Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. హైవే పై అదుపుతప్పి బీభత్సం సృష్టించిన డీసీఎం.. ముగ్గురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై (Hyderabad - Vijayawada High way) డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు...
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై (Hyderabad – Vijayawada High way) డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం వద్ద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఐరన్ లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం.. అదుపు తప్పి డివైడర్ ను దాటి హైదరాబాద్ వైపు వస్తున్న మూడు కార్లపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనలో నుజ్జు నుజ్జయిన కార్లు, డీసీఎం వాహనాన్ని హైవేపై నుంచి తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. మరణించిన వారిలో ఇద్దరికి ఘటనాస్థలంలో తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.
గాయపడినవారందరూ మహేంద్ర జైలో కారులో ప్రయాణిస్తున్నారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గురైన మరో రెండు కార్లలోని వ్యక్తులు ఎక్కడికి వెళ్లారో వివరాలు తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. చాలా సమయం వరకు కలిగిన ట్రాఫిక్ తో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి