Lok Sabha Polls 2024: 100 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా.. విడుదలకు ముహుర్తం ఫిక్స్..!
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాలన్న లక్ష్యంతో సార్వత్రిక ఎన్నికలకు కమలనాథులు సన్నద్ధమవుతున్నారు. ఎన్డీయే కూటమి 400 సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేస్తున్న బీజేపీ నేతలు..ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి నెలలో విడుదల చేయనుంది.
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాలన్న లక్ష్యంతో సార్వత్రిక ఎన్నికలకు కమలనాథులు సన్నద్ధమవుతున్నారు. ఎన్డీయే కూటమి 400 సీట్లు, సొంతంగా బీజేపీ 370 సీట్లలో విజయం సాధిస్తుందని ఆ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఆ దిశగా సార్వత్రిక ఎన్నికలకు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చి నెలలో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం ఫుల్ ఫోకస్ చేసింది. 100 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలి జాబితా విడుదలకు సంబంధించి ముహుర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే వారం గురువారం (ఫిబ్రవరి 29)నాడు బీజేపీ కేంద్ర నాయకత్వం సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే తమ పార్టీకి చెందిన 100 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించిందట. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్లు కూడా ఉండే అవకాశమున్నట్లు సమాచారం.
బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫిబ్రవరి 29న సమావేశమై..అభ్యర్థుల తొలి జాబితాపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అదే రోజు తొలి జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 370 స్థానాల్లో విజయం సాధించాలని, ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం వచ్చే గురువారం విడుదల చేయనున్న తొలి జాబితా రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యూపీలోని వారణాసి నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2014లో ప్రధాని మోదీకి 3.37 లక్షల మెజార్టీ దక్కగా.. 2019 ఎన్నికల్లో అంతకు మించి 4.8 లక్షల మెజార్టీతో మోదీ విజయం సాధించారు. బీజేపీ వృద్ధనేత ఎల్కే అద్వానీ గతంలో ప్రాతినిధ్యంవహిస్తూ వచ్చిన గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నిక్లలో అమిత్ షా పోటీ చేసి గెలిచారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాల్లో గెలిచే లక్ష్యంతో పనిచేయాలని గత వారం పార్టీ శ్రేణులకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్ధేశం చేశారు. రాబోయే 100 రోజులు చాలా కీలకమని స్పష్టంచేశారు. ఈ 100 రోజుల్లో ప్రతి ఓటరు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుడు, ప్రతి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి దగ్గరకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్కరి నమ్మకాన్ని చూరగొనాలని.. ఎన్డీయే సీట్లు 400, ఒక్క బీజేపీ సీట్లు 370ని అధిగమించాలని పార్టీ జాతీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అధికార భోగాలు అనుభవించేందుకు కాదు.. దేశానికి సేవ చేసేందుకే మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్నట్లు మోదీ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి