Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmanandam Birthday: సినిమా తెర నుంచి డిజిటల్ పేజీల వరకూ బ్రహ్మాండమంత ఆనందం!

వ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వు లేకపోవడం ఓ రోగం.. నవ్వు గురించి చెప్పుకోవాలంటే ఈ పదాలు చాలు. కానీ.. వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించే ఓ వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే పదాలు సరిగ్గా దొరకవు. నవ్వించడం ఒక యోగం అని చెప్పుకున్నట్టే నలుగుర్నీ నవ్వించగలిగే వాడు యోగి అనే చెప్పుకోవాలి కదా.

Brahmanandam Birthday: సినిమా తెర నుంచి డిజిటల్ పేజీల వరకూ బ్రహ్మాండమంత ఆనందం!
Brahmanandam Birthday
Follow us
KVD Varma

|

Updated on: Feb 01, 2022 | 4:15 PM

Brahmanandam Birthday:  నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వు లేకపోవడం ఓ రోగం.. నవ్వు గురించి చెప్పుకోవాలంటే ఈ పదాలు చాలు. కానీ.. వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించే ఓ వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే పదాలు సరిగ్గా దొరకవు. నవ్వించడం ఒక యోగం అని చెప్పుకున్నట్టే నలుగుర్నీ నవ్వించగలిగే వాడు యోగి అనే చెప్పుకోవాలి కదా. వెండి తెరమీద ఎందరో అటువంటి యోగులు ఉన్నారు. వేలాదిగా వచ్చిన సినిమాల్లో(Telugu Movies) వందలాదిమంది ప్రేక్షకుల మోము పై నవ్వుల పువ్వులు పూయించాలని చూశారు. చూస్తున్నారు. ఒక్కోరిదీ ఒక్కో బాణీ. కానీ.. సినిమాలో ఈ నటుడి మొహం కనబడితే చాలు ప్రేక్షకుల పెదాలు వాటంతట అవే విచ్చుకుంటాయి. సోషల్ మీడియాలో ఆయన బొమ్మ కనిపిస్తే చాలు నవ్వుతో ఉక్కిరిబిక్కిరి అయిపోయే యువతరం గురించి చెప్పక్కర్లేదు. ఆయన గురించి చెప్పాలంటే ఒక సినిమా నిడివో.. ఒక పెద్ద పుస్తకమో చాలదు. కానీ.. ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి ఆనాటి సినిమాల నుంచి ఈనాటి మీమ్స్ అని చెప్పుకునే సోషల్ మీడియా వ్యంగ్యోక్తుల వరకూ అన్నీ సాక్షులే. నవ్వించిన తారలెంతమంది ఉన్నా.. బ్రహ్మాండాన్ని మొత్తం నవ్వుల నావలో తిప్పగలిగే నటుడు ఒక్కడే.. ఆయనే బ్రహ్మానందం(Brahmanandam). ఆయన కళ్ళు కదిపి మనకు చిరునవ్వు తెప్పించగలడు. ముఖ భావంతోనే కడుపుబ్బిపోయేలా నవ్వించగలడు. ఈరోజు (ఫిబ్రవరి 1) బ్రహ్మానందం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం..

చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు సినీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి చేరుకున్న కొందరు తారలు సినీ ప్రపంచంలో ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఒకరు. బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని సతేనపల్లి జిల్లా ముపాళ్ల గ్రామంలో జన్మించారు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకే కుటుంబంలో ఎంఏ వరకు చదువుకున్న ఏకైక వ్యక్తి అతనే. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత, అతను అత్తిల్లి కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. కాలేజీలో తరచూ మిమిక్రీ చేస్తూ విద్యార్థులను నవ్వించేవాడు.

అలా మొదలైంది..

ఒకసారి ఇంటర్ కాలేజ్ డ్రామా పోటీలో బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ బహుమతి పొందారు బ్రహ్మానందం. ఆ తర్వాత నాటకం పట్లఆయన ఆసక్తి మరింత పెరిగింది. ఈ సమయంలో ప్రముఖ తెలుగు చిత్రాల దర్శకుడు జంధ్యాల, బ్రహ్మానందం తొలిసారిగా ‘మొద్దబ్బాయి’ అనే నాటకంలో నటించడం చూశాడు. జంధ్యాల తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆయన బ్రహ్మానందానికి ‘చంటబ్బాయ్’ చిత్రంలో ఒక చిన్న పాత్రను ఆఫర్ చేశాడు .. ఈ చిత్రం నుంచి బ్రహ్మానందం సినీ జీవితం ప్రారంభమైంది.దీని తర్వాత జంధ్యాల రెండో సినిమా ‘ఆహా నా పెళ్లంటా’లో బ్రహ్మానందం నటన జనాలకు బాగా నచ్చింది. ఈ సినిమా తర్వాత సినీ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్రహ్మానందం ఇప్పటివరకు 1000 చిత్రాలకు పైగా నటించారు. దీంతో పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది.

ఒక్కో సినిమాకు 1-2 కోట్లు..

జూలై 2015లో బ్రహ్మానందం తన ఫీజును కోటి రూపాయలకు పెంచుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రతి చిత్రానికి 1-2 కోట్లు వసూలు చేస్తారని చెప్పుకుంటారు. తనకున్న పాపులారిటీ, హిట్ సినిమాల కారణంగా ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడరు. ఏ కమెడియన్‌కైనా ఇంత ఫీజు రావడం పెద్ద విషయమే. బ్రహ్మానందం తన పెరుగురించి చెబుతూ ”ఒకసారి తన స్నేహితుడి కొడుకు తనకి బ్రహ్మానందం అని పేరు పెట్టింది ఎవరు అని అడిగాడు. బ్రహ్మానందం మాట్లాడుతూ, నా పేరు బ్రహ్మానందం అని ఎందుకు పెట్టాడో మా నాన్న కూడా ఎప్పుడూ చెప్పలేదు. అప్పుడు నేను నా పేరు అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాను .. తరువాత దాని అర్ధం విశ్వ ఆనందం అని తెలిసింది.” అని చెప్పుకున్నారు.

2009లో బ్రహ్మానందాన్ని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం. ఇక ఆరుసార్లు నంది అవార్డులు అందుకున్నారు. ఆయన వీటన్నిటినీ మించిన ప్రజల మనస్సులో నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకున్నారు. బ్రాహ్మీ మీమ్స్ పేరుతో ఇప్పడు డిజిటల్ యుగంలోనూ బ్రహ్మానందం సంచలనం సృష్టిస్తూనే ఉన్నారు. ఆయన సినిమాల్లో కనిపించినా.. కనిపించకపోయినా.. ప్రతి రోజూ వందలాది డిజిటల్ పేజీల్లో నవ్వుల పువ్వులు పూయిస్తూ వస్తున్నారు. సినిమా.. క్రికెట్.. రాజకీయం.. ఇలా రంగంతో పనిలేదు. ఎవరి పైనైనా విమర్శ.. వ్యంగ్యోక్తి పలికించాలంటే బ్రహ్మానందం ఇమేజీ ఇమేజ్ ఉండాల్సిందే. అదే బ్రహ్మాండమంత ఎదిగిపోయిన ఆనందానికి చిరునామాగా నిలిచిన బ్రహ్మానందం గొప్పతనం.

ఇవి కూడా చదవండి: Bangarraju: నాగ్, చైతూల మూవీ బ్రేక్ ఈవెన్ అందుకుందా..? 18 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్

Ghani: మెగా హీరో కోసం రెండు రిలీజ్ డేట్స్.. గని థియేటర్లోకి వచ్చేది అప్పుడే అంటున్న మేకర్స్..