Crime News: క్షణికావేశం ఒకరి ప్రాణాలు తీసింది.. పెళ్లి రోజు వేడుక చేసుకుందామన్న భార్యను హతమార్చిన భర్త!
విశాఖ జిల్లాలో పెళ్లి వార్షికోత్సవం రోజే భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగి.. ఒకరి హత్యకు దారితీసింది.
Visakhapatnam Husband killed wife: పెళ్లంటే నూరేళ్ల పంట..! ఒకసారి మూడు ముళ్ళు వేయగానే.. ఆరోజు ఆలుమగలకు జీవితంలో మరపురాని జ్ఞాపకం. అందుకే ప్రతి ఏటా పెళ్లి రోజున చాలా మంది ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఏమీ లేని వారు సైతం ఆరోజు ఆలుమగలు సరదాగా గడపాలని కోరుకుంటారు. కానీ విశాఖ జిల్లాలో పెళ్లి వార్షికోత్సవం రోజే భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగి.. ఒకరి హత్యకు దారితీసింది. భార్యపై కోపం పెంచుకున్న భర్త.. సహనం కోల్పోయి తలపై మోది చంపేశాడు. ఆనందపురం మండలం సొంట్యం లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
చెన్నై ప్రాంతానికి చెందిన ప్రసాద్ 20 ఏళ్ల క్రితం పెందుర్తిలోని సొంట్యంకు వలస వచ్చాడు. పదేళ్ల క్రితం లలితాదేవి అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భార్య లలితాదేవి భర్తతో విడిపోయింది. ఆ తర్వాత విజయనగరానికి చెందిన రవి కుమార్ అనే వ్యక్తితో లలితాదేవి వివాహం చేసుకుంది. అప్పటి నుంచి భర్త కుమారుడితో కలిసి లలితాదేవి సొంట్యం లోనే ఉంటున్నారు. భార్యాభర్తలిద్దరూ స్థానికంగా ఉన్న దేవాలయాల్లో పూజలు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. కొన్నాళ్ల పాటు కాపురం సజావుగా సాగినా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్వల్ప మనస్పర్థలు తలెత్తాయి.
ఈ క్రమంలోనే శనివారం లలితాదేవి, రవికుమార్ వివాహ వార్షికోత్సవం వచ్చింది. పెళ్లి రోజు కూడా భర్త తనతో మాట్లాడకపోవడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. కనీసం బయటకు కూడా తీసుకు వెళ్లలేదని అతని ప్రశ్నించింది లలితాదేవి. ఇదే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలై చివరికి మాటా మాటా పెరిగింది. సహనం కోల్పోయిన రవికుమార్.. అక్కడే ఉన్న సుత్తితో లలితాదేవి తలపై బలంగా మోదాడు. దీంతో అక్కడికక్కడే ఆమె కుప్పకూలిపోయింది. దీంతో స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించేలోపే లలితదేవి ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రవికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పెళ్లి రోజే లలితాదేవి ఇలా భర్త చేతుల్లోనే హత్యకు గురికావడం స్థానికులను కలచివేసింది.
Read Also…. Viral Video: మంచు నీటిలో చిక్కుకున్న కుక్క… కాపాడిన పోలీసు ఆఫీసర్లు.. వీడియో వైరల్..