AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP – Janasena: 60 నుంచి 70 సీట్లు.. టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలపై సర్వత్రా ఉత్కంఠ.. ఎవరికెన్ని..?

TDP - Janasena MLA Candidates: టీడీపీ, జనసేన నేతలకు సీట్‌ న్యూస్‌. యస్. ఇవాళ టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. సుమారు 60 నుంచి 70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే వీటిలో టీడీపీకి ఎన్ని, జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనే దానిపై రెండు పార్టీల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు పొత్తుల విషయంలో ఇంతవరకు ఏం తేల్చని బీజేపీ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధం అంటోంది. పొత్తుల ముడిలో బీజేపీ చిక్కుముడి ఇంకా వీడకపోవడం.. ఏపీ పాలిటిక్స్‌లో ఉత్కంఠ రేపుతోంది.

TDP - Janasena: 60 నుంచి 70 సీట్లు.. టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలపై సర్వత్రా ఉత్కంఠ.. ఎవరికెన్ని..?
Pawan Kalyan -Chandrababu Naidu
Shaik Madar Saheb
|

Updated on: Feb 24, 2024 | 8:34 AM

Share

ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న ఉదయం ఈనాడే ఎదురవబోతోంది. టీడీపీ, జనసేన నేతల హృదయాలను తాకబోతోంది. సీట్‌ న్యూస్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న టీడీపీ, జనసేన నేతల సుదీర్ఘ నిరీక్షణకు తెర పడనుంది. ఇప్పటిదాకా ఊరిస్తూనే ఉన్న సీట్ల పంపకంపై రెండు పార్టీలు తొలి అడుగు వేయనున్నాయి. టీడీపీ, జనసేన ఇవాళ… ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నాయి. ఇవాళ ఉదయం 11.40కి ముహూర్తం ఖరారు చేశారు. సరిగ్గా ఇదే సమయానికి రెండు పార్టీల ఉమ్మడి లిస్టు విడుదల అవుతుంది. 60 నుంచి 70 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్య నేతలంతా అందుబాటులో ఉండాలని ఇరు పార్టీలు, తమతమ పార్టీ వర్గాలకు సూచించాయి. ఉదయం 9 గంటలకల్లా పార్టీ ఆఫీసుకు రావాలని సమాచారం అందించాయి. సైకిల్‌ సైన్యం, జనసైన్యం ఇప్పుడు తమ తమ పార్టీల నుంచి ఎవరు అభ్యర్థులు కాబోతున్నారా అని ఊపిరి బిగబట్టుకుని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు,

టీడీపీకి ఎన్ని సీట్లు? జనసేనకు ఎన్ని సీట్లు?

గుంటూరు వెస్ట్‌, రాజమండ్రి రూరల్‌, తెనాలి, తిరుపతి… ఇలా కొన్ని అసెంబ్లీ సీట్లలో టీడీపీ, జనసేన నేతల మధ్య పోటీ నెలకొంది. ఆ సీట్లపై రెండు పార్టీల నేతల కర్చీఫులు వేసుకుని కూర్చున్నారు. వాటి కోసం రెండు పార్టీల నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. అలాంటి వివాదాస్పద సీట్లు వదిలేసి, ఎలాంటి వివాదాలు లేని అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వీటిలో టీడీపీకి ఎన్ని సీట్లు దక్కుతాయి? జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది రెండు పార్టీల నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై ఉండవల్లిలోని నివాసంలో టీడీపీ ముఖ్యనేతలతో కలిసి చంద్రబాబు కసరత్తు చేశారు. మరోవైపు ఇదే అంశంపై మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో పవన్‌ కల్యాణ్‌ కూడా మంతనాలు జరిపారు.

అనకాపల్లి ఎంపీ బరిలో నాగబాబు

ఇప్పటికే కొన్ని అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. విడివిడిగా ఇన్‌చార్జీలను ప్రకటించారు. అనకాపల్లి ఎంపీ సీటు నుంచి నాగబాబు పోటీ చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో నలుగురు ఇన్‌చార్జీలను పవన్‌ ప్రకటించారు. భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస్‌, గాజువాకకు సుందరపు సతీష్‌, పెందుర్తిలో పంచకర్ల రమేష్‌, యలమంచిలికి సుందరపు విజయ్‌ కుమార్‌లను జనసేన ఇన్‌చార్జీలుగా ప్రకటించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో…రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్‌ ఇప్పటికే చెప్పేశారు. ఇక టీడీపీ, జనసేన మధ్య పీటముడిగా మారిన రాజమండ్రి రూరల్‌లో కూడా జనసేన పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు సీట్లు జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు భీమవరం అసెంబ్లీ బరిలో పవన్‌ కల్యాణ్‌ ఉంటారని చెబుతున్నారు. ఇక మండపేటలో టీడీపీ ఇన్‌చార్జీగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరు ప్రకటించిన చంద్రబాబు, అరకులో టీడీపీ అభ్యర్థిగా దొన్ను దొర పేరును ప్రకటించారు.

అన్ని సీట్లలో పోటీకి బీజేపీ సన్నాహాలు!

ఇక బీజేపీతో కూడా పొత్తు ఉంటుందని, మూడు పార్టీలు కలిసే ముందుకు వెళతాయని జనసేన, టీడీపీ ఢంకా బజాయించి చెబుతున్నాయి. అయితే బీజేపీతో సంబంధం లేకుండా ప్రస్తుతం టీడీపీ, జనసేనలు తమ ఉమ్మడి లిస్టుతో ముందుకు సాగుతుండడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీ మాత్రం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నామని చెబుతోంది. పొత్తుల విషయంపై ఇప్పటివరకు బీజేపీ అధిష్టానం తమకేం చెప్పలేదన్నారు ఏపీ పార్టీ చీఫ్‌ పురంధేశ్వరి. అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పడం.. పొత్తుల మేటర్‌లో పొలిటికల్‌ హీటర్‌గా మారింది.

పురంధేశ్వరి మాటలతో.. పొత్తుకు బీజేపీ కలిసి వస్తుందో రాదో అనే సందేహాలు మొదలయ్యాయంటున్నారు విశ్లేషకులు. ఓవైపు పొత్తుల ముడిలో బీజేపీ చిక్కుముడి వీడకపోయినా, టీడీపీ, జనసేన ముందుకు దూసుకుపోతున్నాయి. ఉమ్మడి అభ్యర్థుల జాబితాను మరి కాసేపట్లో ప్రకటించబోతున్నాయి. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..