Telangana: 70 ఏళ్లుగా సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేయని గ్రామస్తులు.. ఎట్టకేలకు నెరవేరిన ఓటర్ల కల..!
ఆ ఊరు ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికల కోసం ఓటేసింది. సర్పంచ్‌ను ఎన్నుకోవాలనుకున్న ఆ ఊరి ఓటర్ల కల 70 ఏళ్లకు నెరవేరింది. ఎమ్మెల్యే, ఎంపీ సహా ఇతర ఎన్నికలకు ఓటు వేసినా.. ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ గ్రామ ఓటర్లు.. ఈ సారి జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకోవడం ఓ విశేషం.

ఆ ఊరు ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికల కోసం ఓటేసింది. సర్పంచ్‌ను ఎన్నుకోవాలనుకున్న ఆ ఊరి ఓటర్ల కల 70 ఏళ్లకు నెరవేరింది. ఎమ్మెల్యే, ఎంపీ సహా ఇతర ఎన్నికలకు ఓటు వేసినా.. ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆ గ్రామ ఓటర్లు.. ఈ సారి జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా సర్పంచ్‌ను ఎన్నుకోవడం ఓ విశేషం.
ఆ గ్రామంలో ఏడు దశాబ్దాలుగా అసలు సర్పంచ్ ఎన్నికల మాట లేదు. పంచాయితీ ఎన్నికల్లో ఆ ఊరోళ్లు ఓటు వేసిన దాఖలాలే లేవు. 70 ఏళ్లు దాటినా స్థానిక ఎన్నికల్లో ఆ ఊరివాళ్ల చేతికి సిరా చుక్క తాకలేదు. కానీ చరిత్రను తిరగరాస్తూ 7 దశాబ్దాల తర్వాత తొలిసారి పంచాయితీ ఎన్నికలను చూసింది ఆ గ్రామం. అందుకు కారణం ఆ గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏడు దశాబ్దాలుగా ఏకగ్రీవమవుతూ వస్తుండటమే.
అయితే ఈసారి మాత్రం ఆ పరిస్థితి మారింది. ఎన్నికలు జరిగి తీరాల్సిందే ఆశావాహులు పట్టుపట్టారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్య పద్దతిలో గెలిచి నిలవాల్సిందే అని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయంతో ఎట్టకేలకు ఏడు దశాబ్దాల తర్వాత ఆ ఊరికి పంచాయతీ పండుగ వచ్చింది. సర్పంచ్ ఎన్నికల్లో తొలి సారి ఓటు హక్కు వినియోగించుకుని మురిసిపోయారు 70 ఏళ్లు దాటిన వృద్దులు. పుట్టి బుద్దెరిగిన నాటి నుండి ఈ సారే సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేశామంటూ సంబరపడ్డారు ఆ గ్రామ వృద్ద ఓటర్లు.
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీలో ఈ దృశ్యాలు కనిపించాయి. గత 69 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతూ వస్తున్న ఈ పంచాయతీ స్థానం ఈసారి ఓట్ల పండగకు సిద్దమైంది. గత ఏడు దశాబ్దాల ఆనవాయితీకి భిన్నంగా ఓటు హక్కు ద్వారా గెలుస్తామంటూ ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు బరిలోకి దిగడంతో బరంపూర్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కల నెరవేరింది. 1956లో ఏర్పడిన ఈ పంచాయతీకి 69 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. ప్రతి ఎన్నికల సమయంలో గ్రామ పెద్దల తీర్మానంతో ఏకగ్రీవాల పర్వం కొనసాగింది. బరంపూర్ పంచాయతీ పరిధిలో మొత్తం పది వార్డులు ఉన్నాయి. సుమారు మూడు వేల జనాభా ఉన్న ఈ గ్రామ పంచాయతీలో 2,300 మంది ఓటర్లు ఉన్నారు. తొలిసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశామన్న ఆనందం ఆ గ్రామవాసులు.. అందులోనూ వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సర్పంచ్ స్థానానికి పోటీ లేకుండా గ్రామ పెద్దలు పూనుకుని ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. గ్రామ ప్రజలు అందరు ఏకతాటిపై పైకి వచ్చి గ్రామాన్ని అభివృద్ది చేసుకుంటూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఆ ఆనవాయితీ కొనసాగే పరిస్థితి లేకుండా పోయింది. ఈసారి సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని గ్రామ పెద్దలు ప్రయత్నించినా.. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మెస్రం దేవ్ రావు బరిలోకి దిగాడు. బరంపూర్ గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న మదునాపూర్ గ్రామానికి చెందిన మెస్రం దేవ్ రావు బీఆర్ఎస్ మద్దతుతో పోటీకి దిగారు. అయితే కొలాంగూడకు చెందిన సిడాం లక్ష్మణ్ రావు కాంగ్రెస్ మద్దతుతో పోటీకి సిద్ధమయ్యారు. దీంతో మూడవ విడతలో భాగంగా బరంపూర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చివరికి బరంపూర్ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మెస్రం దేవ్ రావు విజయం సాధించారు. సమీప కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి సిడాం లక్ష్మణ్ రావుపై 300 పైగా ఓట్లతో గెలుపొందారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




