట్‌ చేసి చూడలేం అనే మాట చాలా సార్లు వింటుంటాం కదా.. ఇదిగో ఇప్పుడు సీన్‌ చూస్తే అలాగే కనిపిస్తోంది.

Sridevi Soda Center Review: సూరిబాబు లైటింగ్‌.. సోడాల శ్రీదేవి అల్లరి.. కాశీ పెంచుకున్న పగ.. శ్రీదేవి సోడా సెంటర్‌ ఇంతకీ ఎలా ఉందంటే?
Sridevi Soda Center
Follow us

|

Updated on: Aug 27, 2021 | 5:16 PM

సినిమా: శ్రీదేవి సోడా సెంటర్‌ నటీనటులు: సుధీర్‌బాబు, ఆనంది, నరేష్‌, రఘుబాబు, పావల్‌, సత్యం రాజేష్‌ తదితరులు దర్శకత్వం: కరుణకుమార్‌ నిర్మాతలు: విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంగీతం: మణిశర్మ సెన్సార్‌: యు/ఎ విడుదల: 27.08.2021

శ్రీదేవి సోడా సెంటర్‌ తెలుగు ఆడియన్స్ నీ, సినిమాలనూ సెపరేట్‌ చేసి చూడలేం అనే మాట చాలా సార్లు వింటుంటాం కదా.. ఇదిగో ఇప్పుడు సీన్‌ చూస్తే అలాగే కనిపిస్తోంది. నార్మల్‌ లైఫ్‌కి జనాలు అలవాటుపడుతున్నారు. తమ జాగ్రత్తలో తాముంటూ కరోనాతో కలిసి జీవించడాన్ని ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ మాటకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌ థియేటర్లు జనాలతో కళకళలాడటం. ఈ వీక్‌ క్రౌడ్‌ పుల్లర్‌ మూవీ శ్రీదేవి సోడా సెంటర్‌. మందులోడా అంటూ మణిశర్మ కొట్టిన బీట్స్, చియర్‌ ఆప్‌ డార్లింగ్స్ అంటూ యూనిట్‌తో ప్రభాస్‌ స్పెషల్‌ చిట్‌చాట్‌…. సినిమాకు ఎంత వరకు హెల్ప్ అయ్యాయి… రండి చూద్దాం..!

సూరిబాబు ఊళ్లో లైటింగ్‌ అరేంజ్‌ చేస్తుంటాడు. కరెంట్‌కి సంబంధించి ఆ జిల్లా మొత్తానికి ఏం కావాలన్నా అతనే. తల్లి ఉండదు. తండ్రి పెంపకంలో పెరుగుతాడు. ఏదోలా టౌన్‌లో చిన్న షాప్‌ ఓపెన్‌ చేసి సెటిల్‌ అయిపోవాలనే ఎయిమ్‌తో ఉంటాడు. అతనికి చిన్నప్పటి నుంచీ దుర్గ అనే ఫ్రెండ్‌ ఉంటాడు. అతను అడిగాడని వాలకట్ల పోటీలకు వెళ్తాడు సూరిబాబు. ఆ పోటీల్లో శివని ఓడిస్తారు. శివ వెనుక ఉన్న కాశికి సూరిబాబు గ్యాంగ్‌ గెలవడం నచ్చదు. ఆ ఏడాది చేపలు పట్టే కాంట్రాక్ట్ ని శివకి ఎంతో కొంతకు మొత్తంగా ఇచ్చేయమంటాడు. ఆ డీల్‌కి సూరిబాబు తండ్రి ఒప్పుకోడు. పైగా దున్నేవాడిదే భూమి అని గట్టిగా చెబుతాడు. తన మాటను సూరిబాబు లెక్కచేయలేదని కసి పెంచుకుంటాడు కాశీ. అలా జరుగుతుండగా వీరభద్రస్వామి తీర్థం వస్తుంది ఆ ఊళ్లో. ఘనంగా చేయాలనుకుంటారు. ఆ తీర్థంలోనే పక్కూరి నుంచి వచ్చి సోడాల షాపు పెట్టుకుంటాడు శ్రీదేవి సోడా సెంటర్‌ ఓనర్‌. ఆయనకు ఒక్కతే కూతురు శ్రీదేవి. పిల్ల మాట తీరు కరకుగా ఉన్నా, మనసు వెన్న. చదువుకుంటూ ఉంటుంది. తల్లిదండ్రుల చాటుబిడ్డగా పెరిగిన పద్ధతులు తెలిసిన అమ్మాయి. సేమ్‌ టైమ్‌ సొసైటీలో వస్తున్న చేంజెస్‌కి సంబంధించి అవేర్‌నెస్‌ ఉన్న పిల్ల. చూసీ చూడగానే శ్రీదేవిని ఇష్టపడతాడు సూరిబాబు. అలా వాళ్ల మధ్య ప్రేమ ట్రాక్‌లో పడుతున్నప్పుడే ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు సూరిబాబు. ఆ తర్వాత ఏమైంది? ఆ మర్డర్‌ కేసుకు కాశీకి సంబంధం ఏంటి? శ్రీదేవి ఏమైంది? సూరి బాబు మంచి వాడని తెలిసినా శ్రీదేవి తండ్రి ఎందుకు పిల్లనివ్వలేదు. మంచితనం కన్నా మనతనం ముఖ్యమైందా? కాశీ మనసులో ఉన్న కుటిలత్వం బయటపడిందా?… ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మొదటి నుంచీ మంచి బజ్‌ క్రియేట్‌ చేసిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్‌. పలాస సినిమాలో ఉత్తరాంధ్ర కళాకారుల కుటుంబంలోని జీవితాల్ని కళ్లకు కట్టినట్టు చూపించిన కరుణకుమార్‌ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకు తగ్గ సీన్లు కూడా పర్ఫెక్ట్ గా రాసుకున్నారు. హీరోకి సిక్స్ ప్యాక్‌ బాడీ ఉంది కదా అని.. ఎక్కడో ఓ చోట చూపించేయాలన్నట్టు చూపించలేదు. దానికి కూడా పర్ఫెక్ట్ గా పడవల పోటీలను ప్లాన్‌ చేసుకున్నారు. అలాగే జైలు సీనులోనూ, ఆ తర్వాత బెయిలు మీద బయటికొచ్చినప్పుడు ప్రీ క్లైమాక్స్ ఫైట్‌లోనూ సుధీర్‌బాబు ఫిజిక్‌ని పర్ఫెక్ట్ గా పోట్రే చేశారు. కన్నవారి చాటున అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయిగా ఆనంది కేరక్టర్‌ బావుంది. కాస్ట్యూమ్స్, హెయిర్‌స్టైల్‌ మాత్రమే కాదు, తను కావాలనుకున్న వ్యక్తిని ఎందుకు కావాలనుకుంటుందో స్పష్టత ఉన్న అమ్మాయిగా శ్రీదేవి కేరక్టర్‌ని చక్కగా డిజైన్‌ చేశారు కరుణకుమార్‌. చాన్నాళ్ల తర్వాత సత్యం రాజేష్‌కి, రఘుబాబుకి మంచి కేరక్టర్లు పడ్డాయి. శ్రీదేవి సోడా సెంటర్‌ ఓనర్‌ కేరక్టర్‌లో నరేష్‌ ఇంకోసారి బెస్ట్ పెర్ఫార్మర్‌ అనిపించుకున్నారు. కంగారొచ్చిన ప్రతిసారీ తనలో తాను గొణుక్కోవడం, ఒక రకంగా బనియన్‌ని కిందికి లాగుతూ కుడి భుజం కదుపుతూ ఉన్న మేనరిజం కూడా బావుంది. నరేష్‌ వైఫ్‌ కేరక్టర్‌ చేసిన లేడీ కూడా బెస్ట్ పెర్ఫార్మర్‌. కాశీ కేరక్టర్ లో తమిళ నటుడు పావల్‌ నవగీతన్‌ కొత్తగా కనిపించారు. మనసులో ఒకటి పెట్టుకుని, పైకి మంచి చేస్తున్నట్టు స్నేహం చేసే అలాంటి వ్యక్తులను మనం సొసైటీలోనూ చూడొచ్చు. మందులోడా ఓ మాయలోడా.., నాలోనే ఉన్నా, చుక్కల మేళం, నాలో ఇన్నాళ్లుగా పాటలు వినేకొద్దీ వినాలనిపించేలా ఉన్నాయి. మణిశర్మ ఆర్‌ ఆర్‌ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిందే. పడవల సీన్‌లోనూ, అక్కడక్కడా ఎమోషన్స్ పండించే సీన్స్ లోనూ మణిశర్మ మార్క్ కనిపించింది.

కులం గురించి ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంత మంది చెప్పినా ఇంకా ఎన్నెన్నో కథలు సొసైటీలో వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి కథల్లో శ్రీదేవి సోడా సెంటర్‌ కూడా ఒకటి. తల్లి లేకపోయినా కొడుకును ఒద్దికగా పెంచుకున్న తండ్రి… ఆ తండ్రి గౌరవానికి చిన్న మచ్చరాకుండా పని మీద ఫోకస్‌ పెట్టి, జీవితంలో మంచి లక్ష్యంతో బతికే కొడుకు. అలాగే మెట్టూ మెట్టూ ఎక్కుతూ సోడా బండి నుంచి షాప్‌ వరకు చేరుకున్న ఓ సోడా సెంటర్‌ ఓనర్‌. కన్న కూతురిని కరకుగా చిన్న మాట అనలేనంతగా గారాబం చేస్తుంటాడు. ఈ రెండు మధ్య తరగతి కుటుంబాలకూ సొసైటీలో మర్యాద ఉంటుంది. కానీ కులాలు వేరు. ఆ విషయాన్ని కూడా చాలా సెన్సిటివ్‌గానే చెప్పాడు డైరక్టర్‌. థియేటర్‌ ముందు సూరిబాబు బండి మీద కూర్చుని తండ్రి కంట పడుతుంది శ్రీదేవి. తండ్రిని చూడగానే గాబరాపడి బండి దిగి పారిపోదు. నింపాదిగానే ఇంటికి వస్తుంది. అతను మంచివాడు నాన్నా అని తండ్రికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. తండ్రి కూడా కూతురిని ఇష్టం వచ్చినట్టు కేకలు పెట్టడు. మంచివాడే… కానీ మనవాడు కాదు అని స్పష్టంగా కులం గురించి చెప్పేస్తాడు. సరిగ్గా ఆ టైమ్‌లోనే ఆ ఇంటికి మంచి చేయడానికి ఎంటర్‌ అవుతాడు కాశీ. అతనికి ఇచ్చి చేస్తే, కూతురు కులంలోనే ఉంటుందన్నది అతని ఫీలింగ్‌. ఆ మధ్య ఉప్పెనలో, ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌ కేరక్టర్లతో తండ్రుల ముందు చెప్పించే డైలాగులు మారుతున్న ట్రెండ్‌కి ఎగ్జాంపుల్స్. అన్నిటికన్నా ముఖ్యంగా క్లైమాక్స్ లో సుధీర్‌బాబు చెప్పే డైలాగులకు థియేటర్లో క్లాప్స్ పడుతున్నాయి. కథకు ఎంత ఖర్చు పెట్టాలో అంతా పెట్టి తీశారు నిర్మాతలు విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి. శామ్‌దత్‌ కెమెరా పనితనం కూడా బావుంది.

పల్లెటూళ్లలోనూ, మినీ టౌన్స్ లోనూ పుట్టి పెరిగి పడవపందేలు, తీర్థాలు, చిన్నా చితకా గొడవలు చూసిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా. చిన్నప్పుడు ఎప్పుడో విన్న కథలను గుర్తు చేసే సినిమా. పరువు హత్యలకు సంబంధించి మన దగ్గర ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చాయి. ఓటీటీలు వచ్చాక ఇలాంటి ఒరిజినల్‌ స్టోరీలకు కూడా మంచి అక్నాలడ్జ్ మెంట్‌ దొరుకుతోంది. ఆ తరహా కథల్లో మన మనసును కదిలించే మరో సినిమా శ్రీదేవి సోడా సెంటర్‌. లైటింగ్‌ కొట్టే సూరిబాబు కోసం, చూపులతోనే చుట్టూ తిప్పుకునే గడుసుపిల్ల శ్రీదేవి కోసం ఒకసారి తప్పక సినిమా చూసేయొచ్చు.

– డా. చల్లా భాగ్యలక్ష్మి

Also Read: Vijay Sethupathi: పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. సందీప్ కిషన్‏తో కలిసిన మక్కల్ సెల్వన్..

Shilpa Shetty: తప్పు చేశానంటూ శిల్పా శెట్టి ట్వీట్.. ఇంతకీ బాలీవుడ్ బ్యూటీ ఏం చెప్పాలనుకుంటోంది?