UP Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో అవతార పురుషుడు పరశురాముడి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు..!

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయా పార్టీలకు అభివృద్ధి, పారదర్శక పాలన, సంక్షేమ పథకాలు ఇవన్ని అప్రధానమైపోయాయి. అన్ని పార్టీలు పురాణ పురుషులనే నమ్ముకుంటున్నాయి..

UP Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో అవతార పురుషుడు పరశురాముడి చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు..!
Up Elections
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 20, 2022 | 8:29 PM

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయా పార్టీలకు అభివృద్ధి, పారదర్శక పాలన, సంక్షేమ పథకాలు ఇవన్ని అప్రధానమైపోయాయి. అన్ని పార్టీలు పురాణ పురుషులనే నమ్ముకుంటున్నాయి.. ఇప్పటికే శ్రీరాముడితో రాజకీయాలను చేసిన భారతీయ జనతాపార్టీ ఇప్పుడు మహా విష్ణువు దశావతారాలలో ఆరవ అవతారమైన పరశురాముడి సాయం కోరుతోంది. నిజానికి పరశురాముడికి అత్యంత ప్రాధాన్యతను కల్పించింది, పరశురామ జయంతిని సెలవుగా ప్రకటించింది అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వమే. గోసాయిగంజ్‌లోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రహదారి పక్కన పరశురాముడి ఆలయం కూడా నిర్మించింది అఖిలేష్‌ ప్రభుత్వం. భార్గవరాముడికి అత్యంత ప్రాధాన్యతను కల్పించడంతో చాలా మంది బ్రాహ్మణ నేతలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

అయితే, ఇప్పుడు బ్రాహ్మణుల ఓట్లు బీజేపీకి చాలా అవసరం. అందుకే ఎస్పీ చేతుల్లోంచి పరశురాముడిని బీజేపీ లాగేసుకుంది. రోజూ రాముడి పేరెత్తందే ఏ పని చేయని బీజేపీ పరశురాముడిని తెరపైకి తెచ్చిందంటే బ్రాహ్మణులను మచ్చిక చేసుకోవాలన్న ఎత్తుగడే ఉంది.. ఇదే సమయంలో బీజేపీ పట్ల బ్రాహ్మణుల్లో కొంచెం అసంతృప్తి గూడుకట్టుకుంది. కోపం కూడా ఉంది. ఎన్నికలకు అట్టే సమయం లేకపోవడంతో నష్ట నివారణ చర్యలను మొదలు పెట్టింది బీజేపీ. వెంటనే లక్నోలోని కృష్ణానగర్‌లో 11 అడుగుల ఎత్తైన పరశురాముడి విగ్రహాన్ని ఆవిష్కరించింది. బీజేపీ బ్రాహ్మణ నేత, ఉప ముఖ్యమంత్రి దినేశ్‌శర్మ అన్ని తానై ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో కేబినెట్‌ మినిస్టర్‌ బ్రిజేష్‌ పాఠక్‌, ఎంపీ రీటా బహుగుణ జోషి కూడా పాల్గొన్నారు.

పరశురాముడు విష్ణువు అవతారమే అయినప్పటికీ ఆయన పేరు పెద్దగా ఎవరూ పెట్టకోరు.. ఆయనకు గుళ్లు కూడా కనిపించవు. ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఆయన అవసరం ఏర్పడింది. అఖిలేష్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పరశురామ జయంతిని సెలవుగా ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి రాగానే యోగి దాన్ని రద్దు చేశారు. శుభాకాంక్షల యాడ్‌ మాత్రమే ఇవ్వసాగారు. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న జితేంద్ర ప్రసాద దీనిపై రుసరుసలాడారు. సెలవును పునరుద్ధరించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఇప్పుడాయన బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆ విషయం మర్చిపోయి ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో బీసీ, దళిత, ముస్లిం వర్గాల తర్వాత రాజకీయ పార్టీల దృష్టంతా బ్రాహ్మణ ఓటర్లపైనే ఉందనేది కాదనలేని వాస్తవం.

ఎందుకంటే యూపీలో బ్రాహ్మణుల జనాభా 12 శాతం కంటే ఎక్కువే ఉంది. బ్రాహ్మణ ఓటర్లు 15 శాతం కంటే ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు అక్కడ చాలానే ఉన్నాయి. బీజేపీ పరశురాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనుక బ్రాహ్మణులను బుజ్జగించి ఆకట్టుకునే ప్రయత్నం తప్ప మరోటి లేదని విపక్షాలు అంటున్నాయి. చాలా రాష్ట్రాలలో బ్రాహ్మణుల శాతం మూడు నాలుగుకు మించదు. అదే ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాఖండ్‌ విడిపోయిన తర్వాత యూపీలో బ్రాహ్మణుల శాతం కొంచెం తగ్గింది. అయినప్పటికీ పది శాతానికిపైగానే ఉంది. అసెంబ్లీ స్థానాలలో సగానికి సగం సీట్లు అవధ్‌, పూర్వాంచల్‌ ప్రాంతాలలో ఉన్నాయి. అక్కడ బ్రాహ్ముణులు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్ధికబలం, రాజకీయబలం కూడా ఎక్కువే! బ్రాహ్మణుల్లో హింసాప్రవృత్తి తక్కువగా ఉంటుందనుకుంటారు కానీ యూపీలో మాత్రం ఆ సామాజికవర్గంంలో గుండాలు, హంతకులు కూడా కనిపిస్తారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికీ రాజపుత్రులదే ఆధిక్యం. ఇతర కులాలను అణచివేడంలో ముందుంటారు. రాజకీయబలం కూడా ఎక్కువగానే ఉంది. అక్కడ రాజపుత్రులకు బ్రాహ్మణులకు అస్సలు పడదు. అందుకే బ్రాహ్మణులు కాంగ్రెస్‌ పక్షం వహించేవారు. గోవింద వల్లభపంత్‌, కమలాపతి త్రిపాఠి, హెచ్‌ఎన్‌ బహుగుణ, శ్రీపతి మిశ్రా వంటి బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు సంబంధించినంత వరకు నారాయణ్‌ దత్‌ తివారి ఆఖరి బ్రాహ్మణ ముఖ్యమంత్రి. 1989 తర్వాత మండల్‌ రాజకీయాలు ఊపందుకున్నాయి. యూపీలో బీసీలంతా ఒక్కటయ్యారు. కాంగ్రెస్ బలహీనపడటం మొదలయ్యింది. బ్రాహ్మణుల ఓటు బ్యాంక్‌ కూడా చీలిపోయింది.

వెనుకబడిన సామాజికవర్గాలను, దళితులను ఏకం చేసి, యూపీ రాజకీయా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశారు బహుజన్‌ సమాజ్‌పార్టీ అధినేత్రి మాయావతి. అధికారంలోకి ఉన్నంత వరకు బ్రాహ్మణులను పెద్దగా పట్టించుకోలేదు. పైగా తిలక్‌, తరాజూ, తల్వార్‌.. ఇన్‌కో మారో జూతే చార్‌ అనే నినాదాన్ని ఇచ్చారు. తిలక్‌ అంటే బ్రాహ్మణులను సూచించే బొట్టు. తరాజు అంటే వైశ్యులకు సింబలైన త్రాసు. తల్వారేమో రాజపుత్రుల కత్తి. ఈ ముగ్గురికి నాలుగు చెప్పు దెబ్బలు వేయండి అన్నది ఆ నినాదం. ఎప్పుడైతే మాయావతి తన ప్రాభావన్ని కోల్పోయారో అప్పుడు బ్రాహ్మణులు గుర్తుకొచ్చారు. ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడానికి సతీశ్‌ చంద్ర మిశ్రా అనే బ్రాహ్మణుడికి పార్టీ జనరల్‌ సెకట్రరీ పదవి ఇచ్చారు.

2007 ఎన్నికల్లో సరికొత్త నినాదం ఇచ్చారు. అదే బ్రాహ్మణ్‌ శంఖ్‌ బజాయేగా, హాథీ ఢిల్లీ జాయేగా అన్నది ఆ నినాదం. అంటే బ్రాహ్మణులు శంఖం ఊదుతారు. ఏనుగు (బహుజన్‌ సమాజ్ పార్టీ ఎన్నికల సింబల్‌) ఢిల్లీకి వెళుతుంది అని అర్థం. ఇదేదో బాగానే ఉందనుకున్నారు బ్రాహ్మణులు. రాజపుత్రుల ఆట కట్టించాలంటే మాయావతికి సపోర్ట్‌ చేయడమే బెటరనుకున్నారు. బ్రాహ్మణుల మద్దతుతో మాయావతి ఆ ఎన్నికల్లో 206 సీట్లు గెల్చుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు వివిధ పార్టీల నుంచి గెలిచిన బ్రాహ్మణులు 56 మంది ఉన్నారు. అంటే మొత్తం సీట్లలో 14 శాతం అన్నమాట. 2012 ఎన్నికలకొచ్చేసరికి ఈ సంఖ్య 41కి చేరింది. మాయావతి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణును పట్టించుకోవడం మానేశారు. దాంతో వారంతా సమాజ్‌వాదీ పార్టీకి దగ్గరయ్యారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 42 మంది బ్రాహ్మణులకు టికెట్లు ఇచ్చింది. ఇందులో 23 మంది విజయం సాధించారు. మిగతా పార్టీల నుంచి 24 మంది బ్రాహ్మణులు గెలిచారు.

భారతీయ జనతా పార్టీ నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత యూపీ బ్రాహ్మణులు బీజేపీవైపుకు మళ్లారు. 2017లో బీజేపీ గెలిచింది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేసిందా పార్టీ. యోగి రాజపుత్రుడు కాబట్టి అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రాజపుత్రులను అందలం ఎక్కించాడు, బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేశాడు. పైగా సెలవులు ఎక్కువైపోయాయంటూ 15 సెలవులను రద్దు చేశారు. యోగి తీసేసిన సెలవుల జాబితాలో కర్పూరీ ఠాకూర్‌, ఆచార్య నరేంద్రదేవ్‌, చరణ్‌సింగ్‌, మాజీ ప్రధాని చంద్రశేఖర్‌, అంబేద్కర్‌ వర్ధంతి, కశ్యప మహర్షి, వాల్మీకి, పరశురాముడు, విశ్వకర్మ, మహారాజా అగ్రసేన్‌, హజరత్‌ చిస్తీ ఉర్స్‌, జమాత్‌ ఉల్‌ విదా, ఈదేమిలాదున్నవి, ఛత్‌ పూజా, మహారాణా ప్రతాప్‌ ఉన్నాయి. దేనిపైనా వివాదం రాలేదు కానీ పరశురామ జయంతిని తీసేయడమే వివాదంగా మారింది.

బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు బ్రాహ్మణులను మచ్చిక చేసుకోవడానికే బీజేపీ పరశురామ విగ్రహాన్ని ఆవిష్కరించింది. మరోవైపు మాయావతి కూడా బ్రాహ్మణ్‌ ఉత్పాత్‌ మచాయేగా, హాథీ బఢ్‌తా జయేగా అన్న నినాదాన్ని ఎత్తుకున్నారు. అధికారంలోకి వస్తే పరశురాముడి విగ్రహంతో పాటు ఆయన పేరుతో హాస్పిటల్స్‌ కట్టిస్తానంటున్నారు. బ్రాహ్మణులతో సమావేశాలు పెడుతున్నారు. అఖిలేశ్‌ కూడా తాము అధికారంలోకి వస్తే 108 అడుగుల పరశురామ విగ్రహాన్ని పెడతానని ప్రామిస్‌ చేశారు. మొత్తం 75 జిల్లాలలోనూ జిల్లా కొకటి చొప్పున పరశురామ విగ్రహాలను పెడతానని చెప్పారు. మొత్తం మీద ఉత్తరప్రదేశ్‌లో అన్ని పార్టీలు ఇప్పుడు బ్రాహ్మణుల ఓట్లపై దృష్టి పెట్టాయి. వారి మద్దతు కోసం చేయగలిగిందంతా చేస్తున్నాయి..

Read Also…  Covid Booster Doses: దేశవ్యాప్తంగా మొదలైన బూస్టర్ డోసు పంపిణీ.. మూడో డోస్ ఎలా పొందాలంటే..?