Treasure hunt: అడ్డెడ్డె.. అస్సలు అడ్డూఅదుపు లేదు.. గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు, జేసీబీతో తవ్వకాలు
నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. నిధుల వేటలో క్షుద్రపూజలు జరిపి.. గుట్టుగా తవ్వకాలు జరపడాన్ని గమనించిన స్థానికులు వీఆర్వో సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. నిధుల వేటలో క్షుద్రపూజలు జరిపి.. గుట్టుగా తవ్వకాలు జరపడాన్ని గమనించిన స్థానికులు వీఆర్వో సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వరికుంటపాడు మండలం కనియంపాడు శివారులోని చెరువు సమీపంలో అర్ధరాత్రి గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు చేపట్టారు. ఏకంగా జేసీబీని తీసుకొచ్చి తతంగం పూర్తిచేసే ప్రయత్నం చేశారు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్న ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. గుట్టుగా తవ్వకాలు జరపడాన్ని గమనించి వీఆర్వో సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గుప్తనిధుల కోసం అక్కడ క్షుద్రపూజలు చేసినట్లు గుర్తించారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించిన నలుగురు వ్యక్తులతో పాటు సంఘటనా స్థలంలో ఒక జేసీబీ, కారును పోలీసులు సీజ్ చేశారు. చెరువు సమీపంలో గుప్త నిధులు ఉన్నాయనే ఆశతో తవ్వకాలు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్యనీయాంశమైంది.
కాగా ఈ మధ్యకాలంలో గుప్త నిధుల తవ్వకాలు, అతీత శక్తులు కోసం క్షుద్రపూజలు చేస్తున్న ఘటనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నాయి. రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అవుదామని కొందరు.. అతీత శక్తులతో సమాజంపై ఆధిపత్యం ప్రదర్శించాలని మరికొందరు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని.. నిందితులకు న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు వేయించాలని పలువురు కోరుతున్నారు.
Also Read: దౌర్భాగ్యం.. అన్నం పెట్టే రైతన్నలపైనా మీ ప్రతాపం.. కోట్లు కొల్లగొట్టి పారిపోతే మాత్రం నో యాక్షన్
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా.. ప్రకటించిన ఉన్నత విద్యామండలి