Surat Fire Accident: సూరత్‎లో అగ్నిప్రమాదం.. ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకిన కార్మికులు.. ఇద్దరు మృతి..

గుజరాత్‌ సూరత్ జిల్లాలోని ఐదు అంతస్తుల ప్యాకేజింగ్ యూనిట్‌లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు. ప్రమాదంలో చిక్కుకున్న దాదాపు 125 మందిని రక్షించారు...

Surat Fire Accident: సూరత్‎లో అగ్నిప్రమాదం.. ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకిన కార్మికులు.. ఇద్దరు మృతి..
Fire Accident
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 18, 2021 | 11:50 AM

గుజరాత్‌ సూరత్ జిల్లాలోని ఐదు అంతస్తుల ప్యాకేజింగ్ యూనిట్‌లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు. ప్రమాదంలో చిక్కుకున్న దాదాపు 125 మందిని రక్షించారు. కడోదర పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వరేలిలో ఈ ఘటన జరిగింది. వివా ప్యాకేజింగ్ కంపెనీ ఐదో అంతస్తులో కార్మికులు పని చేస్తుండగా తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భారీ మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ సాధ్య పడలేదు. ఇంతలోనే యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. ఫైర్ సిబ్బంది ఓ వైపు మంటలను అదుపు చేస్తూ మరోవైపు ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కార్మికులను కాపాడారు.

ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కొంతమంది కార్మికులు భవనంపై నుంచి దూకినట్లు అక్కడున్న స్థానికులు చెప్పారు. “ఈ ఘటనతో ఇద్దరు మరణించారు” అని బార్డోలి డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రూపాల్ సోలంకి అన్నారు. యూనిట్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయని, వెంటనే మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయని కడోదర పోలీస్ ఇన్స్‌పెక్టర్ హేమంత్ పటేల్ తెలిపారు.

అగ్నిమాపక సిబ్బంది125 మందిని రక్షించారని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కెజి వాఘేలా తెలిపారు. భవనం లోపల చిక్కుకున్న 100 మందికి పైగా కార్మికులను రక్షించడానికి హైడ్రాలిక్ క్రేన్‌లను ఉపయోగించినట్లు చెప్పారు. 10కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయని అన్నారు. అగ్నిప్రమాదం ఎలా సంభవించిందో అన్నదానిపై అధికారులు విచారణ చేస్తున్నారు. షాట్ సర్క్యూట్ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

Read Also.. ACB Raids: అన్నాడీఎంకే ముఖ్య నేతపై అవినీతి ఆరోపణలు.. మాజీ మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఏసిబి అధికారులు దాడులు..