క్రికెట్‌ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి… పురుగుల మందు తాగి ఆత్మహత్య

Man Suicide to cricket betting : క్రికెట్‌ బెట్టింగ్‌ మరో నిండు ప్రాణాలను బలితీసుకుంది. బెట్టింగ్‌లో అప్పులపాలైన ఓ యువకుడు తీవ్ర మనస్తాపంతో..

  • Balaraju Goud
  • Publish Date - 11:52 am, Wed, 27 January 21
క్రికెట్‌ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి... పురుగుల మందు తాగి ఆత్మహత్య

Man Suicide to cricket betting : క్రికెట్‌ బెట్టింగ్‌ మరో నిండు ప్రాణాలను బలితీసుకుంది. బెట్టింగ్‌లో అప్పులపాలైన ఓ యువకుడు తీవ్ర మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నానికి చెందిన ఆకుల వంశీ రామ తిరుపతిరావు(30) కంప్యూటర్‌ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేవాడు. అదే గ్రామానికే చెందిన యువతిని పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు.

అయితే, మూడు ఏళ్ల క్రితం వంశీ ఉద్యోగం పోవడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి భార్యతో విడిగా ఉంటున్నాడు వంశీ. ఉద్యోగం పోయిన తర్వాత వంశీ స్వగ్రామానికి వచ్చి క్రికెట్‌ బెట్టింగులు కడుతూ సుమారు రూ. 1.50కోట్ల మేర అప్పుల పాలయ్యాడు. వంశీ తండ్రి కొంత మేరకు అప్పులను తీర్చాడు. అయినప్పటికీ ఆయన బెట్టింగులు వేయటం మానుకోలేదు. ఎవరూ ఆతనికి అప్పు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. దీనికితోడు చేసిన అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వంశీ పొలంలోని పశువులశాలలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొద్ది సేపటికి బాధ భరించలేక కేకలు వేయడంతో పక్కనే పొలంలో పని చేసుకుంటున్న కుటుంబసభ్యులు హుటాహుటీన అమలాపురంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also… ఎర్రకోట వైపు రైతులను ప్రేరేపించింది ఎవరు..? ఆ హీరోతో ఢిల్లీ ఉద్రిక్తతలకు సంబంధమేంటీ..?