Viral: కొరియర్ రాలేదంటూ కస్టమర్ వాకబు.. డెలివరీ బాయ్‌కు ఫోన్ చేయగా దెబ్బకు ఫ్యూజులౌట్!
డెలివరీ చేసేందుకు యజమాని ఇచ్చిన బంగారాన్ని.. సీదా కస్టమర్‌కు చేర్చకుండా దాన్ని పట్టుకుని..
డెలివరీ చేసేందుకు యజమాని ఇచ్చిన బంగారాన్ని.. సీదా కస్టమర్‌కు చేర్చకుండా దాన్ని పట్టుకుని ఉడాయించారు ఇద్దరు డెలివరీ బాయ్స్. దీనితో ఆ యజమాని చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని కొత్తపేట ఎస్‌ఎస్ టవర్స్‌లో సునీల్ కుమార్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ‘జైమాతాది లాజిస్టిక్స్’ పేరుతో 5 ఏళ్లుగా కొరియర్ సర్వీస్ నిర్వహిస్తున్నారు. ముంబై నుంచి కొరియర్ ద్వారా వచ్చే బంగారు ఆభరణాలు, డైమండ్స్‌ను రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు డెలివరీ చేసేందుకు ఇద్దరు వ్యక్తులను డెలివరీ బాయ్స్‌గా పెట్టుకున్నాడు. వారికి అప్పుడప్పుడూ కమిషన్ ఇస్తూ వచ్చాడు.
ఇదిలా ఉంటే.. ఈ నెల 7వ తేదీన ముంబై నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు కార్గో విమానంలో బంగారు ఆభరణాల బాక్సులు సునీల్ కుమార్‌కు వచ్చాయి. వాటిని రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు డెలివరీ ఇచ్చేందుకు సునీల్.. విడివిడిగా ప్రత్యేక బాక్సుల్లో ప్యాకింగ్ చేయించాడు. వాటిని డెలివరీ బాయ్స్ అయిన రాజీవ్ శర్మ, భవానీ సింగ్‌లకు అందజేశాడు. కొరియర్ వచ్చిన తర్వాతి రోజు అనగా జూలై 8వ తేదీన వారిని రైలెక్కించి పంపించాడు.
కొద్దిసేపటి తర్వాత వారిద్దరి ఫోన్లు స్విచాఫ్ వచ్చాయి. సునీల్ కుమార్‌కు కంగారు మొదలైంది. కస్టమర్లకు ఫోన్ చేసి కనుక్కోగా.. డెలివరీ ఇంకా అందలేదని సమాధానం వచ్చింది. దీనితో ఆ ఇద్దరూ బంగారు ఆభరణాలతో ఉడాయించారని సునీల్‌కు అర్ధమైంది. ఇక చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించాడు. సుమారు రూ. 1.5 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు దొంగలించబడ్డాయని కంప్లయింట్ ఇచ్చాడు. కాగా, ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.