Pooja Hegde: హీరోల విషయంలో మాత్రం ఎవరూ నోరు మెదపరు.. కరీనాకు మద్ధతుగా నిలిచిన బుట్టబొమ్మ. అసలేం జరిగిందంటే..
Pooja Hegde Kareena: సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లకు మధ్య అన్ని విషయాల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఇది ఎవరూ కాదనలేని నిజం. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో హీరోలతో పోలిస్తే...
Pooja Hegde Kareena: సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లకు మధ్య అన్ని విషయాల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఇది ఎవరూ కాదనలేని నిజం. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు తక్కువగా ఉంటుంది. సినిమాలో హీరోయిన్ల పాత్రకు ప్రాధాన్యత ఉన్నా వారికి ఇచ్చే రెమ్యునరేషన్ హీరోలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని చాలా మంది వాదిస్తుంటారు. ఇందులో కొంత మేర నిజం కూడా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కరీనా కపూర్ విషయంలో ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ త్వరలో రానున్న ఓ మైథలాజికల్ సినిమాలో సీత పాత్రలో నటించేందుకు రూ. 12 కోట్లు డిమాండ్ చేసింది. దీంతో ఆమెపై నెట్టింట ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అంతటితో ఆగకుండా కరీనాను సినిమా నుంచి తొలిగించాలంటూ ‘బాయ్‌కాట్ బెబో’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు కరీనాకు మద్ధతు నిలిచారు.
ఈ క్రమంలోనే తాజాగా అందాల తార పూజా హెగ్డే కూడా బెబోకు తన మద్ధతు పలికారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కరీనా తనకు ఎంత మార్కెట్ ఉంటే అంతే అడిగిందని చెప్పిన పూజా.. అలా అడగడంలో తప్పేముందని వ్యాఖ్యానించింది. ‘కేవలం నటీమణుల విషయంలోనే ఇలా ఎందుకు మాట్లాడుతారు.? హీరో ఎవరైనా పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తే ఎవరూ ఎందుకు నోరు మెదపరు.?’ అంటూ ప్రశ్నించిందీ బుట్టబొమ్మ. ఇక ట్రోలింగ్ చేస్తున్న వారి గురించి మాట్లాడుతూ.. కొందరికి కొన్ని అభిప్రాయాలుంటాయని, ఎందుకంటే వాళ్లు చేసే పని అదేనని ట్రోలర్స్‌కు గట్టిగానే సమాధానం ఇచ్చింది. రెమ్యూనరేషన్ ప్రొఫెషన్‌లో భాగమేనని చెప్పిన పూజా.. ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది ప్రొడ్యూసర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది. మరి ఈ రెమ్యునరేషన్ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.