Himachal Pradesh Elections: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో పార్టీల ఉచిత మంత్రం ప‌నిచేస్తుందా.. ప్ర‌ధాన పోటీ వీరి మ‌ధ్యేనా..

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ గ‌డువు ఈఏడాది చివ‌రిలో ముగుస్తుంది. ఈనేప‌థ్యంలో డిసెంబ‌ర్ లోపు ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ప్ర‌స్తుతం  జైరాం ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం..

Himachal Pradesh Elections: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో పార్టీల ఉచిత మంత్రం ప‌నిచేస్తుందా.. ప్ర‌ధాన పోటీ వీరి మ‌ధ్యేనా..
Himachal Pradesh Elections 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు నవంబరు మాసంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Follow us

| Edited By: Team Veegam

Updated on: Aug 25, 2022 | 4:07 PM

Himachal Pradesh Elections: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ గ‌డువు ఈఏడాది చివ‌రిలో ముగుస్తుంది. ఈనేప‌థ్యంలో డిసెంబ‌ర్ లోపు ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. ప్ర‌స్తుతం  జైరాం ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండ‌గా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం కాంగ్రెస్ త‌హ‌త‌హ‌లాడుతోంది. ఇటీవ‌ల పంజాబ్ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితంతో దేశ వ్యాప్తంగా పార్టీని విస్త‌రించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు. ఇప్ప‌టికే ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉండ‌టంతో పాటు.. గోవాలో 6 శాతం ఓట్లు సాధించ‌డం ద్వారా మ‌రో రాష్ట్రంలో చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఓట్లు సాధిస్తే ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ గుర్తింపు ల‌బించే అవ‌కాశం ఉంది. దీంతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్, గుజ‌రాత్ లో స‌త్తా చాటాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచిస్తోంది. గుజ‌రాత్ లో న‌రేంద్ర‌మోదీ, అమిత్ షా ప్ర‌భావాన్ని త‌ట్టుకుని స‌త్తా చాట‌డం అంత సుల‌భం కాద‌ని భావించిన కేజ్రీవాల్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో స‌త్తా చాటి వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి జాతీయపార్టీ గుర్తింపు పొందాల‌ని భావిస్తోంది. అందుకోసం ఉచిత హామీలు ఇవ్వ‌డం ద్వారా ప్ర‌జ‌లను ఆక‌ర్షించేప‌నిలో ప‌డింది.

ఢిల్లీ, పంజాబ్ లో అమ‌లు చేస్తున్న విధంగా గృహ స‌ముదాయాల‌కు 300 యూనిట్ల వ‌ర‌కు ఉచితంగా అందిస్తామ‌న్న హామిని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తోంది. సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు పెరిగిన విద్యుత్తు ఛార్జీల‌తో ఇబ్బందులు ప‌డుతున్న వేళ‌.. ఉచిత విద్యుత్తు హామీతో ప్ర‌జ‌ల‌ను ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆమ్ ఆద్మీ ఉచిత హామీల‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు త‌మ వ్యూహాల‌కు ప‌దును పెట్టాయి. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో త‌మ‌కు సానుకూల ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచిస్తున్న‌ప్ప‌టికి.. పంజాబ్ వంటి ఫ‌లితం ఇక్క‌డ ల‌భించ‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇక్క‌డ ఆమ్ ఆద్మీ తృతీయ శ‌క్తిగా ఎదిగేందుకు అవ‌కాశాలు త‌క్కువుగానే ఉన్నాయ‌న్న ప్ర‌చారం సాగుతోంది. అర‌వింద్ కేజ్రీవాల్ పై మాత్ర‌మే పూర్తిగా ఆధార‌ప‌డిన ఆమ్ ఆద్మీ పార్టీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని స్థానిక ప‌రిస్థితుల‌కు త‌గిన‌ట్లు త‌న రాజ‌కీయ వ్యూహాన్ని అనుస‌రించాల్సి ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మ‌రోవైపు త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా భావించే కాంగ్రెస్ కూడా నాయ‌క‌త్వ లేమితో బ‌ల‌హీన‌ప‌డింద‌ని, దీంతో త‌మ గెలుపు ఏక‌ప‌క్ష‌మేన‌ని బీజేపీ మంత్రి ఒక‌రు ఇటీవ‌ల ఓ వార్త సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటూ వ‌చ్చింది. ఆపార్టీకి ఇక్క‌డ సంప్రాదాయ ఓటు బ్యాంకు ఉంది. 1977లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో జ‌న‌తా పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు తొలిసారి కాంగ్రెసేత‌ర సీఎం శాంత కుమార్ సీఎం పీఠం అధిరోహించారు. 1985 నుంచి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ లు ప్ర‌త్యామ్నాయంగా పాలిస్తూ వ‌స్తున్నాయి. దీంతో ఈసారి ప్ర‌జ‌లు త‌మ‌కు అధికార‌మిస్తార‌నే ధీమా కాంగ్రెస్ లో నెల‌కొంది. అయితే ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌గ‌లిగే పేరున్న నాయ‌కులు పెద్ద‌గా కాంగ్రెస్ లో క‌న్పించ‌డం లేదు. ఒక రోజు క్రితం కాంగ్రెస్ కు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు క‌మ‌లం పార్టీలో చేరారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన  పవన్ కుమార్ కాజల్, లఖ్విందర్ సింగ్ కూడా ఉన్నారు.  పవన్ కుమార్ కాజల్ ని పార్టీ గౌర‌వ అధ్య‌క్షుడి ప‌ద‌వి నుంచి తొల‌గించిన వెంట‌నే ఆయ‌న హ‌స్తం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీ మార‌డం కాంగ్రెస్ కు దెబ్బ‌గానే చెప్పుకోవాలి.

ఇవి కూడా చదవండి

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు ఆరుసార్లు సీఎంగా పనిచేసిన వీర‌భ‌ద్ర సింగ్ భార్య ప్ర‌తిభా సింగ్ పార్టీ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంపై హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ప్ర‌ధానంగా దృష్టిసారించింది. ఆమాద్మీ మాదిరిగానే గృహ వినియోగ‌దారుల‌కు ఉచిత విద్యుత్తు హామీతో పాటు, పాత పెన్ష‌న్ స్కీమ్ ను తిరిగి తీసుకువ‌స్తామని కాంగ్రెస్ హామీ ఇస్తూ వ‌స్తోంది. అలాగే 18 నుంచి 60 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సున్న మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.1500 ఆర్థిక సాయం అందిస్తామ‌ని హామీ ఇచ్చింది. దీనిద్వారా మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది హ‌స్తం పార్టీ. ఎన్నిక‌ల‌కు ఇంకా నాలుగు నెల‌ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికి ఉచిత హ‌మీల‌తో అన్ని ప్ర‌ధాన పార్టీలు ప్ర‌జ‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ‌కార్య‌క్ర‌మాల‌ను హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ లో అమ‌లు చేస్తామ‌ని, ప్ర‌స్తుతం ధ‌ర‌ల పెంచుతూ పోయే బీజేపీ ప్ర‌భుత్వంతో అభివృద్ధి సాధ్యంకాద‌ని ఛ‌త్తీస్ ఘ‌డ్ సీఎం, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు భూపేష్ బ‌ఘేల్ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే బ కేంద్రంలో ప్ర‌ధాన‌మంత్రి, రాష్ట్రంలో సీఎం జైరాం ఠాకూర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలే త‌మ‌ను మ‌ళ్లీ అదికారంలోకి తీసుకొస్తాయ‌నే విశ్వాసంతో బీజేపీ ఉంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్న ప్రాంతాల‌ను గుర్తించి.. వారికి కొత్త హామీలు ఇవ్వ‌డం , ప్ర‌స్తుత స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం ద్వారా వారి ఓట్ల‌ను పొందేందుకు ప్లాన్ చేస్తోంది. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, ప‌రిమితుల‌తో కూడిన ఉచిత విద్యుత్తు, మ‌హిళ‌ల‌కు బ‌స్సు ఛార్జీల త‌గ్గింపు, ఆయుష్మాన్ భార‌త్ వంటి ప‌థ‌కాలు త‌మ‌ను గెలిపిస్తాయ‌ని బీజేపీ భావిస్తోంది. వీటికి తోడు జై రాం ఠాకూర్ అవినీతి ర‌హిత‌పాల‌న త‌మ‌ను అధికారంలోకి తీసుకొస్తాయ‌ని బీజేపీ పూర్తి విశ్వాసంతో ఉంది. ఇలా హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ లో గెలుపుకోసం ఏపార్టీకి ఆపార్టీ త‌మ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నాయి.

ఇది కూడా చదవండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..